Monday, August 8, 2022
Monday, August 8, 2022

సివిల్‌ సర్వీసెస్‌`2021 ఫలితాలు విడుదల..అగ్రస్థానాలు మహిళలకే…

ఆలిండియా టాపర్‌ శృతిశర్మ
రాణించిన తెలుగు విద్యార్థులు

న్యూదిల్లీ: సివిల్స్‌ -2021 తుది ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం నిర్వహించిన పరీక్షలో 685 మందిని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఎంపిక చేసింది. అందులో 508మంది పురుషులు, 177మంది మహిళలు ఉన్నారు. వీరందరినీ కమిషన్‌ వేర్వేరు కేంద్ర సర్వీసులకు సిఫార్సు చేసింది. కాగా సివిల్స్‌ ఫలితాల్లో తొలి నాలుగు స్థానాల్లో అమ్మాయిలే నిలిచారు. శృతి శర్మ అఖిలభారత స్థాయిలో మొదటి ర్యాంక్‌ కైవసం చేసుకుంది. అంకిత అగర్వాల్‌… రెండో ర్యాంక్‌, గామిని సింగ్మా… మూడో ర్యాంక్‌, ఐశ్వర్య వర్మ… నాలుగో ర్యాంక్‌ సాధించారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ రౌండ్స్‌ తర్వాత యూపీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్‌ ఫలితాలను మార్చి 17న యూపీఎస్సీ ప్రకటించింది. ఆ తర్వాత ఏప్రిల్‌ 5 నుంచి మే 26 వరకు ఇంటర్వ్యూలు (పర్సనాలిటీ టెస్ట్‌) నిర్వహించింది. మెయిన్స్‌, ఇంటర్వ్యూ మార్కులతో సివిల్స్‌ తుది విజేతలను ప్రకటించింది.
శృతి శర్మ విషయానికి వస్తే ఆమె ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందినవారు. ఆమె హిస్టరీ స్టూడెంట్‌. సెయింట్‌ దిల్లీ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని స్టీఫెన్స్‌ కాలేజ్‌ నుంచి పట్టభద్రులయ్యారు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆమె యూపీఎస్సీ సీఎస్‌ఈ పరీక్షల కోసం చాలా కాలంగా శిక్షణ పొందుతున్నారు. జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అకాడమీ లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు శిక్షణ తీసుకున్నారు. ఇక రెండో ర్యాంకు సాధించిన అంకిత అగర్వాల్‌… దిల్లీ యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. మూడో ర్యాంకు సాధించిన కంప్యూటర్‌ సైన్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. మొదటి 25 స్థానాల్లో 15 మంది పురుషులు కాగా 10 మంది మహిళలు ఉన్నారు. ఈసారి అఖిల భారత సర్వీసులకు మొత్తం 685 మంది ఎంపిక కాగా.. జనరల్‌ కోటాలో 244 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌కు 180, ఐపీఎస్‌కు 200, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ ఏ కేటగిరీకి 242 మంది ఎంపిక కాగా.. మరో 90 మంది గ్రూప్‌ బీ సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్‌సీ ప్రకటించింది.
టాపర్‌ అవుతానని అనుకోలేదు : శృతి
సివిల్స్‌ టాపర్‌గా నిలిచిన శృతి శర్మ మాట్లాడుతూ… యూపీఎస్‌సీ పరీక్షలో అర్హత సాధిస్తానని తనకు నమ్మకం ఉంది… అయితే మెరిట్‌ జాబితాలో అగ్రస్థానంలో ఉండటం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీసెస్‌ (ఐఏఎస్‌)లో చేరి దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. తనకు ఎంతగానో సహకరించిన తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రతి ఒక్కరికీ ఈ విజయం దక్కుతుందని చెప్పారు.
మొదటి పది ర్యాంకర్లు వీరే… శ్రుతి శర్మ (1), అంకిత అగర్వాల్‌ (2), గామిని సింగ్లా (3), ఐశ్వర్య వర్మ (4), ఉత్కర్ష్‌ ద్వివేది (5), యక్ష్‌ చౌదరి (6), సమ్యక్‌ ఎస్‌ జైన్‌ (7), ఇషిత రాథీ (8), ప్రీతమ్‌ కుమార్‌ (9), హర్‌ కీరత్‌ సింగ్‌ రంధావా (10)
తెలుగు విద్యార్థుల సత్తా : మరోవైపు సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. యశ్వంత్‌కుమార్‌రెడ్డికి 15వ ర్యాంకు రాగా.. పూసపాటి సాహిత్య (24), కొప్పిశెట్టి కిరణ్మయి (56), శ్రీపూజ (62), గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి (69), ఆకునూరి నరేశ్‌ (117), అరుగుల స్నేహ (136), బి.చైతన్యరెడ్డి (161), ఎస్‌.కమలేశ్వరరావు (297), విద్యామరి శ్రీధర్‌ (336), దిబ్బడ ఎస్వీ అశోక్‌ (350), గుగులావత్‌ శరత్‌ నాయక్‌ (374), నల్లమోతు బాలకృష్ణ (420), ఉప్పులూరి చైతన్య (470), మన్యాల అనిరుధ్‌ (564), బిడ్డి అఖిల్‌ (566), రంజిత్‌కుమార్‌ (574), పాండు విల్సన్‌ (602), బాణావత్‌ అరవింద్‌ (623), బచ్చు స్మరణ్‌రాజ్‌ (676) ర్యాంకులు సాధించారు.
ప్రధాని అభినందన: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. ‘2021 సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్‌) పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ అభినందనలు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ముఖ్యమైన సమయంలో పరిపాలనా వృత్తిని ప్రారంభిస్తున్న ఈ యువకులకు నా శుభాకాంక్షలు’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన వారిని ఉద్దేశించి మోదీ ఓదార్పు వ్యాఖ్యలు చేశారు. ‘సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన వారి నిరాశను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను… అయితే వీరు తాము అనుసరించే ఏ రంగంలోనైనా ముద్ర వేయగల అత్యుత్తమ యువకులు అని కూడా నాకు తెలుసు. భారతదేశం గర్వపడేలా చేయండి. వారికి నా శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా సివిల్స్‌ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img