Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

ఫాసిజం దిశగా పెట్టుబడిదారీ వ్యవస్థ

. క్యూబా విప్లవాత్మక అంతర్జాతీయవాదం అభినందనీయం
. ఐకమత్యమే మహాబలం` ఏకమైతే సోషలిస్టు ప్రపంచ స్థాపన సాధ్యం
. కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీ సదస్సులో డాక్టర్‌ కె.నారాయణ

హవానా : సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకున్న ప్రపంచం ఏకతాటికిపైకి రావడం ద్వారానే సమస్యలు పరిష్కరించగలమని, ప్రపంచవ్యాప్తంగా సోషలిస్టు సమాజాన్ని స్థాపించగలమని, శాంతిసుస్థిరతను నెలకొల్పగలమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ నొక్కిచెప్పారు. ఆయన క్యూబా రాజధాని హవానాలో జరిగిన కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీ సదస్సులో మాట్లాడారు. క్యూబా విప్లవాలు ఆదర్శనీయమని, అక్కడి ప్రజల అంతర్జాతీయవాదం అభినందనీయమన్నారు. ‘పెట్టుబడిదారీ వ్యవస్థ తన మనుగడ కోసం ఫాసిజం దిశగా అడుగులు వేస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. భవిష్యత్‌ వ్యూహాల కోసం సమగ్ర అధ్యయనాలు అవసరం. పెట్టుబడిదారీవాదంతో సామాజిక ఐక్యత నాశనమవుతోంది. అర్థరహిత వినిమయతత్వాన్ని ఇది పెంపొందిస్తోంది. నయాఉదారవాద ఆర్థిక విధానాల పరిధిలో సామాజిక రంగ ఉపసంహరణతో పెద్ద సంఖ్యాక ప్రజల్లో అనిశ్చితి, అభద్రతా భావం నెలకొన్నది. అసమానత్వం, నిరుద్యోగం, నివాస ప్రాంతాల వినాశనం, పర్యావరణ క్షీణత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇవి మతతత్వ పాలకవర్గాల లూటీ పర్యవసనాలు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జాతి, కులం, మతం, వర్గం అంటూ విభేదాలు సృష్టిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు’ అని నారాయణ విమర్శించారు.
మెరుగైన భవిష్యత్‌ కోసం పాటుపడుతున్న ప్రజలకు నారాయణ సంఫీుభావాన్ని ప్రకటించారు. కమ్యూనిస్టు, వర్కర్ల పార్టీల సదస్సు కీలకమైనదని చెప్పారు. సరిహద్దులు, ఖండాలు దాటుతున్న మన ఐక్యతకు ఇది చిహ్నమని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికశక్తికి మద్దతిస్తామన్నారు. సామ్రాజ్యవాద ఆంక్షలను తట్టుకుంటూ మొక్కవోని దీక్షతో ముందుకు సాగిన క్యూబాను అభినందించారు. క్యూబా ప్రజల విప్లవాత్మక అంతర్జాతీయవాదానికి సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు. క్యూబా విప్లవస్ఫూర్తిని ఎవరూ అణచలేకపోయారని నారాయణ అన్నారు. క్యూబా ప్రజలు కమ్యూనిస్టు పార్టీ సారధ్యంలో సంక్షోభాలను అధిగమించగలిగారని చెప్పారు. నిత్యజీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ అంతర్జాతీయ సంప్రదాయాలను మరువలేదన్నారు. కోవిడ్‌ కాలంలో వైద్య బృందాలను అవసరమైన ప్రాంతాలకు పంపి తమ వంతు సహాయ సహకారాలు అందించారని, క్యూబా విప్లవాత్మక అంతర్జాతీయవాదం అభినందనీయమని నారాయణ అన్నారు. క్యూబా ప్రజలకు సంఫీుభావం తెలుపడం తమ పార్టీ కీలక కార్యకలాపాల్లో భాగమని, ప్రస్తుత పరిస్థితుల్లో క్యూబా ప్రజలకు సంఫీుభావాన్ని రెట్టింపుస్థాయిలో అందించాలని సీపీఐ భావిస్తున్నదన్నారు. స్వాతంత్య్రం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కోసం క్యూబా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో విజయవంతంగా పోరాటాలు సాగాయని తెలిపారు. సామ్రాజ్యవాద యాంత్రీకరణ కారణంగా అనేక ఖండాల్లో పిల్లలు, మహిళలు బలవంతంగా వలసబాట పట్టాల్సి వస్తోందని, సాయుధ ఘర్షణ అణుయుద్ధం ముప్పును సూచించిందన్నారు. ఈ పరిణామం శాంతిసుస్థిరతకు తీవ్ర ముప్పు అని, యుద్ధం జరుగుతున్న ప్రాంతాలే కాకుండా యావత్‌ ప్రపంచానికి ప్రమాదకరమని నారాయణ నొక్కిచెప్పారు. అణుయుద్ధం జరిగితే నాగరికత అనేక ఏళ్లు వెనక్కి నెట్టబడుతుందని, ఊహించని కష్టాలను ప్రజలు అనుభవించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. శాంతి నెలకొల్పడం, అణు నిరాయుధీకరణ, సమానత్వం ఆధారిత మెరుగైన ప్రపంచాన్ని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని నారాయణ అన్నారు. ‘సాంకేతిక పరిజ్ఞానానికి గొప్ప సామర్థ్యం ఉన్నదిగానీ దీనిని జెనోఫోబిక్‌ (జాత్యహంకారం), మతతత్వం, విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. అంతర్జాల తటస్థత కోసం పోరాటం మన కర్తవ్యం. అంతర్జాలం ద్వారా లభించే శిక్షణ అవకాశాలు కొందరికే పరిమితం కారాదు. అవసరార్థులందరికీ అందాలి. జ్ఞానాన్ని పొందడం మానవసామాజిక ప్రాథమిక హక్కు కావాలి. అందుకు మనమంతా పాటుపడాలి’ అని నారాయణ స్పష్టంచేశారు. శ్రామికులు పోరాడి సాధించిన హక్కులకు నయాఉదారవాదంతో పనిలేదు…ఎందుకంటే అది కార్మికులను కాదు…కొందరు కేపిటలిస్టులనే సంపన్న సృష్టికర్తలుగా భావిస్తుంది. కార్మికులు/శ్రామికుల హక్కుల కోసం పోరాటాలు కీలకమని ఆయన తెలిపారు.
ప్రస్తుతానికి ప్రపంచ ముఖచిత్రం నిరాశగా ఉన్నా సామాజిక ఉద్యమాలకు మంచి ఉదాహరణగా లాటిన్‌ అమెరికా ఉందని నారాయణ అన్నారు. లాటిన్‌ అమెరికా దేశాలు ఒక దాని తర్వాత ఒకటిగా వామపక్షాలకు అధికారాన్ని కట్టబెట్టాయని, అమెరికా చెప్పుచేతల్లో ఉండే హింసాత్మక కన్జర్వేటివ్‌ ప్రభుత్వాలను గద్దెదించాయన్నారు. తమ ఉద్యమాల ద్వారా మిగతా దేశాలకు స్ఫూర్తిగా, ఆదర్శంగా లాటిన్‌ అమెరికా దేశాలు నిలిచాయని నారాయణ అన్నారు.
నయా ఉదారవాద అసమానత క్రమాన్ని చెదరగొట్టేలా కార్మికులు, మానవులతో పాటు పర్యావరణ హక్కుల కోసం సాగించే పోరాటాలు తీవ్రరూపం దాల్చాల్సిన అవసరం ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం లెఫ్ట్‌ (వామపక్షం) చొరవ తీసుకొని ప్రపంచవ్యాప్తంగా సాగే ఉద్యమాలకు నాయకత్వం వహించాలన్నారు. సామ్రాజ్యవాద జోక్యాన్ని ముక్తకంఠంతో నిరాకరించాలని, శాంతి, సుస్థిరతను నెలకొల్పేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో ఐక్యంగా ఉంటే త్వరలోనే ప్రపంచ ముఖచిత్రాన్ని మార్చగలమని, ఉజ్వల భవిష్యత్‌ను భావితరాలకు అందించగలమని నారాయణ సూచించారు. ఐక్యతే మన బలం.. విడిగా ఉంటే బలహీనమవుతామని ఉద్ఘాటించారు. ‘నేడు మనకున్న ముప్పును ఐక్యంగా ఎదుర్కొందాం.. ప్రపంచవ్యాప్తంగా శాంతి, న్యాయం, సోషలిజం కోసం ఏకమవుదాం.. ఐకమత్యమే బలం’ అని నారాయణ పిలుపునిచ్చారు. తనకు ఆత్మీయ స్వాగతం పలికిన క్యూబా కమ్యూనిస్టు పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img