Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

వాక్సిన్‌ పత్రాల గుర్తింపు సులభతరం

గ్లోబల్‌ కోవిడ్‌ సమ్మిట్‌లో ప్రధాని మోదీ

వాషింగ్టన్‌ : కోవిడ్‌ ప్రమాదం తొలగిపోలేదని, వైరస్‌ ముప్పు కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ కోవిడ్‌ సమ్మిట్‌లో పాల్గొన్నారు. కోవిడ్‌ రెండవ దశ ఇంకా ముగియలేదన్నారు. వాక్సిన్‌ పత్రాల గుర్తింపును సులభతరం చేయాలని ప్రపంచ దేశాలకు సూచించారు. వాక్సిన్‌ ముడి సరకు సరఫరాలో అవరోధాలు లేకుండా చూడాలని కోరారు. అనేక దేశాల్లో ఇంకా వాక్సినేషన్‌ పూర్తి స్థాయిలో జరగలేదని, అందుకే వాక్సిన్‌ విరాళాలను రెట్టింపు చేయడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చొరవ తీసుకున్నారని, ఇది అభినందనీయమని మోదీ అన్నారు. వాక్సిన్‌ విరాళాన్ని 0.5బిలియన్‌ నుంచి బిలియన్‌కు పెంచుతున్నట్లు బైడెన్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమని భారత్‌ నమ్ముతుందన్న మోదీ.. భారతీయ ఫార్మా కంపెనీలు డయాగ్నోస్టిక్‌ కిట్లు, ఔషధాలు, వైద్య పరికరాలు తదితరాలు ఉత్పత్తి చేశాయన్నారు. దేశంలో ఇటీవల ఒక్క రోజులో 2.5 కోట్ల మందికి టీకాలు వేశామని తెలిపారు. భారత్‌లో కొత్తగా కోవిడ్‌ టీకాల అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. క్వాడ్‌ భాగస్వాములతో కలిసి ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి వాక్సిన్‌లను పంపిణీ చేయడానికి భారతదేశ తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నామని మోదీ తెలిపారు. మహమ్మారి వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని, ఈ క్రమంలో వాక్సిన్‌ పత్రాలను పరస్పరం గుర్తించడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేయాలని ప్రపంచ దేశాల ప్రతినిధులనుద్దేశించి మోదీ అన్నారు.
దిగ్గజ సంస్థల సీఈఓలతో భేటీ
అమెరికాలో ప్రధాని మోదీకి వాష్టింగ్టన్‌ డీసీ విమానాశ్రయంలో బైడెన్‌ ప్రభుత్వ సీనియర్‌ అధికారులు, అమెరికాలో భారతీయ దౌత్యాధికారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు, ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. అనంతరం అమెరికాలో తనకు అపూర్వ స్వాగతం లభించిందని, ఇందుకోసం భారతీయ సమాజానికి కృతజ్ఞతలు అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. క్వాడ్‌ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన మోదీ అక్కడ కార్పొరేట్‌ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యి భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆయన క్వాల్‌కామ్‌ సీఈవో క్రిస్టినా ఆర్‌ అమాన్‌, అడోబ్‌ చైర్మన్‌ శాంతను నారాయణ్‌, ఫస్ట్‌ సొలార్‌ సీఈవో మార్క్‌ విడ్మార్‌, జనరల్‌ అటామిక్స్‌ సీఈఓ వివేక్‌ లాల్‌, బ్లాక్‌స్టోన్‌ సీఈవో స్టీఫెన్‌ ఎ స్వ్కావార్జ్‌మెన్‌లతో అలాగే అమెరికా ఉపాధ్యక్షురాలు కమాలా హారిస్‌తో మోదీ భేటీ అయ్యారు. ఆయన శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని మారిసస్‌, జపాన్‌ ప్రధాని సుగాలతో వేర్వేరుగా భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం క్వాడ్‌ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. శనివారం ఐరాస సదస్సులో ప్రసంగిస్తారు. ఆపై తిరుగు పయనమవుతారు. ఆదివారం న్యూదిల్లీ చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img