Friday, September 30, 2022
Friday, September 30, 2022

రైతుల కడుపుకొడతారా?

అదాని పోర్టు నుంచి డ్రగ్స్‌ దిగుమతి
చిత్తూరు-తచ్చూరు భూనిర్వాసితుల పోరు ఆగదు
భారత్‌ బంద్‌ను జయప్రదం చేయండి
సీపీఐ జాతీయ నేతలు బినయ్‌ విశ్వం, నారాయణ

విశాలాంధ్ర- చిత్తూరు : జాతీయ రహదారుల నిర్మాణం పేరుతో పాలకులు పేద రైతుల కడుపు కొడుతున్నారని, అదానికి చెందిన గుజరాత్‌ పోర్ట్‌ నుండి ఏపీకి డ్రగ్స్‌ దిగుమతి అవుతున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శులు బినయ్‌ విశ్వం, డా.కె.నారాయణ విమర్శించారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లకు పోలీసులు సెల్యుట్‌ కొడుతున్నారని ఆరోపించారు. చిత్తూరులోని సీఎం కళ్యాణ మండపంలో గురువారం చిత్తూరు- తచ్చూరు జాతీయ రహదారి భూ నిర్వాసితుల అవగాహన సదస్సులో బినయ్‌ విశ్వం, నారాయణ ప్రసంగించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్‌.నాగరాజు అధ్యక్షత వహించారు. రాజ్యసభ సభ్యులు బినయ్‌ విశ్వం మాట్లాడుతూ తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరుతో పేదలను దోచుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ రహదారుల నిర్మాణం పేరుతో రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటుందని కేంద్రంపై ఆగ్రహం వెలిబుచ్చారు. కార్పొరేట్‌ సంస్థల కోసం జాతీయ రహదారులు నిర్మిస్తున్నారని, రైతుకు భూమి లేకుంటే బతుకు గడవదన్నారు. ఏడాది కాలంగా దిల్లీలో నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తుంటే మోదీ ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. చిత్తూరు- తచ్చూరు నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు సీపీఐ పోరాటం ఆపదని స్పష్టంచేశారు. న్యాయమైన పరిహారం దక్కేవరకు పోరాటం చేయాలని రైతులను కోరారు. రైతుల పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ నెల 27న రైతులు నిర్వహిస్తున్న భారత్‌ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి విజ్ఞప్తి చేశారు. నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం పోర్టులను ప్రైవేటీకరించి స్మగ్లింగ్‌కు మార్గాలు సుమగం చేస్తుం దన్నారు. అందులో భాగంగానే విశాఖపట్నంలో పట్టుబడిన హెరాయిన్‌ అదానికి సంబంధించిన గుజరాత్‌ పోర్టు నుండి వచ్చిందన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటికరించి కార్పొరేట్‌ పాలన సాగిస్తున్నారని, ఇందువల్ల దేశ అంతర్గత భద్ర తకు ముప్పు వాటిల్లుతుందని, తెలిపారు. భూసేకరణ చట్టం ప్రకారం నూటికి ఎనభైమంది నిర్వాసితులు అంగీకరించిన తరువాతే భూసేకరణ జరగాలని కానీ అధికారులు రైతులను బెదిరించి సంతకాల సేకరణ చేస్తున్నారని విమర్శించారు. అధికారులు బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. రైతులను సంతృప్తి పరచకుండా ఒక్కసెంటు కూడా తీసుకోలేరని హెచ్చరిం చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. 6నెలల్లో అవినీతి రహిత పరిపాలన అందిస్తామని ప్రకటించిన సీఎం జగన్‌ ఆ విషయం మాట్లాడటం లేదన్నారు. జగనన్న కాలనీ పేరుతో ఇసుక దోపిడీ జరుగుతోందని విమర్శించారు. చిత్తూరు జిల్లా పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్యూట్‌ కొడుతున్నారని చెప్పారు. ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి జనార్దన్‌, పీఎల్‌ నరసింహులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, రైతు సంఘం ఐక్యవేదిక నాయకులు కె.శ్రీనివాస్‌ నాయుడు, దేవరాజ్‌ నాయుడు, గోపి, గుర్రప్ప, మహిళా రైతులు రేవతి, సుశీలతో పాటు మామిడి రైతు సంఘ అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాస్‌, రైతు సమాఖ్య నాయకులు శ్రీనివాసులు, సీపీఐ నగర కార్యదర్శి గోపినాథ్‌, సీనియర్‌ నాయకులు మణి, సత్యమూర్తి, రఘు, దాసరి చంద్ర, గణపతి, మహిళా సమాఖ్య నాయకులు రమాదేవి, కుమారి, జయలక్ష్మి, విజయగౌరి, జామీలాబీ, చిత్తూరు- తచ్చూరు రైతులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img