Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మహిళా సాధికారతలో మనమే ఫస్ట్‌

చరిత్రను తిరగరాసే శక్తి అక్కచెల్లెమ్మలకే ఉంది
అందుకే వారికోసం అనేక సంక్షేమ పథకాలు
చిట్టితల్లుల ఇబ్బందులు తొలగించేందుకే ‘స్వేచ్ఛ’
కిశోర బాలికలకు శానిటరీ నాప్‌కిన్లు పంపిణీ సభలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : మహిళా సాధికారతలో దేశంలో 28 రాష్ట్రాల కంటే మనమే ముందున్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. చరిత్రను మార్చే శక్తి అక్కచెల్లెమ్మలకు ఉందని గట్టిగా నమ్మే ప్రభుత్వం మనదని, అందుకే వైఎస్సార్‌ అమ్మఒడి, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణం, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నావడ్డీ రుణాలు, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఇళ్ల పట్టాలు, వైఎస్సార్‌ జగనన్న కాలనీల నిర్మాణం వంటి అనేక పథకాలను కొద్దికాలంలోనే అమలు చేసి మహిళల పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నామన్నారు. స్వేచ్ఛ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా కిశోర బాలికలకు రూ.32 కోట్ల వ్యయంతో నాణ్యమైన బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్లు ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్టి తల్లుల కోసం ప్రతి అడుగులోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దేశంలో దాదాపు 23 శాతం మంది చిట్టితల్లుల పాఠశాల చదువులు ఆగిపోవడానికి ఒక ప్రధానమైన కారణం రుతుక్రమం సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులేనన్నారు. యునైటెడ్‌ నేషన్స్‌ వాటర్‌ సప్లయి అండ్‌ శానిటేషన్‌ కొలాబరేటివ్‌ కౌన్సిల్‌ నివేదికలో ఈ విషయం స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితులు ఇకపై మారాలి. ఈ చిట్టి తల్లులకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని, వీరికి ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే స్వేచ్ఛ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న టీనేజ్‌ పిల్లలందరికీ సుమారు రూ.32 కోట్లు వ్యయంతో నాణ్యమైన, బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్స్‌ ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఒక్కొక్క చిట్టితల్లికి నెలకు పదిచొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్‌కిన్స్‌ను ఉచితంగా అందజేస్తారని, వేసవి సెలవుల్లో ఉన్నప్పుడు సెలవుల కంటే ముందే ఒకేసారి స్కూళ్లలో పంపిణీ చేస్తారని తెలిపారు. బాలిక ఎదుగుతున్నప్పుడు శరీరంలో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు వారితోపాటు గ్రామ సచివాలయంలో ఉన్న ఏఎన్‌ఎంలు, వీళ్లందరూ కూడా ఈ పిల్లలకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టి చైతన్యవంతం చేయాలని సూచించారు. అలాగే మహిళా పోలీసు దిశ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్న దానిపై కూడా అవగాహన కలిగించాలన్నారు. ప్రస్తుతం స్కూళ్లు, కళాశాలల్లో ప్రారంభమవుతున్న ఇవి గ్రామ స్థాయిలో కూడా ప్రతి అక్కకు, చెల్లెమ్మకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో వైఎస్సార్‌ చేయూత దుకాణాల ద్వారా వీటిని విక్రయించేందుకు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఇవి ఆయా దుకాణాల్లో తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయన్నారు. అనంతరం స్వేచ్ఛ పోస్టర్‌ను సీఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌, మంత్రులు ఆదిమూలపు సురేష్‌, తానేటి వనిత, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img