Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సొంతిల్లు సంగతేంటి?

. రాహుల్‌ ముందున్న కఠిన సవాళ్లు
. విపక్షాల ఐక్యతకు సమర్థ నాయకత్వం అవశ్యం
. తమిళనాడు, కేరళలో పాదయాత్రకు మంచి స్పందన

న్యూదిల్లీ: ఓవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ అధ్వర్యంలో భారత్‌ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ చాలా బలహీనంగా ఉంది. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి నాయకత్వం వహించాల్సిన దశలో సొంత సమస్యలతో సతమతమవుతోంది. భారత్‌ జోడో యాత్ర సమయంలో రాహుల్‌ రక్షణ కొందరిని కలవరపె డుతోంది. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా లేకపోతే 2024లో బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌ మూడవసారి అధికారంలోకి వచ్చే అవకాశముండటంతో విభజన రాజకీయాలు మరింత జోరందుకునే పరిస్థితి ఉంటుంది. మతవిద్వేషం, కులహింస, పితృస్వామ్య సంస్కృతి, నిరుద్యోగం, శ్రమదోపిడీ, భావప్రకటన స్వేచ్ఛ హరణ పేట్రేగిపోతోంది. వాక్‌స్వేచ్ఛ లేకుండా పోతుంది. సమాజం, రాజకీయం రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. నాయకత్వం మారితే తప్ప క్షేత్రస్థాయిలో మార్పులు సాధ్యం కాదు. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు రానిదే నాయకత్వం మారబోదు. భారత్‌ జోడో యాత్ర ద్వారా ఈ రెండూ పరిష్కారమయ్యే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్‌ ఎన్నడూలేని విధంగా అస్థిర పరిస్థితులనుసంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నేతల పార్టీ ఫిరాయింపులు, రాజీనామాలు, గ్రూపు రాజకీయాలు, తిరుగుబాట్లు, ద్వితీయశ్రేణి నాయకులు ‘బీజేపీ’ పలుకులు పలకడం వంటివి హస్తం పార్టీకి పెద్ద సమస్యగా మారింది. నౌక మునిగిపోయేటప్పుడు ఎలుకలు బయటకు దూకివేస్తాయన్న చందంగా హస్తం పార్టీ పరిస్థితి ఉంది. ఏడేళ్లలో ఈ పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో అనేకమంది బీజేపీకి విధేయులుగా మారారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సొంత ప్రభుత్వాలనే కూల్చివేశారు. ఈ పరిస్థితులు కాంగ్రెస్‌ను కుదిపివేశాయి. అస్థిర పరిస్థితులను చక్కబెట్టడంలో అధిష్ఠానం అవస్థలు పడుతోంది. స్వీయ వినాశనం అంచున ఉన్న పార్టీని ఏకంబలోపేతం చేయడం అన్నది రాహుల్‌ గాంధీ ముందున్న కష్టసాధ్యమైన కార్యం.
కాంగ్రెస్‌ వెన్ను విరవడమే బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌సంఫ్‌ుపరివార్‌ ఉమ్మడి లక్ష్యం. కాంగ్రెస్‌ రహిత దేశమే తమ అజెండా అని 2014లో మోదీ ప్రకటించారు. కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీ ఎప్పుడూ బీజేపీని నిలదీయకుండా లేరు. తప్పును తప్పుగానే చెప్పారు. ‘ఎఫ్‌’ పదం వాడేందుకు భయపడరు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ‘ఫాసిస్టు పురుషాధిక్య సామాజిక సంస్థ’ అని బహిరంగంగానే విమర్శించారు. ప్రస్తుత పాదయాత్రతో రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తు ముడిపడి ఉంది. ఇది దేశ భవిష్యత్‌నూ ప్రభావితం చేస్తుంది. 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు దేశంలోని భిన్నాభిప్రాయాలు, అవకాశవాదులు, మనస్ఫూర్తిగా మద్దతివ్వని ప్రతిపక్షాలకు నాయకత్వం వహించడమే కాకుండా అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ముందుకు నడిపించగలగడమన్నది కాంగ్రెస్‌కు ఒక అద్భుతమే అవుతుంది. కేవలం బ్యాలెట్‌ ద్వారా బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ ఓటమి సాధ్యం కాదు. హిందూత్వ ఫాసిజం ఇప్పటికే సాంస్కృతికసంస్థాగత వారసత్వంలోకి చొచ్చుకుపోయింది. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఫాసిస్టు ధోరణులు అంతమవ్వబోవని చెప్పేందుకు అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌, బ్రెజిల్‌లో లూయిస్‌ లూలా డ సిల్వా ఎన్నికలే ఉదాహరణ. అమెరికాలో ట్రంపిజాన్ని ఓడిరచినది డెమొక్రటిక్‌ పార్టీ కాదు. లూలా గెలుపుతో బోల్సనారోయిజం ఓడిరది లేదు. మతవాద విధానానికి ముగింపు పలకాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామిక విధానాలను గౌరవించినంత మాత్రాన మతవాదం అంతం కాదు.
2024లో ఓడిపోయినా అధికారం చేజిక్కించుకోవడం కోసం బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ అప్రజాస్వామికపార్లమెంటు వ్యతిరేక విధానాలను అవలంబించే ఏ మార్గాన్నీ వదలదు. సంఘవిద్రోహ శక్తులు, అల్లరిమూకల ప్రయోగానికీ వెనుకాడబోదు. భారత్‌ జోడో యాత్ర ఆరంభంలో మాట్లాడినప్పుడు బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను రాహుల్‌గాంధీ సరిగ్గానే అన్వయించారు. ప్రభుత్వ సంస్థలుప్రభుత్వ వ్యవస్థ స్వాధీనమే ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ ఉద్దేశమని చెప్పారు. బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ను అడ్డుకోవాలంటే ఐక్యతకు పిలుపివ్వడం మాత్రమే సరిపోదు. స్పష్టమైన అజెండాతో ప్రజా ఉద్యమాన్ని కాంగ్రెస్‌ చేపట్టాలి. పార్టీకి పునర్వైభవం రావాలంటే కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ` విపక్షంగా ఉన్న రాష్ట్రాలలో వ్యవహారాన్ని పరిశీలించుకోవాలి. ధోరణిని మార్చుకోవాలి. మేథోమధనంతో పాటు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాహుల్‌ యాత్ర చత్తీస్‌గఢ్‌ మీదుగా సాగే క్రమంలో అదే రాష్ట్రంలో సిల్గర్‌ నుంచి సుక్మా వరకు సాగాల్సిన సీపీఐ పాదయాత్రను అక్కడి కాంగ్రెస్‌ నేతృత్వ భూపేశ్‌ బాఘెల్‌ ప్రభుత్వం నిషేధించినట్లు వార్తలు వచ్చాయి. జాతీయ సమైక్యతా సందేశాన్ని దేశవ్యాపితం చేసేందుకు రాహుల్‌గాంధీకి ఎంత హక్కు ఉన్నదో సైనికీకరణ (మిలిటరైజేషన్‌), కార్పొరేటీకరణ వ్యతిరేక స్వరాన్ని ఐక్యంగా వినిపించేందుకు యువతకు, ఆదివాసీలకు అంతే హక్కు ఉంది. తమిళనాడు, కేరళలో భారత్‌ జోడో యాత్రకు వస్తున్న అమితాదరణ మార్పుకు చోదకశక్తిని ఇచ్చే అవకాశం ఉంది.
ఏదిఏమైనా భారత్‌ నవభవిత కార్యసాధన కోసం రాహుల్‌ మరింతగా శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నారా? కాంగ్రెస్‌ యాత్ర ద్వారా బీజేపీ నోరుమెదపని అనేక అంశాలు బహిర్గతం అవుతూ చర్చనీయాంశాలుగా మారడంతో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాతావరణ సంక్షోభం, అణుశక్తి, పర్యావరణ పరిరక్షణ, కుల గణన, రిజర్వేషన్‌, కార్మికులకు రక్షణ, పేదరికం, రైతులు, సామాజిక అభివృద్ధి వంటి సమస్యలకు తమ పార్టీ పరిష్కారాన్ని చూపగలదా అన్నది అత్మవిమర్శ చేసుకోకపోతే ఫలితం ఉండదు. సమస్యాత్మక వారసత్వ సంకెళ్లను తెంచుకొని ముందుకు సాగగలదా అన్నది మరో ప్రశ్న. ఈ యాత్ర కేవలం ప్రజాదరణ కోసమేనా అన్నదీ ప్రశ్నార్థకమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img