Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

యూపీలో బీజేపీకి బీటలే

మూడు, నాలుగు సీట్లకే పరిమితం
ఎస్‌పీ అధినేత అఖిలేశ్‌
సైకిలెక్కిన ఇద్దరు మంత్రులు, ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్రమంగా బీజేపీ కూలిపోతోందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. బీజేపీలో ఒక్కో వికెట్‌ పడిపోతోందని, అయినా ముఖ్యమంత్రికి క్రికెట్‌ ఆడటం చేతకాదని ఎద్దేవా చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు, ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, మరో అప్నాదళ్‌(సోనోవాల్‌) ఎమ్మెల్యే అఖిలేశ్‌ సమక్షంలో శుక్రవారం ఎస్‌పీలో చేరారు. అనంతరం అఖిలేశ్‌ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మూడో వంతు సీట్లు తమకే దక్కుతాయని బీజేపీ అంటోందని.. దాని అర్థం ఆ పార్టీకి కేవలం మూడు లేదా నాలుగు సీట్లు రావడమేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్వామి ప్రసాద్‌ మౌర్య అంటున్నారు. నిజమే.. ఈసారి మా పార్టీకి చాలామంది నేతలను తీసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 20 శాతం సీట్లు దక్కేవి. కానీ మౌర్య సహా మిగతా ఎమ్మెల్యేల రాకతో ఆ 20 శాతం కూడా బీజేపీ పోగొట్టుకుంది. బాబా ముఖ్యమంత్రి ఓ లెక్కల మాస్టారును సంప్రదించాలి’ అని అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. బీజేపీకి 80 శాతం, ఇతర పార్టీలకు 20 శాతం మద్దతు ఉంటుందని ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలపై అఖిలేశ్‌ ఘాటుగా స్పందించారు. ఓబీసీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్య రాజీనామాతో బీజేపీలో ఫిరాయింపులు మొదలయ్యాయి. ఇప్పటివరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
కాగా, ఓబీసీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్య శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో తిరుగుబాటు మంత్రి ధరంసింగ్‌ సైనీ కూడా సైకిలెక్కారు. అఖిలేశ్‌ యాదవ్‌ సమక్షంలో మౌర్య, సైనీతోపాటు ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, అప్నాదళ్‌(సోనేలాల్‌) ఎమ్మెల్యే అమర్‌సింగ్‌ చౌదరి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఎస్‌పీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేలలో భగవతిసాగర్‌, రోషన్‌లాల్‌ వర్మ, వినయ్‌ శాఖ్య, బ్రిజేశ్‌ ప్రజాపతి, ముఖేశ్‌ వర్మ ఉన్నారు. లక్నోలోని ఎస్‌పీ ప్రధాన కార్యాలయంలో వారంతా ఎస్‌పీ సభ్యత్వం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కార్మికశాఖమంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య బీజేపీని వీడటం ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ. మౌర్య తర్వాత చాలామంది ఆయన బాట పట్టారు. రాష్ట్రంలో యాదవేతర ఓబీసీలను ఏకతాటిపైకి తీసుకురావడం, ఎస్‌పీకి మరింత బలం చేకూర్చడానికి మౌర్య చేరిక దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img