Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యం

అదానీ, అంబానీలకు కట్టబెడుతున్న మోదీ సర్కారు
భజన హామీల అమలు గాలికే
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ
పాదయాత్రకు పోటెత్తిన ఎర్రదండు

తిరుపతి : ప్రభుత్వ ఆస్తులన్నీ అదానీ, అంబానీలకు మోదీ సర్కారు కట్టబెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. దేశ సంపదను గుజరాతీ పెట్టుబడిదారులకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ చేపట్టిన పాదయాత్ర నాల్గవ రోజు శుక్రవారం తిరుపతి చేరుకుంది. నగరం లోని జ్యోతిరావు పూలే విగ్రహం నుండి పాదయాత్ర ప్రారంభమైంది పాదయాత్రకు జనం పోటెత్తారు. వందలాది మంది పార్టీ కార్యకర్తలతో తిరుపతి నగరం ఎరుపెక్కింది. బాలాజీ కాలనీ, ప్రకాశం రోడ్‌, గాంధీ రోడ్డు, రైల్వే స్టేషన్‌ మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌ వరకు పాదయాత్ర కొనసాగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రామకృష్ణ మాట్లాడుతూ కరోనా వేళ పేదలు తిండికి అల్లాడితే బడాపారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీ ఆస్తులు వేలకోట్లు పెరిగాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలువిమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, పోర్టులు, జాతీయ రహదారులను సైతం అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడం సిగ్గుచేటన్నారు. రైతులను నట్టేట ముంచే సాగు చట్టాలను రద్దు చేయాలని అన్నదాతలు పది నెలలుగా దిల్లీలో సాగిస్తున్న ఉద్యమం మోదీ సర్కారుకు కనిపించడం లేదని రామకృష్ణ విమర్శించారు. సాగుచట్టాలతో పాటు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27న తలపెట్టిన భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బంద్‌ అనంతరం దేశ రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. బంద్‌కు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, టీడీపీ నేత చంద్రబాబు బహిరంగంగా మద్దతు ఇవ్వాలని, ప్రజా సంఘాలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హరినాథరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ప్రధాన రంగాలను కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణల పేరుతో కాలరాసేందుకు కుట్ర చేస్తున్నారని దునుమాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు టి.జనార్దన్‌, చిన్నం పెంచలయ్య, నాగరాజు, పీఎల్‌ నర్సింహులు, కృష్ణప్ప, గురవయ్య, మురళి, నగర కార్యదర్శి విశ్వనాథ్‌, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి, ప్రజాసంఘాల నాయకులు నదియా, రాధాకృష్ణ, శివ, రాజా, ఉదయ్‌, చలపతి, రామకృష్ణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర నాయక్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రప్ప, సుబ్రహ్మణ్యం నాయకత్వంలో ఆలపించిన ఉద్యమ గేయాలు ప్రజానీకాన్ని చైతన్య పరిచాయి.
టీడీపీ, కాంగ్రెస్‌ సంఫీుభావం : తెలుగుదేశం పార్టీ తిరుపతి అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, ఆర్‌సీ మునికృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మాంగాటి గోపాల్‌రెడ్డి, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు అంజయ్య, ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ కుమార్‌రెడ్డి, తిరుపతి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు మంజునాథ్‌ తదితరులు పాదయాత్రలో పాల్గొని సంఫీుభావం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img