Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

మీ సేవలకు సలాం !

కేంద్రం తరహాలో ఇక ఏటా పురస్కారాలు
కులం, మతం, ప్రాంతాలకతీతంగా అవార్డుల ఎంపిక
వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులందజేసిన గవర్నర్‌, సీఎం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రంగాలలో గొప్పవారిని, మంచివారిని అత్యున్నత అవార్డులైన పద్మశ్రీ, పద్మభూషణ్‌ , భారతరత్న వంటి అవార్డు లిచ్చి సత్కరించిన తరహాలోనే ఇకనుంచి ఏటా రాష్ట్రంలోనూ వివిధ రంగాల్లో సేవాభావంతో పనిచేసే వ్యక్తులకు వైఎస్సార్‌ లైఫ్‌టైం, అచీవ్‌ మెంట్‌ అవార్డులను అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. వివిధ రంగాల్లో విశేషసేవలందించిన 59 మందికి సోమవారం విజయవాడ నగరంలోని ఎ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌, అచీవ్‌మెంట్‌ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, తల్లి విజయమ్మలు పాల్గొన్నారు. తొలుత గవర్నర్‌ మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి స్వతహాగా వైద్య వృత్తి చేసినప్పటికీ, వ్యవసాయం, విద్యారంగాలకు విశేష కృషి చేశారని కొనియాడారు. పేదల బాధలు క్షేత్రస్థాయిలో తెల్సుకున్నారని, అందుకే వారికి ఆరోగ్యశ్రీ లాంటి పథకం తీసుకొచ్చి అత్యాధునిక వైద్యం అందించార న్నారు. ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవన్నారు. వ్యవసాయం, ఆక్వా, ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. కరోనా వాక్సినేషన్‌లోనూ ఏపీ క్రియాశీలకంగా ఉందని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్నాథుడుని ప్రార్థిస్తున్నానని గవర్నర్‌ అన్నారు. వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు అందుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. సీఎం మాట్లాడుతూ సామాన్యులుగా ఉంటూ అసమాన ప్రతిభను కనబరుస్తున్న ఈ అవార్డు విజేతలందరికీ వందనాలు తెలియజేస్తున్నానని, ఈ సమయాన్ని మీ మధ్య గడుపుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహానేత వైఎస్సార్‌లో నిండైన తెలుగుదనం తన పంచకట్టులో కనిపిస్తుంది. వ్యవసాయం మీద మమకారం తన ప్రతి అడుగు లోనూ కనిపిస్తుంది. గ్రామం, పల్లెల మీద, పేదల మీద అభిమానం కూడా కనిపిస్తాయి. ప్రతి ఒక్క రినీ పెద్ద చదువులు చదివించాలన్న తపన, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని నిలబెట్టాలన్న ఆరాటం ఇవన్నీ కూడా నాన్నగారిని చూస్తే కనిపించే విషయాలని జగన్‌ గుర్తు చేసుకున్నారు. భూమి మీద ఉంటూ… ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మహామనిషి ఈరోజు మన మధ్య లేకపోయినా, ఆ స్ఫూర్తి కొన సాగాలని ఆయన పేరుమీద రాష్ట్ర స్ధాయిలో అత్యు న్నత పౌర పురస్కారాలను ఇవ్వాలని నిర్ణయించామ న్నారు. ఇందులో లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రకటించిన వారికి రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, మెమొంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం. అచీవ్‌మెంట్‌ అవార్డులు పొందినవారికి రూ.5 లక్షలు, కాంస్య విగ్రహం, మెమొంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నామన్నారు. తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ లైన, కళలకు, సంస్కృతికి ఈ ఆవార్డులలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చామ న్నారు. ఒక డప్పు కళాకారుడికి, ఒక తోలుబొమ్మలాటకు, పొందూరు ఖాదీకి, జానపద గీతానికి, బొబ్బిలి వీణకు, రంగస్ధల పద్యానికి, థింసా నృత్యానికి, సురభి నాటకానికి, సవర చిత్రకళకు, వీధి నాటకానికి, హరికథకు, బుర్రకథకు, వెంకటగిరి జాంధానీ చీరకు, మనదైన కలంకారీకి, చెక్కమీద చెక్కే శిల్పానికి, నాదస్వరానికీ, మనదైన కూచిపూడికి ఇస్తున్న అవార్డులు ఇవి అని వివరించారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌ వారికి, సీపీ బ్రౌన్‌ లైబ్రరీకి, వేటపాలెం గ్రంథాలయానికి, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ వంటి గొప్ప గొప్ప సంస్ధలకు, రైతుకు… కలం యోధులకు, సేవా మూర్తులకూ ఈ ఆవార్డులు ఇస్తున్నామని వివరించారు. ఈ అవార్డులన్నీ ఇక ప్రతి ఏటా నవంబరు ఒకటో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img