Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మోదీ కార్పొరేట్‌ పాలనపై సమరశంఖం

కిక్కిరిసిన ముజఫర్‌నగర్‌
కిసాన్‌ మహాపంచాయత్‌

వేలాదిగా పాల్గొన్న అన్నదాతలు
కేంద్రం మెడలు వంచి చట్టాలు రద్దు చేయిస్తాం : ఎస్‌కేఎం

లక్నో / ముజఫర్‌నగర్‌ : బీజేపీ కార్పొరేట్‌ పాలనపై కిసాన్‌ మజ్దూర్‌ సంఘాలు సమరశంఖాన్ని పూరించాయి. నల్ల చట్టాలను రద్దు చేసే వరకు పోరు ఆగదని, కేంద్రం మెడలు వంచుతామని రైతాంగం ప్రతిజ్ఞ బూనింది. ఒకే మాటఒకే బాటగా రైతులు కార్మికు లు ముందుకు సాగుతున్నారు. రైతుకార్మిక వ్యతిరేక కొత్త చట్టాలను ఉపసం హరించుకునేంత వరకు ఉద్యమిస్తామని తెగేసి చెబుతున్నారు. ఇదే నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఆదివారం కిసాన్‌ మహాపంచాయత్‌ జరిగి ంది. త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలు కీలకమైనవిగా భావిస్తున్న రైతులు దేశాన్ని పరిరక్షించాలన్న లక్ష్యంతో మహా పంచాయత్‌ ఏర్పాటు చేశారు. ముజఫర్‌న గర్‌లోని ప్రభుత్వ ఇంటర్‌ కళాశాల మైదానంలో సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన మహా సంచాయత్‌లో యూపీ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రైతులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్‌ తికైత్‌ మాట్లాడుతూ, ‘దేశవ్యాప్తంగా ఇటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. దేశం అమ్ముడుపోకుండా అడ్డుకోవాలి. రైతులనుదేశాన్ని పరిరక్షించుకోవాలి, వ్యాపారులు, ఉద్యోగులు, యువతను కాపాడుకోవాలి.. ఇదే ఈ ర్యాలీ ఉద్దేశం’ అని అన్నారు. వేదికపై ఆశీనులైన ప్రముఖుల్లో మేధా పాట్కర్‌,యోగేంద్ర యాదవ్‌ వంటి వారున్నారు. యాదవ్‌కు తికైత్‌ పసుపుపచ్చ వస్త్రాన్ని అందజేశారు. రైతుల నిరసనలపై బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ స్పందిం చారు. ‘వీరు మనవాళ్లు. మన రక్తం`మన కండ’ అని రైతులనుద్దేశించి అన్నారు. రాజీ కోసం చర్చలు జరపాలంటూ కేంద్రాన్ని కోరారు. బీకేయూ మీడియా ఇంచార్జి ధర్మేంద్ర మాలిక్‌ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన 300కుపైగా సంఘాల నుంచి రైతులు హాజరైనట్లు వెల్లడిరచారు. సభికుల కోసం 500 లంగర్లు, మొబైల్‌ స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు సహా రైతులంతా తమ రైతు సంఘాల జెండాలు చేబూని వేర్వేరు రంగుల టోపీలు ధరించి బస్సుల్లో, కార్లలో, ట్రాక్టర్లలో సభాస్థలికి చేరుకున్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ కొద్దిమంది రైతులు మాత్రమే నిరసన చేపడుతున్నారని కేంద్రం చెబుతోందన్న రైతు నాయకులు.. ఈ మహాపంచాయత్‌ ద్వారా రైతుల శక్తిని తెలియజేస్తామంటూ ఉద్ఘాటించారు. కులమతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలతో పాటు అన్ని రాష్ట్రాల రైతులు తమ ఉద్యమానికి మద్దతిస్తున్నారని సంయుక్త కిసాన్‌ మోర్చా

వెల్లడిరచింది. రైతుల పోరాటశక్తికి మహాపంచాయత్‌ నిదర్శనమని పేర్కొంది. మహాపంచాయత్‌కు భారీ సంఖ్యలో రైతుల తరలివచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళా రైతు నేత ఒకరు సభనుద్దేశించి కన్నడంలో మాట్లాడారు. సభికుల్లో ఒకరు శంఖం పూరించారు. ఈ చిత్రాన్ని ట్విట్టర్‌లో కిసాన్‌ ఏక్తా మోర్చా పోస్టు చేసింది.
ప్రధాని పేరుతో ప్రచారం చేస్తాం.. : తికైత్‌ ఎద్దేవా
కేంద్రం తీసుకు వచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడే రైతులంతా ప్రధానమంత్రి పేరుపై ప్రచారం నిర్వహిస్తారు. ఎందుకంటే బీజేపీ చేసేది కూడా అదే కదా అంటూ రైతు నేత రాకేశ్‌ తికైత్‌ ఎద్దేవా చేశారు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘ మేము ప్రధాన మంత్రి ప్రజాదరణను పెంచుతున్నాం. ఆయన ప్రతీది అమ్మేస్తున్నారు. ఏమేమి అమ్మేశారో మేము ప్రజలకు తెలియజేస్తాం. ప్రధానికే పబ్లిసిటీ దొరుకుతుంది. విద్యుత్‌, నీరు తదితరాల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇలాంటివి ప్రజలకు చెప్పడం తప్పా?’ అని తికైత్‌ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని రైతులు ఇప్పటికే ప్రకటించారు. రెండవ పీఎంఓ (ప్రధాన మంత్రి కార్యాలయం) వారణాసి (ప్రధాని మోదీ లోక్‌సభ స్థానం)లో ఉంది. అక్కడే కాదు లక్నోలో కూడా పంచాయత్‌లు జరుగుతాయి అని తికైత్‌ వెల్లడిరచారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వస్థలమైన గోరఖ్‌పూర్‌లో మహా పంచాయత్‌ నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు ‘అది రైతుల పట్టణం, యోగిజీకి ఆలయం మాత్రమే ఉంది’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కాకముందు యోగి ఆదిత్యనాథ్‌ ఇదే పట్టణంలో ప్రఖ్యాత శివమందిరాన్ని నిర్వహించేవారు. ముజఫర్‌నగర్‌లో హిందూ`ముస్లిం జగడం ముగిసిందా అన్న ప్రశ్నకు ‘ఇప్పుడు అలాంటిదేమీ లేదు. రైతుల పోరాటం వల్ల ఆ విభేదాలు తొలగిపోయాయి. ఇదిప్పుడు మొహబ్బత్‌నగర్‌ (ప్రేమనగరం)’ అని తికైత్‌ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రైతుల ఆందోళనలు కొనసాగతాయని స్పష్టంచేశారు.
రైతుల ఘోష వినాల్సిందే…
కేంద్రానికి రాహుల్‌ డిమాండు
న్యూదిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కిసాన్‌ మహాపంచాయత్‌కు కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. రైతుల గళాన్ని కేంద్రంలోని అనైతిక ప్రభుత్వం వినాల్సిందేనని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండు చేశారు. అన్ని వైపుల నుంచి నిజం ప్రతిధ్వనిస్తోందని అన్నారు. రైతుల గర్జన ఎదుట అధికార దర్పం నిలవబోదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. రాహుల్‌, ప్రియాంకలు ట్విట్టర్‌ మాధ్యమంగా హిందీలో తమ వాణి వినిపించారు. రైతులకు మద్దతు ప్రకటించారు. యావత్‌ దేశం రైతుల వెంట ఉందని, సేద్యాన్ని పరిరక్షించుకునేందుకు ఒక్కటవుతోందని ప్రియాంక పేర్కొన్నారు. రైతుల సాగు భూములను హరించే వారు మోసగాళ్లు అంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ఆరోపించారు. పార్టీ సీనియర్‌ నేత సచిన్‌ పైలెట్‌ కూడా రైతులకు అండగా నిలిచారు. మహాపంచాయత్‌పై సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వంపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తంచేశారు. రైతుల ఉద్యమం దిశగా ఈ మహాపంచాయత్‌ ఓ మైలురాయిగా నిరూపితం కావాలని హిందీలో ట్వీట్‌ చేశారు.
కిసాన్‌ పంచాయత్‌ కాదు ఎన్నికల సభ : బీజేపీ
న్యూదిల్లీ : యూపీలోని ముజఫర్‌నగర్‌లో జరిగిన కిసాన్‌ మహా పంచాయత్‌ను ఎన్నికల సభగా బీజేపీ అభివర్ణించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో తలదూర్చుతున్నారని సభ నిర్వాహకులపై విరుచుకుపడిరది. బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ రాజ్‌కుమార్‌ చాహర్‌ ఓ ప్రకటన వెలువరించారు. మహాపంచాయత్‌ అజెండా వెనుక రాజకీయం ఉందని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం చేసినంతగా ఏ ప్రభుత్వం కూడా రైతుల కోసం చేయలేదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img