Friday, August 12, 2022
Friday, August 12, 2022

సాగు చట్టాలపై ఓటమికి కేంద్రం ప్రతీకారం..

‘అగ్నిపథ్‌’పై రైతు, కార్మిక సంఘాల ఆగ్రహం

దేశవ్యాప్తంగా నిరసనలు బ పంజాబ్‌లో కలెక్టరేట్ల ముట్టడి
హరియాణాలో పాదయాత్ర
పాత నియామక పద్ధతి పునరుద్ధరణకు డిమాండు
రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పణ
భవిష్యత్‌ కార్యాచరణపై 3న ఘజియాబాద్‌లో ఎస్‌కేఎం సదస్సు

న్యూదిల్లీ : దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు రైతు, కార్మిక సంఘాలు రంగంలోకి దిగాయి. దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో నిరసన కార్యక్రమాలను రైతులు, కార్మికులు శుక్రవారం చేపట్టారు. అగ్నిపథ్‌ పథకం అమలుకు పూనుకున్న కేంద్రంతో పాటు త్రివిధ దళాధిపతుల తీరును తీవ్రంగా ఖండిరచారు. ఈ పథకాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన కొనసాగుతుందని తేల్చిచెప్పారు. సాగు చట్టాలపై ఓటమికి ప్రతీకారంగానే అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్రం తీసుకువచ్చిందని రైతు నేతలు అన్నారు. దీని ప్రభావం రైతాంగంపై ప్రత్యక్షంగా ఉంటుందని అన్నారు. దేశాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం నిర్విరామ ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. అగ్నిపథ్‌ పథకం ఉపసంహరణకు నేతలు డిమాండు చేశారు. పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో రైతుల అధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. పంజాబ్‌లో కలెక్టరేట్లను రైతులు ముట్టడిరచారు.
యువత నిరసన గళాన్ని అణచివేసేలా త్రివిధ దళాధిపతులు బెదిరింపులకు పాల్పడటాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆక్షేపించింది. అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా యువకులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండు చేసింది. ఏదేని నియామకం కోసం అభ్యర్థులకు ముందస్తుగా షరతులు పెట్టరాదని, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు లేకుండా అఫిడవిట్‌లు ఇవ్వమనడం సరైనది కాదని ఎస్‌కేఎం వెల్లడిరచింది. ఇటువంటి పథకాలతో పుండు మీద కారం చల్లే పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. సాయుధ దళాల కమాండ్‌ ఇన్‌ చీఫ్‌గా రామ్‌నాథ్‌ కోవింద్‌ వెంటనే జోక్యం చేసుకొని సైనిక నియామకాల పాత పద్ధతిని పునరుద్ధరించాలని, కొత్త ప్రణాళిక ఉపసంహరించుకునేలా చూడాలని డిమాండు చేసింది. ఈ మేరకు మెమోరాండాన్ని రాష్ట్రపతికి సమర్పించింది. ‘అగ్నిపథ్‌ పథకాన్ని ప్రకటించిన తర్వాత దేశ యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపింది. చాలా మంది షాక్‌కు గురై ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. ప్రజాగ్రహం కొన్ని చోట్ల హింసకు దారితీయడం దురదృష్టకరం. కేంద్రప్రభుత్వ అసంబద్ధ ప్రకటనలు చేస్తోంది. త్రివిధ దళాధిపతులు యువతను బెదిరించారు.నిరసన హక్కును అణచివేయాలని చూశారు’ అని ఎస్‌కేఎం విమర్శించింది.
పంజాబ్‌లో రైతులు జిల్లా కలెక్టరేట్లు, ఎస్‌డీఎం కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్రానికి, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త నియామక ప్రణాళికతతో అనేక ఆర్మీ రెజిమెంట్ల చరిత్రకు చరమగీతం పాడాలని కేంద్రం యోచించిందని, తద్వారా భారత్‌ను హిందూత్వ దేశంగా మార్చే దిశగా అడుగు వేసిందని క్రాంతికారి కిసాన్‌ యూనియన్‌ (కేకేయూ) అధ్యక్షుడు దర్శన్‌ పాల్‌ అన్నారు. ప్రభుత్వ శాఖలను కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం నిర్విరామంగా ప్రయత్నిస్తోందన్నారు. అగ్నిపథ్‌ పథకం కూడా ఇలాంటిదేనని, మూడు సాగు చట్టాలపై పోరాటంలో రైతులు, కార్మికుల చేతుల్లో ఓడినందుకు ప్రతీకారంగా ఈ పని చేసిందని దుయ్యబట్టారు. హరియాణాలో రైతులతో పాటు మహిళలు, విద్యార్థులు, ఆర్మీ అభ్యర్థులు, మాజీ సైనికులు ఆందోళనల్లో పెద్దఎత్తున పాల్గొన్నారు. అగ్నిపథ్‌ పథకం వల్ల రైతాంగంపై నేరుగా ప్రభావం ఉంటుందని అఖిలభారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) నేత ఇందర్‌జిత్‌ సింగ్‌ అన్నారు.
భారతీయ సైన్యం కూర్పు (కంపోజిషన్‌), స్వరూపం (కారెక్టర్‌)ను తీవ్రంగా దెబ్బతీసే ఈ పథకం ఉందన్నారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనను రైతులు కొనసాగిస్తారని తేల్చిచెప్పారు. ఈ దిశగా భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జులై 3న జాతీయ సమావేశానికి ఎస్‌కేఎం పిలుపునిచ్చిందని సింగ్‌ తెలిపారు. అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా హరియాణాలో పాదయాత్ర (పైదల్‌ యాత్ర) కొనసాగనుంది.
కాగా, అగ్నిపథ్‌ పథకం కింద 44వేల మంది అగ్నివీరులను 90 రోజుల్లో నియమిస్తామని, వారు నాలుగేళ్లు ఉద్యోగంలో ఉంటారని కేంద్రం ప్రకటించింది. వాస్తవానికి నాన్‌ `కమిషన్డ్‌ రిక్రూట్‌ సర్వీసు కాలం 17ఏళ్లు. ఈ పథకం కింద నియమితులైన వారి ప్రదర్శన, మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేసి 15ఏళ్లు సర్వీసులో కొనసాగిస్తామని వెల్లడిరచింది. మిగతా వారికి రిటైర్మెంట్‌ ఇచ్చి రూ.11.71లక్షల ప్యాకేజి ఇస్తామని, వేర్వేరు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని కేంద్రం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img