Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

వైసీపీ నేత భూ కబ్జా

ఎమ్మెల్యే అండగా ఆగడాలు
ఆత్మహత్యే శరణ్యమన్న బాధిత కుటుంబం
రంగంలోకి దిగిన ఎస్పీ.. న్యాయం చేస్తానని హామీ

కడప : కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం ఎర్రబల్లిలో తమ వ్యవసాయ భూమిని అధికారపార్టీ నాయకుడు ఆక్రమించుకున్నారని, తమకు న్యాయం చేయాల్సిన సీఐ కొండారెడ్డి ఎన్‌కౌంటర్‌ చేస్తానంటూ బెదిరించారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, డీజీపీ సవాంగ్‌, ఐజీ తమకు న్యాయం చేయాలని, లేకపోతే తమ కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటుందని ఓ కుటుంబం సెల్ఫీ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన పునరావృతం కాకముందే తమకు న్యాయం చేయాలని, ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లే వరకు షేర్‌ చేయాలని విన్నవించింది. వీడియో వైరల్‌ కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. న్యాయం చేస్తామని ఆ కుటుంబానికి భరోసా కల్పించింది. సీఐపై శాఖాపరమైన విచారణతో పాటు ఏడు రోజుల్లోగా భూ వివాదంపై న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
కర్నూలు జిల్లా చాగలమర్రికు చెందిన మిద్దె అక్బర్‌బాషా, ఆయన భార్య మిద్దె అప్సానకు ఇద్దరు కుమార్తెలు. అక్బర్‌ బాషా వైసీపీ కార్యకర్త. జీవనోపాధి కోసం కువైట్‌ వెళ్లి వచ్చారు. అప్సానకు ఆమె తల్లి షేక్‌ ఖాసీంబీ 2009లో దాన విక్రయం కింద ఎకరంన్నర పొలాన్ని రిజిస్టర్‌ చేయించి ఇచ్చారు. ఆ భూమిలో ఎకరం పొలాన్ని వైసీపీ నాయకుడు తిరుపాల్‌రెడ్డి తన కుమారుడు విశ్వేశ్వర్‌రెడ్డి పేరున బలవంతంగా రిజస్టర్‌ చేయించారు. దీనిపై అప్సాన మైదుకూరు కోర్టులో దావా వేయగా, ఆమెకు తాత్కాలిక ఇంజక్షన్‌ ఆర్డర్‌ మంజూరు చేసింది. ఈ వ్యాజ్యం కోర్టులో నడుస్తుండగా విశ్వేశ్వరరెడ్డి 2019లో జొన్నవరం గ్రామానికి చెందిన వీరలక్ష్మికి పొలాన్ని విక్రయించారు. తన పేరుపై గల భూమిని తిరుపాల్‌రెడ్డి రాజకీయ ఒత్తిడితో 2019లో అనువంశిక భూమిగా చూపుతున్నారని ఆమె తెలిపారు. ఈ క్రమంలో అక్బర్‌బాషా కుటుంబంతో సహా ఆత్మహత్యకు దిగుతామని సెల్ఫీ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టుచేశాడు. మైదుకూరు రూరల్‌ సీఐ కొండారెడ్డి, ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డి సహకారంతో తిరుపాల్‌రెడ్డి తనను బెదిరిస్తున్నారని బాషా ఆవేదన చెందారు. తమకు న్యాయం జరగక పోతే నాలుగు మృతదేహాలను సీఎం జగన్‌కు కానుకగా

ఇస్తామని తెలిపారు.ఫేస్‌బుక్‌ పోస్టు గురించి సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ సిబ్బంది ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన దువ్వూరు ఎస్‌ఐ కేసీ రాజుకు బాధ్యత అప్పగించారు. బాధితుడిని కలవాలని ఆదేశించారు. దీంతో ఎస్‌ఐ రాజు, ఆళ్లగడ్డ ఎస్‌ఐ రాజశేఖర్‌ సిబ్బందితో కలిసి అక్బర్‌ బాషా ఇంటికి చేరుకున్నారు. ఎస్పీ వద్దకు తీసుకెళ్లి న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో బాధితులు శాంతించారు. సీఐ కొండారెడ్డిపై విచారణకు అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్‌ను ఎస్పీ నియమించారు. అప్పటి వరకు సీఐని విధులకు దూరంగా ఉంచారు. ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీపీ కార్యాలయ నుండి ఫోన్‌కాల్స్‌ వచ్చాయని, అక్బర్‌ బాషాకు సంబంధించి భూ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ఏడు రోజుల్లోగా న్యాయం చేయాలని, సీఐ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమస్యను పూర్తిగా పరిశీలించి బాధితుడికి న్యాయం చేయాలని వైసీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు కె.సురేష్‌ ఎస్పీని కోరారు. పార్టీ నాయకులతో పాటు బాషాను వెంట పెట్టుకొని సురేష్‌బాబు ఎస్పీని కలిసారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అక్బర్‌ బాషాకు న్యాయం చేయాలని, ఎంతటి వారినైనా శిక్షించాలని ఎస్పీని కోరామన్నారు. భూ సమస్యలు తలెత్తకుండా ముఖ్యమంత్రి భూ సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ఏది జరిగినా ముఖ్యమంత్రిపై రుద్దడం సరికాదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img