Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇంటర్‌కు మళ్లీ ‘వెయిటేజీ’

. ఈఏపీసెట్‌లో 25శాతం పునరుద్ధరణ
. మార్చి 15 నుంచి ఇంటర్‌ పరీక్షలు
. కార్పొరేట్‌ కాలేజీల్లో మొక్కుబడిగా సిలబస్‌
. బట్టీ చదువుల కొనసాగింపు

విశాలాంధ్ర – బ్యూరోఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ (ఏపీ ఈఏపీసెట్‌) పరీక్షకుఇంటర్‌ మార్కులకు వెయిటేజీని ప్రభుత్వం పునరుద్ధరించనుంది. కరోనా కారణంగా రెండు విద్యా సంవత్సరాలపాటు (202021, 202122) పూర్తి స్థాయి ఇంటర్‌ సిలబస్‌తో పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ఆయా విద్యా సంవత్సరాలకుగాను ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ ఇవ్వలేదు. కేవలం ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కులకు ర్యాంకులు కేటాయించి, వారిని ఎంపిక చేసింది. 202324 విద్యా సంవత్సరం నుంచి వెయిటేజీ పునరుద్ధరించింది. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25శాతం ఇవ్వాలని నిర్ణయించింది. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కులతోపాటు ఇంటర్‌ మార్కులను పరిగణలోకి తీసుకుని ర్యాంకింగ్‌ ఇస్తారు. ఈ విధానం వల్ల ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకుని, ఈఏపీసెట్‌లోనూ అదే రీతిలో మార్కులు పొందిన వారికి మంచి ర్యాంకులు వస్తాయి. ఈఏపీసెట్‌లో మార్కులు తగ్గినా, ఇంటర్‌లో వచ్చిన వెయిటేజీ తోడై మంచి ర్యాంకులు వచ్చే అవకాశముంది. ప్రభుత్వం మళ్లీ 25 శాతం వెయిటేజీ పునరుద్ధరించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్కడి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం టీఎస్‌ ఎంసెట్‌ ప్రకటనను ఇప్పటికే ఇచ్చినందున, ఏపీలోనూ ఈఏపీసెట్‌ ప్రకటనను సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు. లేకుంటే విద్యార్థులపై వరుస వారీగా పరీక్షల ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేట్‌లో హడావుడిగా సిలబస్‌
కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర సిలబస్‌ను హడావుడిగా పూర్తి చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు సబ్జెక్టుపై పూర్తి స్థాయి పట్టు రావడం లేదు. చాలా మంది జేఈఈ, నీట్‌కు ప్రాధ్యానతతో ఇంటర్‌లో చేరుతుంటారు. వారికి ఇంటర్‌ పాఠాలను ముందస్తుగా చెప్పకుండా, పరీక్షల ప్రకటన వచ్చాక, హాల్‌ టికెట్లు జారీ చేశాక…కార్పొరేట్‌లో ప్రిపరేషన్‌ ప్రారంభిస్తారు. విద్యా సంస్థలు జారీజేసిన సొంత మెటీరియల్‌లో కేవలం ప్రాధాన్యతగల ప్రశ్నలను గుర్తించి, వాటిని బట్టీ పట్టించడం, చూడకుండా రాయించడం, ఆ తర్వాత ప్రీ పబ్లిక్‌ పరీక్షలు పెడుతూ మొక్కుబడిగా సిలబస్‌ను పూర్తి చేయడం ఆనవాయితీగా మారింది. ఏడాదిపాటు చదవాల్సిన ఇంటర్‌ సిలబస్‌ను కేవలం 30 నుంచి 40 రోజుల్లోనే పూర్తి చేయడం వల్ల విద్యార్థుల చదువులు యాంత్రికంగా మారిపోతున్నాయి. అతి తక్కువ వ్యవధిలో ఇంటర్‌ పరీక్షలను ఎదుర్కొవడం విద్యార్థులపై పెద్ద ఒత్తిడి నెలకొంది. దీనికితోడు సిలబస్‌ పూర్తి కాకుండానే, ప్రీ పబ్లిక్‌లను రెండు రోజులకు ఒకసారి పెడుతూ కార్పొరేట్‌ యాజమాన్యం భారం పెంచుతోంది. విద్యా సంవత్సర ఆరంభం నుంచి ఇంటర్మీడియట్‌ విద్యామండలి సిలబస్‌ను బోధించాలన్న నిబంధన ఉన్నప్పటికీ, దానిని కార్పొరేట్‌ యాజమాన్యం విస్మరిస్తోంది. దీనిపై ఇంటర్‌ ప్రాంతీయ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిరదనే విమర్శలున్నాయి.
హాల్‌ టికెట్ల నిలపివేస్తామంటూ బెదిరింపులు
కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా వారి ఫీజులను పూర్తిగా చెల్లించకుంటే, ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు నిలిపివేస్తామని యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోంది. మార్చి 15 నుంచి ప్రథమ ఇంటర్‌, 16 నుంచి ద్వితీయ సంవత్సర ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. పేరొందిన రెండు కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ఫీజుల ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. నిర్దేశించిన మొత్తం ఫీజు తక్షణమే చెల్లించకుంటే పరీక్షలకు వెళ్లకుండా అడ్డుకుంటామని, ప్రయోగ పరీక్షల రికార్డులు ఇవ్వబోమంటూ ఆయా కళాశాలల సిబ్బంది ద్వారా విద్యార్థులను హెచ్చరించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన పాఠశాల విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ అలంకార ప్రాయంగా మారిందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కార్పొరేట్‌ యాజమాన్యం ఆగడాలను ఆరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img