Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

మరింత ముప్పే!

. పెరిగిన ద్రవ్యోల్బణం, తయారీ రంగం మందగమనం
. పాలకుల అస్తవ్యస్త విధానాలతో ఎదురవుతున్న కొత్త సవాలు
. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక విధ్వంసం
. దినదినగండంగా ప్రజల బతుకులు
. ఆహార భద్రతను అందించడం అవసరం

న్యూదిల్లీ : భారతదేశానికి కొత్త సవాలు ఎదురుకానున్నది. దేశంలో ఉత్పత్తి తయారీలో మందగమనంతో పాటు అధిక రిటైల్‌ ద్రవ్యోల్బణం దిగువ ఆదాయ వర్గాల వారికి సవాలుగా ఉంటుంది. కేంద్ర పాలకుల అస్తవ్యస్థ ఆర్థిక విధానాల ఫలితంగా ఇప్పటికే ప్రజలు తీవ్ర ఆర్థిక విధ్వంసంలో చిక్కుకున్నారు. కోవిడ్‌ మహమ్మారి కాలంలో ప్రజలు ఆర్థికంగా చితికిపోవడం, అనంతర కాలంలో చిన్న పరిశ్రమలు మూతపడటం, కొత్త పరిశ్రమలు రాకపోవడం, ఉపాధి లేమి, వేతనాలకు కోత పడటం, విపరీతంగా ధరల పెరుగుదల కొనసాగుతుండటం వంటి పరిణామాలు ప్రజల జీవనాన్ని ఛిద్రం చేశాయి. అయితే ఈ సమస్యలను పరిష్కరించవలసిన పాలకులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ, కంటితడుపు చర్యలకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా తాజాగా మారుతున్న పరిస్థితులు మరింత ముప్పు కలిగిస్తాయోమోనన్న ఆందోళన తీవ్రతరమవుతోంది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) 2022-23లో భారతదేశ వృద్ధి అంచనాను 6.8 శాతానికి తగ్గించిన వెంటనే, ఆగస్టు 2022లో ఊహించని విధంగా పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపీ) సంకోచం చవిచూసింది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ సెప్టెంబర్‌ 2022లో పెరుగుతున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం రెట్టింపు దెబ్బను ఎదుర్కొంది. సెప్టెంబర్‌ తాత్కాలిక గణాంకాల్లో వినియోగదారుల ధరల సూచి (సీపీఐ) 7.41 శాతానికి పెరిగింది. ఈ నెలలో రెండు ప్రమాదకర పోకడలు వెలువడ్డాయి. మొదటిది, గ్రామీణ వినియోగదారుల సూచీ, పట్టణ వినియోగదారుల సూచీ కంటే స్వల్పంగా పెరిగింది. ఇది గ్రామీణ భారతదేశంలో ద్రవ్యోల్బణం కొంచెం ఎక్కువ ప్రభావాన్ని సూచిస్తోంది. రెండవది, వినియోగదారు ఆహార ధరల సూచి (సీఎఫ్‌పీఐ) ఈ నెలలో సంవత్సరానికి 8.6 శాతానికి పెరిగింది. ఆహార ధరలు పెరుగుదలకు దారితీస్తున్నాయని ఇది సూచిస్తుంది. దిగువ శ్రేణి ఆదాయ వర్గాలకు చెందిన జనాభాలో వారికి ఇది చాలా హానికరం. ఆగస్టు 2022 గణాంకాలతో పోల్చితే, పట్టణ ప్రాంతాల కంటే సెప్టెంబరులో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల ధరల సూచీ, వినియోగదారు ఆహార ధరల సూచీ రెండూ ఎక్కువగా పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణం వినియోగదారుల ధరల సూచీలో దాదాపు 39 శాతంగా ఉంది. (ఆల్కహాల్‌ లేని పానీయాలు, సిద్ధం చేసిన భోజనం, స్నాక్స్‌, స్వీట్లు మొదలైనవి పక్కన పెడితే). సెప్టెంబర్‌ వినియోగదారుల ధరల సూచి ద్రవ్యోల్బణంలో పెరుగుదల ఎక్కువగా కూరగాయలు (18.05 శాతం), సుగంధ ద్రవ్యాలు (16.88 శాతం), తృణధాన్యాలు, ఉత్పత్తులు (11.53 శాతం) ద్వారా ఉంది. ఈ సెప్టెంబరులో తృణధాన్యాలు, ఉత్పత్తుల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌ 2013 నుంచి అత్యధికంగా ఉంది. రెండు అత్యంత ముఖ్యమైన తృణధాన్యాలు… పీడీఎస్‌ (ప్రజా పంపిణీ వ్యవస్థ) కాని బియ్యం, గోధుమలు… ఈ సెప్టెంబర్‌లో 9.2 శాతం, 17.4 శాతంగా నమోదయి ద్రవ్యోల్బణ రేట్లను ఎదుర్కొన్నాయి. ఇది ఆందోళనకరం. ఇక రెండు రోజుల తర్వాత, టోకు ధరల సూచి (డబ్ల్యూపీఐ) గణాంకాలు కూడా వెలువడ్డాయి. సెప్టెంబర్‌ 2022లో ఇది 10.7 శాతం పెరిగింది. అంటే ఆగస్టులో 12.4 శాతం వృద్ధి రేటు కంటే తక్కువ. కానీ సమస్యాత్మకమైన అంశం ఏమిటంటే అది అధిక రెండంకెల స్థాయిలోనే ఉంటుంది. టోకు ధరల సూచి ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో స్థిరంగా ఉంటే అది శుభవార్త కాదు. కాగా బ్లూమ్‌బెర్గ్‌ ఆర్థిక వేత్తలు రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.36 శాతానికి ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. దాదాపు 77 శాతం పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపీ) అన్ని రకాల తయారీ కార్యకలాపాలను నిశిత పరిశీలన చేస్తున్నందున ఆగస్టులో 0.8 శాతం సంకోచం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. తయారీ 0.7 శాతం తగ్గింది. ఇది ఆర్థిక వ్యవస్థకు మేలు చేయదు. పండుగ కొనుగోళ్లు, అమ్మకాల కారణంగా రాబోయే రెండు నుంచి నాలుగు నెలలు రంగాల వృద్ధిని పెంచవచ్చు. అయినప్పటికీ, ఉత్పత్తి వైపు నుంచి ఈ రకమైన కుదింపు… భవిష్యత్‌ వృద్ధి అవకాశాల గురించి అధికారిక ఆశావాదాన్ని తప్పుబడుతోంది. రంగాల నెలవారీ వృద్ధి రేట్లు అవాంతర ధోరణిని సూచిస్తాయి. ఇది రాబోయే కొద్ది నెలల్లో తిరగబడవచ్చు లేదా తిరిగి రాకపోవచ్చు. కానీ దీనిని పూర్తిగా విస్మరించడం దీర్ఘకాలంలో ప్రమాదకరంగా మారవచ్చని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అధిక రిటైల్‌ ద్రవ్యోల్బణం, తయారీలో మందగమనంతో పాటు ఆదాయ పంపిణీలో అత్యల్ప వర్గానికి మనుగడ సవాళ్లు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల గరీబ్‌ కళ్యాణ్‌ యోజన వంటి ప్రస్తుత సంక్షేమ పథకాల పరిధిని కొనసాగించడం, విస్తరించడం ద్వారా ప్రాథమిక ఆహార భద్రతను అందించడం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img