Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

మోదీ సర్కార్‌ విధానాలను ప్రతిఘటిద్దాం

భారత్‌బంద్‌కు అధికార, ప్రతిపక్షాలు మద్దతివ్వాలి
సీపీఐ, ఏఐటీయూసీ నాయకుల పిలుపు
గుంటూరులో భారీ పాదయాత్ర

విశాలాంధ్ర`గుంటూరు : దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతున్న నరేంద్ర మోదీ సర్కార్‌ విధానాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలం బిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టిన ‘సీపీఐ జన ఆందోళన్‌’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన ప్రచార పాదయాత్ర సోమవారం గుంటూరుకు చేరుకుంది. లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. ఎర్రజెండాలు చేతబూనిన వందలాది మంది పార్టీ కార్యకర్తలతో గుంటూరు నగరం ఎరుపెక్కింది. శంకర్‌విలాస్‌, మార్కెట్‌ సెంటర్‌, జిన్నాటవర్‌, పాతబస్టాండ్‌, బీఆర్‌ స్టేడియం, ఆర్టీసీ బస్టాండ్‌, మణిపురం బ్రిడ్జి మీదుగా పెదకాకాని రోడ్డులోని మల్లయ్యలింగం స్థూపం వరకు పాదయాత్ర కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ సాగిన పాదయాత్రకు ప్రజలు, కార్మికులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం మల్లయ్యలింగం స్థూపం వద్ద ఏర్పాటు చేసిన సభలో సీపీఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి వక్తలను వేదికపైకి ఆహ్వానించగా జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ సభకు అధ్యక్షత వహించారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను ఛాయ్‌ వాలానని, బీసీనని, తాను అధికారంలోకి వస్తే అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందని, రైతులకు రెట్టింపు ఆదాయం, నిరుద్యోగ యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని, అచ్చేదిన్‌ తీసుకువస్తానని నమ్మబలికి అధికారం చేపట్టిన తరువాత 137 కోట్ల మంది ప్రజలకు పంగనామాలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ విధానాలతో లూటీ ఇండియా…సేల్‌ ఇండియాగా మార్చేశారని విమర్శించారు. ఎల్‌ఐసీ, టెలికాం, విమానాశ్రయాలు, ఓడరేవులు, బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ సర్కారు…52 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు, 32 మంది యువకుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అడ్డగోలుగా అమ్మకానికి పెట్టిందని ధ్వజమెత్తారు. ప్రత్యక్షంగా 22వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తూ ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ ఉక్కు పరిశ్రమ కిరీటంగా నిలచిందన్నారు. చివరికి వ్యవసాయ రంగాన్ని సైతం కార్పొరేట్‌ల కబంధహస్తాలకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కేంద్రంపై పోరాటానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా లేరని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో, విశాఖ ఉక్కును కాపాడుకోలేక చేతులెత్తేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తాకట్టు విధానాలకు నిరసనగా, మూడు వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి, రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌కు సీపీఐ సహా 19 పార్టీలు మద్దతునిచ్చాయని, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు సైతం బంద్‌కు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మోదీ రెండవసారి అధికారం చేపట్టిన తరువాత కార్మికవర్గంపై కక్ష కట్టారన్నారు. పోరాడి సాధించుకున్న కార్మికచట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చారని విమర్శించారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీి కేంద్రం మొండిగా అమ్మకానికి పూనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెలుగూరి రాధాకృష్ణమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుగు గని, సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు మారుతీ వరప్రసాద్‌, ఎస్‌కే హుస్సేన్‌, చిన్ని తిరుపతయ్య, బూదాల శ్రీనివాస్‌, నాగభైరవ సుబ్బాయమ్మ, జేబీ శ్రీధర్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముసునూరు రమేష్‌బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి కోలా స్వాతి, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సుభాని, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బందెల నాసర్‌ జీ, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు ఆరేటి రామారావు, ఎంపీటీసీ బొంతా జ్యోతి, ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు రావుల అంజిబాబు, ఆకిటి అరుణ్‌కుమార్‌, సీపీఐ నగర కమిటీ సభ్యులు నూతలపాటి వెంకటేశ్వరరావు, అమీర్‌వలి, చల్లా మరియదాసు, చల్లా చిన ఆంజనేయులు, పీవీ మల్లికార్జునరావు, నగర సమితి సభ్యులు దూపాటి వెంకటరత్నం, మంగా శ్రీనివాసరావు, ఎస్‌కే వలి, చైతన్య, జగన్నాథం, మూరబోయిన వెంకటేశ్వరరావు, ప్రజానాట్యమండలి నగర అధ్యక్షుడు చెవుల పున్నయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img