Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మా జోక్యం అనవసరం..

మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోండి
కృష్ణా జలాల వివాదంపై ఏపీ, తెలంగాణకు సుప్రీం సూచన

న్యూదిల్లీ : కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకో వాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ వ్యవహారం తాము జోక్యం చేసుకోవడం అనవసరమని పేర్కొంది. తమకు న్యాయంగా దక్కాల్సిన తాగు,సాగునీటి వాటాను తెలంగాణ వాడేస్తోందని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఆశ్రయించింది. ఏపీ పిటిషన్‌పై సోమవారం సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం విచారించింది. సీజేఐ రమణ మాట్లాడుతూ, ‘మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకో వడం సబబుగా ఉంటుంది. నేను ఈ కేసును విచారించాలని అనుకోవడం లేదు. నేను రెండు రాష్ట్రాలకు చెందిన వాడిని. మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తే దయచేని అలా చేయండి. లేదం టారా.. వేరొక ధర్మాసనానికి కేసును బదిలీ చేస్తాను. మీరిద్దరూ (రెండు రాష్ట్రాల న్యాయవాదులనుద్దేశించి) మీ రాష్ట్రాల ప్రభుత్వాలకు నచ్చ చెప్పి ఈ వివాదం సర్దుమణిగేలా చూడండి. మేము అనవసరంగా జోక్యం చేసుకోం’ అని అన్నారు. తమకు కొంత సమయం ఇవ్వాలని ఏపీ తరపు సీనియర్‌ న్యాయవాది దుశ్యంత్‌ దవే, న్యాయవాది మహ్ఫూజ్‌ ఎహసాన్‌ నజ్కి కోరగా తెలంగాణ తరపు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ కూడా అంగీక రించారు. దీంతో తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు సీజేఐ తెలిపారు. అంతకముందు బోర్డు పరిధిని నిర్ణయిస్తూ ఇప్పటికే కేంద్రం గెజిట్‌ విడుదల చేసినందున ఏపీ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని తెలంగాణ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్టోబరు నుంచి గెజిట్‌ అమల్లోకి వస్తుందని, ఈలోగా నీటిని తెలంగాణ వాడుకునే అవకాశం ఉందన్నారు. అయితే ఈ గెజిట్‌ తక్షణ అమలునకు ఆదేశాలివ్వాలని, నాలుగు నెలలపాటు నీటిని నష్టపోలేమని ఏపీ న్యాయవాదులు వాదించారు. ఇదిలావుంటే, 2015 నాటి ఒప్పందానికి విరుద్ధంగా విద్యుదుత్పత్తి కోసం కృష్ణా జలాలను తెలంగాణ ప్రభుత్వం ఇష్టారీత్యా వాడుతోందని, అవసరమైతే రెండు రాష్ట్రాల పరిధిలోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల నిర్వహణను పోలీసుల ద్వారా చేపట్టాలని, ఏపీకి అన్యాయం జరగకుండా చూడాలని పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img