Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సబ్‌ డీలర్లుగా ఆర్బీకేలు

రబీ సీజన్‌ నుంచి అమలు
ఖరీఫ్‌కి 33 సీడ్‌ కమ్‌ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు
వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరే లక్ష్యం
రైతు నిరాశకు లోనుకాకూడదు
అగ్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల సమీక్షలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరసమైన ధరలకు సరఫరా చేస్తూ రైతులకు ఎంతో ప్రయోజనం కల్పిస్తున్న రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకే) ఇకపై సబ్‌ డీలర్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రబీ సీజన్‌ నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. అగ్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సందర్భంగా ఈ విషయం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడిరచారు. దీనివల్ల రవాణా సమస్య, ఎరువుల సరఫరా సులభమవుతుందని, రైతులకు మరింత మేలు జరుగుతుందని సీఎం జగన్‌ తెలిపారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 33 చోట్ల సీడ్‌ కమ్‌ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పూర్తి కానున్నట్లు చెప్పారు. బోర్ల కింద వరిసాగు చేసే పొలాల్లో మిల్లెట్స్‌తోపాటు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఇలాంటి చోట్ల ఏర్పాటు చేస్తున్న ప్రాసెసింగ్‌ యూనిట్లు ఎంతవరకొచ్చాయని సీఎం ప్రశ్నించారు. డిసెంబరునాటికి 20 యూనిట్లు అందుబాటులోకి వస్తాయని, 2022 మార్చి నాటికి 33 యూనిట్లు సిద్ధమవుతాయని అధికారులు తెలిపారు. ఖరీఫ్‌ కల్లా ఎట్టిపరిస్థితుల్లో పూర్తి కావాలని సీఎం అధికారు లను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీని పెంచి రైతులకు మంచి ధర అందేలా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ధరల విషయంలో రైతులకు నిరాశాజనక పరిస్థితులు ఉంటే వెంటనే జోక్యం చేసుకొని ధరల స్థిరీకరణ నిధి ద్వారా వారిని ఆదుకోవాలన్నారు. మార్కెట్లో డీలర్‌ అమ్మే రేట్లకన్నా ఆర్బీకేల్లో తక్కువ రేట్లకే లభిస్తుండడంతో రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని అధికారు లు తెలపగా, ఇలాంటి ఆర్బీకేలపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా జిల్లాల్లో పాల సేకరణ అంతకంతకూ పెరుగుతోందని అధికారులు వివరించారు. రైతులకు మేలు చేస్తున్న ఈ కార్యక్రమంపైనా లేనిపోని అభాండాలు వేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అమూల్‌ అన్నది ప్రైవేటు సంస్థకాదని, అది పెద్ద సహకార ఉద్యమమని, పాలుపోసే రైతులే ఈ సంస్థకు యజమానులని, ఇందులో లాభాలన్నీ వారికే చెందుతాయని సీఎం అన్నారు. ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంపై సమీక్ష సందర్భంగా జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో జరుగుతున్న పనుల వివరాలను అధికారులు వివరిస్తూ వచ్చే జులై నాటికి కొలిక్కి వస్తాయని తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img