. బుజ్జగింపులకు లొంగని నేతలు
. అధిష్ఠానానికి తలనొప్పి
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి రెబల్స్ బెడద తలనొప్పిగా మారింది. బీజేపీ`శివసేన- ఎన్సీపీ (అజిత్‌పవార్) నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్-శివసేన (యూబీటీ)- ఎన్సీపీ (శరద్ పవార్) నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ మధ్య పోరు ఆసక్తిగా మారింది. అయితే, మహాయుతికి పెద్దన్నలా వ్యవహరిస్తున్న బీజేపీతో పాటు కూటమిలోని మిగతా పార్టీలకు రెబల్స్ బెంగ పట్టుకుంది. పొత్తుల్లో భాగంగా పార్టీ సీనియర్ నేతలకు కోరుకున్న స్థానాల్లో బీజేపీ సీట్లు కేటాయించలేకపోయింది. దీంతో వారంతా స్వతంత్రులుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కీలక నియోజకవర్గాలైన బొరివలి, ముంబాదేవి, అకోలా పశ్చిమ నియోజకవర్గాల్లో ముఖ్యమైన నేతలు తిరుగుబావుటా ఎగురవేయడం పార్టీ అధిష్ఠానాన్ని చిక్కుల్లో పడేసింది. ముంబైకి చెందిన బీజేపీ సీనియర్ నేత గోపాల్ శెట్టి బొరివలి నియోజకవర్గ టికెట్ ఆశించారు. అయితే, ఆ స్థానాన్ని అదే నియోజకవర్గానికి చెందిన సంజయ్ ఉపాధ్యాయ్‌కు కేటాయించారు. దీంతో గోపాల్ శెట్టి బహిరంగంగానే తన అసహనం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బొరివలి నుంచే బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. ఆయనను బుజ్జగించేందుకు పార్టీ సీనియర్ నేత ఆశిష్ షెలార్ చర్చలు జరిపారు. అయినప్పటికీ… తన నిర్ణయం మారబోదని గోపాల్‌శెట్టి స్పష్టం చేశారు. ముంబాదేవి నియోజకవర్గంలోనూ ఇదే తరహా పరిస్థితి తలెత్తింది. బీజేపీకి చెందిన సైనా అనే నేత అప్పటికప్పుడు శివసేన (షిండే)లో చేరి ముంబాదేవి స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. నిజానికి సైనా ‘వర్లి’ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, బీజేపీ అధిష్ఠానం ఆమెకు ముంబాదేవి నుంచి పోటీచేయాలని ఆదేశించింది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా బీజేపీ నుంచి అక్కడ విజయం అంతసులభం కాదని గ్రహించిన సైనా… వెంటనే శివసేనలో చేరి… అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌కు చెందిన అమిన్ పాటిల్‌పై పోటీ చేస్తున్నారు. సైనా నిర్ణయం బీజేపీకి తలనొప్పి తెచ్చి పెట్టింది. ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ నేత అతుల్ షా… స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ అదే జరిగితే… సైనాకు అతుల్షా నుంచి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. ఫలితంగా మహాయుతి ఓట్లు చీలిపోయి… కాంగ్రెస్ అభ్యర్థికి సానుకూల ఫలితం రావొచ్చు. అకోలా పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నేత హరీశ్ అలిమ్ చందానీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాజీ మేయర్ విజయ్ అగర్వాల్‌కు ఈ స్థానం కేటాయించడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హరీశ్… ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఓట్లు చీలిపోయి, ప్రత్యర్థికి అవకాశం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు బాంద్రా తూర్పు నియోజకవర్గంలోనూ మహాయుతికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ స్థానాన్ని ఎన్సీపీ (అజిత్‌పవార్)కు కేటాయించగా… జీశాన్ సిద్ధిఖీని అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ స్థానం ఆశించిన శివసేన (షిండే)కు చెందిన కునాల్ శర్మల్కర్ దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదేస్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. వీళ్లే కాకుండా… సీట్ల పంపకాల్లో పారదర్శకత లోపించిందంటూ మహాయుతికి చెందిన చాలామంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చాలాచోట్ల స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధం కాగా, మరికొన్ని చోట్ల సహాయ నిరాకరణ చేస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు మహాయుతి కీలక నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.