Monday, October 3, 2022
Monday, October 3, 2022

విద్యుత్‌ సర్దుబాటు చార్జీలపై సీపీఐ సమర భేరి

రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు
ఉపసంహరించుకోకుంటే గద్దె దింపుతామని నేతల హెచ్చరిక

అమరావతి : జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వం విద్యుత్‌ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై మోపిన భారాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల నుంచి మండలస్థాయి వరకు నిరసనలు మిన్నంటాయి. విద్యుత్‌ ట్రూ అప్‌ భారాన్ని ఉపసంహరిం చాలని, కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్కరణలను తిప్పికొట్టా లని, ఇష్టారాజ్యంగా విద్యుత్‌ చార్జీలు పెంచితే సహించబోమం టూ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వ్యతిరేకించిన ముఖ్యమంత్రి, అధికారంలోకి రాగానే మడమ తిప్పారని, మాట తప్పిన ముఖ్యమంత్రి తక్షణమే ట్రూఅప్‌ చార్జీలు ఉపసంహరించుకోకపోతే గద్దె దింపడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. విశాఖపట్నంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి పాల్గొనగా, నర్సీపట్నంలో విశాఖ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, గాజువాకలో ఏజే స్టాలిన్‌, కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు, విజయవాడలో సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, తిరుపతిలో సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు, గుంటూరులో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, ఏలూరులో పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌, కాకినాడలో తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి.మధు, శ్రీకాకుళంలో జిల్లా కార్యదర్శి ఎస్‌ నర్సింహులు, నెల్లూరులో జిల్లా కార్యదర్శి సీహెచ్‌ ప్రభాకర్‌, కడపలో నగర కార్యదర్శి ఎన్‌.వెంకటశివ తదితరులు ఆందోళనా కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. మండల, నియోజకవర్గస్థాయిలో జరిగిన ధర్నా కార్యక్రమాల్లో జిల్లా పార్టీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సీపీఐ నిరసనలు విజయవంతమయ్యాయి.
జగన్‌ నోరు విప్పాలి:జేవీఎస్‌ఎన్‌ మూర్తి
అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఇప్పుడు ఏమి సమాధానం చెపుతారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. విశాఖ నగరం పందిమెట్టలోని విద్యుత్‌ సౌధ కార్యాలయం ముందు నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ట్రూ అప్‌ పేరుతో విద్యుత్‌ వినియోగదారులపై చార్జీల భారం మోపడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల కాలానికి రూ.3669 కోట్ల భారం మోపారని, ఇప్పుడు మళ్లీ 2019-20కి రూ.2542 కోట్లు వసూలు చేయడానికి సిద్ధపడటం క్షమార్హం కాదని మండిపడ్డారు. ప్రజాపక్షమని ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తున్నదని విమర్శించారు. ఇప్పటికే కరోనా వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయని, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం దుర్మార్గమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చమురు ధరలు విపరీతంగా పెంచిందని, ఫలితంగా అన్ని రకాలు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్‌ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి ఎస్‌కే రెహమాన్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.విమల, నాయకులు సుబ్బరాజు, శ్రీను, కాసులరెడ్డి, తిరుపతిరావు, నందన్న, కాసుబాబు, సీడీఆర్‌ రమణ, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
పెందుర్తిలో సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు, ఆర్‌.శ్రీనివాసరావు, అరిలోవలో నగర సహాయ కార్యదర్శి ఎస్‌కే రెహమాన్‌, జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎ.విమల, అక్కయ్యపాలెం విద్యుత్‌ సౌధ వద్ద జి.వామనమూర్తి, కంచరపాలెంలో పి.చంద్రశేఖర్‌, మల్కాపురంలో జి.రాంబాబు, అనకాపల్లిలో వైఎన్‌ భద్రం, మధురవాడలో ఎండీ బేగం అధ్వర్యాన ఆందోళనలు జరిగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img