Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

సచివాలయ ఉద్యోగులకు
బడుల నిర్వహణ బాధ్యత

. ప్రతి వారం మూడు శాఖల సిబ్బంది తనిఖీలు
. వచ్చే మార్చికి తరగతి గదుల డిజిటలైజేషన్‌
. సకాలంలో ‘విద్యాకానుక’ పంపిణీ
. విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : స్కూళ్ల నిర్వహణలో ఇకనుంచి సచివాలయ ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం విద్యాశాఖపై సమీక్షించారు. ప్రతివారం స్కూళ్లను వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీసు, నెలకోసారి ఏఎన్‌ఎం సందర్శించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీరిలో ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై ఎస్‌ఓపీ తయారు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోలతో సహా ముగ్గురు సచివాలయ సిబ్బంది అప్‌లోడ్‌ చేయాలని, వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మండలస్థాయిలో ఉండే విద్యాశాఖ అధికారుల్లో (ఎంఈఓ) ఒకరికి అకడమిక్‌ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణా అంశాలు అప్పగించాలన్నారు. నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై ఆడిట్‌ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు ఆడిట్‌ నిర్వహించిన అధికారులు, వాటికి సంబంధించిన వివరాలను సీఎంకు అందించారు. స్కూళ్లలో కల్పించిన సౌకర్యాల్లో ఎదురైన సమస్యలను గుర్తించామని, వాటికి సంబంధించి వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నట్టు తెలియజేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై నిరంతరం ఆడిట్‌ చేయాలని ఆదేశించారు. స్కూళ్లకు కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అన్నది పరిశీలన చేయాలని, అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేయించాలన్నారు. స్కూళ్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌ను వాడుకుని స్కూళ్ల నిర్వహణలో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలని, ఎలాంటి సమస్యలున్నా తెలియజేయడానికి వీలుగా ఒక ఫోన్‌ నంబర్‌ను స్కూళ్లలో ప్రదర్శించాలని చెప్పారు. అనంతరం విద్యాకానుకపై సీఎం సమీక్షిస్తూ వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికే విద్యాకానుక కింద అన్నిరకాల వస్తువులూ అందించేలా కార్యాచరణ సిద్ధంచేసుకుని, పిల్లలకు ఖచ్చితంగా స్కూళ్లు ప్రారంభించినరోజే అందజేయాలని స్పష్టం చేశారు. అలాగే యూనిఫామ్స్‌ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి వేయాలని, స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్‌ కమిటీలను నిరంతరం క్రియాశీలం చేయాలని, స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తీసుకురావాలని పునరుద్ఘాటించారు. వీటిపై ఎప్పకప్పుడు విలేజ్‌ క్లినిక్‌ ద్వారా నివేదికలు పంపించాలని, దానికనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపై కూడా సీఎం సమీక్షించారు. మొత్తం 5,18,740 ట్యాబ్‌లను కొనుగోలు చేయనుండగా, తరగతి గదులను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్‌ టీవీలను, ఇంటరాక్టివ్‌ టీవీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు 72,481 యూనిట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతిగదుల డిజిటలైజేషన్‌ జరిగేలా చూడాలని, డిజిటల్‌ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ అన్నింట్లో ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అన్ని ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌ లోడ్‌ చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్‌, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌, స్కూల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img