Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

ప్రాజెక్టులకు నిధులేవి?

. కానరాని కాల్వల నిర్మాణం
. రతనాల సీమను రాళ్లసీమగా మార్చారు
. ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమంలో సీపీఐ నేతలు

విశాలాంధ్ర- కడప బ్యూరో : అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోవడంతో నిర్మాణాలు పూర్తి కాక రైతుల మనోవేదనను వినే నాధుడే లేడని, కాలువల నిర్మాణాల ఊసే లేదని, రతనాల సీమగా పేరుగాంచిన రాయలసీమ నేడు రాళ్లసీమగా తయారవడానికి పాలకులే కారణమని సీపీఐ రాష్ట్ర నాయకులు విమర్శించారు. సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం కడప జిల్లాలో అనేక ప్రాజెక్టులను పరిశీలించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నేతృత్వంలోని బృందం ముందుగా రాజోలి ఆనకట్ట నుంచి బ్రహ్మసాగర్‌ ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం మైదుకూరులో విలేకరులతో రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. రిజర్వాయర్లన్నీ నీళ్లతో నిండుకుండలుగా ఉన్నా అనుసంధానించే పిల్ల కాలువలు లేక సాగుకు నీళ్లు అందించలేని దుర్భర పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ ఒక్క ప్రాజెక్టు పని పూర్తి చేసింది లేదనీ, లక్షల ఎకరాలకు నీరిస్తానన్న వాగ్ధానాలు ఒట్టిమాటలేనన్నారు. గండికోట రిజర్వాయర్‌లో 26 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా పిల్ల కాలువలు లేకపోవడంతో సాగుభూములకు నీరివ్వలేని పరిస్థితి దాపురించిందని విమర్శించారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కర్ణాటకలోని తుంగభద్ర ఎగువ భాగాన భద్ర ప్రాజెక్టు నిర్మిస్తే భవిష్యత్‌లో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందనీ, ఈ విషయం తెలిసినా జగన్‌ కేసుల నుంచి బయటపడడానికి ఏమాత్రం ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నాడన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో గతంలో తన తండ్రి ఏర్పాటు చేసిన ఉక్కు ఫ్యాక్టరీకి తిప్పి తిప్పి మళ్లీ శంకుస్థాపన చేయడానికి మాత్రమే జగన్‌ పనికొస్తున్నాడు తప్ప స్టీల్‌ ఫ్యాక్టరీ పూర్తి చేసే ఆలోచన లేదన్నారు. ఫ్యాక్టరీ పూర్తయితే ప్రత్యక్షంగా 25వేల మందికి పరోక్షంగా లక్ష మందికి ఉపాధి పొందుతారని లెక్కలేసిన జగన్‌ భూ నిర్వాసితులకు లెక్కలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడని విమర్శించారు. జిందాల్‌ కంపెనీకి అనేక విధాలుగా లబ్ది పొందే దారులు చూపించి వారిచే ఈరోజు శంకుస్థాపన చేయించడం ఒక ఎన్నికల స్టంటేనన్నారు. ఎన్నికల ముందు ఇలాంటి జిమ్మిక్కులు ప్రజలు నమ్మరని ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. జిల్లాలో 70 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం రిజర్వాయర్లకు ఉందని కానీ దానికి అనుసంధానమైన కాలువల నిర్మాణం జరగకపోవడమే రాయలసీమ వెనుకబాటు తనానికి కారణమని రామకృష్ణ అన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో భారీమార్పులు జరగబోయే సూచనలు ఉన్నాయని , నవరత్నాల పేరుతో పేదలకు అండగా ఉంటానని ముందుకు వచ్చిన సీఎం జగన్‌ ప్రజలను తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేశారన్నారు. 25 పార్లమెంటు సీట్లు ఇచ్చినట్లయితే ప్రత్యేక హోదాతో పాటు విభజన హక్కులన్నింటినీ పొందడమే కాకుండా పోలవరం పూర్తి చేస్తామని మాట ఇచ్చిన జగన్‌ నేడు తన వ్యక్తిగత అవసరాల కోసం మోదీ కాళ్ల దగ్గర మోకరిల్లుతున్నాడని దుయ్యపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు మాట్లాడుతూ ఆమోదం తెలిపిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండి మద్యలో ఆగిపోయిన వాటిని పరిశీలిస్తున్నామని జగన్‌ నాలుగు సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగానికి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తిగా అటకెక్కాయని సాగునీరు అందుబాటులో లేక రైతులు కూలీలుగా మారే పరిస్థితి ఏర్పడిరదన్నారు. ప్రాజెక్టులపై అలుపెరుగని పోరాటంతో ముందుకెళ్లి విజయం సాధిస్తామని చెప్పారు. ఈ పరిశీలన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాధరెడ్డి, జి.ఈశ్వరయ్య, డి.జగదీశ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు, ఎ.రామానాయుడు, ఆవుల శేఖర్‌, ఏఐకెఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటమయ్య, కార్యవర్గ సభ్యులు టి.జనార్ధన్‌, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.శివారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ వెంకటసుబ్బయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ ఏరియా కార్యదర్శులు, విద్యార్థి యువజన మహిళా సంఘాల బాధ్యులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img