Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

సవాంగ్‌పై బదిలీ వేటు

కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్‌ రెడ్డి

ఉద్యోగుల చలో విజయవాడే కీలకం
కీలక అధికారుల వరుస బదిలీలతో ఉన్నతాధికారుల్లో కలవరం

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంలో వరుసగా జరుగుతున్న కీలక అధికారుల బదిలీలు ఉన్నతాధికారుల్లో కలవరం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా పని చేస్తున్న అధికారులపై బదిలీ వేటు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల్లో గుబులు పుట్టిస్తోంది. మొన్నటివరకు సీఎంవోలో అన్నీ తానై అత్యంత కీలకంగా వ్యవహరించిన సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ని బదిలీ చేసి 24 గంటలు గడవకముందే, డీజీపీ గౌతం సవాంగ్‌పై బదిలీ వేటు పడటం ఐపీఎస్‌లను షాక్‌కు గురి చేసింది. ఆయన స్థానంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేస్తున్న ఆయనకు ప్రభుత్వం డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ మంగళవారం ఉత్వర్వులు జారీ చేశారు. సవాంగ్‌కి మాత్రం పోస్టింగ్‌ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించారు. 2023 జులై వరకు గౌతం సవాంగ్‌కు పదవీకాలం ఉన్నప్పటికీ, ఈలోపే ఆకస్మికంగా బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. సహజంగా డీజీపీ పోస్టు సీనియర్లకు, రిటైర్‌మెంట్‌ స్టేజ్‌లో దక్కుతుంది. ఆ హోదాలోనే రిటైర్‌ అవడం గౌరవంగా భావిస్తారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా మెలగుతూ, విధి నిర్వహణలో జగన్‌ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారన్న తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొన్న గౌతం సవాంగ్‌ పోలీస్‌ బాస్‌గానే రిటైర్‌ అవుతారని అందరూ భావించారు. కానీ గతంలో సీఎస్‌ సుబ్రహ్మణ్యం తరహాలోనే అవమానకర పద్ధతిలో సవాంగ్‌ బదిలీ వేటుకు గురయ్యారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలపై కేసుల నమోదు, అరెస్ట్‌లు, ఆందోళనల సందర్భంగా నిర్బంధాల విషయంలో సవాంగ్‌ తీవ్ర విమర్శలకు గురయ్యారు. కొన్ని కేసుల్లో హైకోర్టుకు సైతం హాజరు కావాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారు. చట్టాన్ని ఖాతరు చేయకుండా ముఖ్యమంత్రి చెప్పిందే వేదంగా పోలీసులను వైసీపీ కార్యకర్తలా వినియోగిస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. చట్టరూపం దాల్చకపోయినా దిశ చట్టం, దిశ యాప్‌ అమలుకు, ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడంలో గౌతమ్‌ సవాంగ్‌ కీలకంగా పని చేసి సీఎం అభిమానాన్ని చూరగొన్నారు. ఇలా అనేక అంశాల్లో ఆయన వ్యవహరించిన తీరుతో ఏపీలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని దాదాపు అన్ని రాజకీయ పార్టీల నేతలు అనేకసార్లు బహిరంగ విమర్శలు చేశారు. అలాంటి సవాంగ్‌పై సీఎం బదిలీ వేటు వేయడం ఐపీఎస్‌ ఉన్నతాధికారులను విస్మయానికి గురి చేసింది.
ఉద్యోగుల చలో విజయవాడే కీలకం
అయితే గౌతం సవాంగ్‌ బదిలీకి ఈనెల 3వ తేదీ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమమే ముఖ్య కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు విజయవాడ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి ఇక్కడకు ఎవరూ రాకుండా ఉద్యోగ సంఘ నేతలను ఎక్కడికక్కడే హౌస్‌ అరెస్ట్‌లు చేసి, అడుగడుగునా నిర్బంధాలు కొనసాగించారు. దీనిపై ప్రభుత్వానికి పోలీస్‌ ఇంటిలిజెన్స్‌ జిల్లాకు 500కి మించి వచ్చే అవకాశం లేదని సమాచారం ఇచ్చారు. కానీ అనూహ్యంగా లక్షల మంది విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఉద్యోగులు కదం తొక్కడంతో ప్రభుత్వ పెద్దలు హతాశులయ్యారు. ఈ ఘటనతో దిగొచ్చిన ప్రభుత్వం సమ్మె పరిష్కారానికి ఉద్యోగులతో చర్చలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడిరది. దీనిపై ముఖ్యమంత్రి పోలీస్‌ శాఖపై సీరియస్‌ అయ్యారు. డీజీపీ గౌతం సవాంగ్‌ ప్రత్యేకంగా సీఎంతో భేటీ అయ్యి వివరణ ఇచ్చుకున్నారు. కానీ ముఖ్యమంత్రి శాంతించలేదు. చలో విజయవాడ విజయవంతం కావడానికి కారణాలేంటో ఆరా తీశారు. టీడీపీ మద్దతుతో కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఉద్యోగ సంఘాల వల్లే ఇలా జరిగిందని భావించారు. ఆ మేరకు ముందు ఎర్రజెండా… వెనుక పచ్చజెండా అంటూ ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కామెంట్‌ కూడా చేశారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎన్జీవో సంఘ అధ్యక్షులు అశోక్‌బాబు పాత్ర కీలకంగా ఉన్నట్లు అనుమానించారు. ఆ తర్వాతే ఆయన విద్యార్హతలకు సంబంధించి లోకాయుక్త ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో అశోక్‌బాబుపై నాన్‌ బెయిల్‌బుల్‌ సెక్షన్లు విధించి, బెయిల్‌ రాకుండా చేయడంలో సవాంగ్‌ విఫలమయ్యారని సీఎం భావించినట్లు సమాచారం. మరోపక్క ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్‌ను నివారించడంలో ఏపీ పోలీస్‌ శాఖ పూర్తిగా విఫలమైందన్న ప్రచారం దేశస్థాయిలో జరగడం, గంజాయి ఏ రాష్ట్రంలో పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉండడంతో కేంద్రం నుంచి సవాంగ్‌ తొలగింపుపై ముఖ్యమంత్రికి ఒత్తిళ్లు వచ్చాయనే ప్రచారం సాగుతోంది. అయితే ముఖ్యమంత్రి తనకు ఇష్టం లేకపోతే తప్ప, ఎవరు చెప్పినా వినిపించుకోరని ఆయనకు సన్నిహిత అధికారులే పేర్కొంటున్నారు.
జూనియర్‌ అయినా రాజేంద్రనాథ్‌ రెడ్డికే అవకాశం
గౌతం సవాంగ్‌ తర్వాత సీనియర్‌ ఐపీఎస్‌లున్నప్పటికీ ముఖ్యమంత్రి జిల్లా, సొంత సామాజికవర్గానికి చెందిన వారు కావడం వల్లే కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డికి డీజీపీగా అవకాశం ఇచ్చారని ఐపీఎస్‌ల్లో చర్చ సాగుతోంది. కడప జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామానికి చెందిన రాజేంద్రనాథ్‌ రెడ్డి 1992కి బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన కొన్నేళ్ల క్రితమే ఆయన కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడిరది. విజయవాడ, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా, ఔషధ నియంత్రణ విభాగంతో పాటు వివిధ స్థాయిల్లో అధికారిగా ఆయన సేవలందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img