Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

సుబాబుల్‌, జామాయిల్‌కు మద్దతు ధరపై జోక్యం

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘ సమన్వయ కమిటీ విజ్ఞప్తి

న్యూదిల్లీ : సుబాబుల్‌, జామాయిల్‌ కర్రలకు ప్రస్తుతం ఇస్తున్న మద్దతు ధర కన్నా అదనంగా ఇప్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘ సమన్వయ కమిటీ కోరింది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణాజిల్లాల్లో నాలుగేళ్లుగా సుబాబుల్‌ టన్నుకు రూ.4200, జామాయిల్‌ టన్నుకు రూ.4400 ధరను ప్రభుత్వాధికారులు, పేపర్‌ కంపెనీల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు ఉమ్మడిగా నిర్ణయించినట్టు ఉపరాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. అనంతర కాలంలో సాగు ఖర్చులు పెరుగుతున్నా సుబాబుల్‌, జామాయిల్‌ కర్రకు రూ.1200 నుంచి రూ.2400 వరకూ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. వేసిన పంట నాలుగేళ్ల తరువాత చేతికి వచ్చే సరికి

రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రం అందజేశామని పేర్కొన్నారు. ఈ అంశాన్ని సానుభూతితో పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చి రైతులకు మేలు చేకూర్చాలని వెంకయ్యనాయుడిని రైతుసంఘ సమన్వయ కమిటీ కోరింది. వెంకయ్య నాయుడిని కలిసిన వారిలో సంఘం కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, నాయకులు రావుల వెంకయ్య, కేవీవీ ప్రసాద్‌, ఎం.శ్రీనివాసరెడ్డి, కె వీరారెడ్డి, డీ హరినాథ్‌, డా॥ కొల్లా రాజమోహన్‌, ఎం. యల్లమందారావు, వీ రాజగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకూ పొడిగించాలి
గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకూ పొడిగించేలా సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చి మేలు చేకూర్చాలని నల్లమడ రైతు సంఘం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కోరింది. దశాబ్దాల కాలంగా సాగు, తాగునీరు లేక అల్లాడుతున్నామని, దీనిపై ఇప్పటి వరకూ ఎన్ని పోరాటాలు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. కృష్ణానదికి 40 మైళ్ల దూరంలో ఉన్నా తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. నల్లమడ వాగులోకి ఎప్పుడైనా వచ్చే నాగార్జునసాగర్‌ మురుగు నీరే ఆధారమని, చిలకలూరిపేట ప్రాంత పరిశ్రమల వ్యర్థాలతో కలుషితమైన నీటిపై ఆధారపడి వ్యవసాయం చేయడం వల్ల భూములు చవుడుబారిపోతున్నాయని వాపోయారు. అయితే దీనిపై ఎన్నో ఏళ్లుగా పోరుడుతున్నా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పత్తిపాడు సభలో గుంటూరు చానల్‌ను పొడిగించి పెదనందిపాడు, పర్చూరు, పత్తిపాడు ప్రాంతాలకు నీరందిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఆ హామీ కూడా నీటి మూటలుగా మారిపోవడంతో విసుగు చెందిన రైతులు నిరవధిక దీక్షలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఐదు రోజుల దీక్షల అనంతరం చానల్‌ పొడిగింపునకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందనీ, కానీ ప్రస్తుత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కూడా దీనిపై అనేక వినతిపత్రాలు ఇచ్చామనీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు చేస్తామని చెప్పారే గానీ ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. గతంలో ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో పర్చూరు, కాకుమాను, పెదనందిపాడు, పత్తిపాడులకు గుంటూరు చానల్‌ పొడిగిస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం ఆయన సీఎం అయినా సమస్య అలానే ఉండిపోయిందన్నారు.
నీటి పారుదల శాఖ సర్వే చేసి, టెండర్లు పిలిచినా బడ్జెట్‌లో నిధులు కేటాయించ లేదనీ, భూమిని సేకరించలేదనీ ఇంతకన్నా అన్యాయం ఎక్కడా ఉండదని పేర్కొన్నారు. చెంతనే కృష్ణ ఉన్నా భూగర్భ జలాలు లేని ప్రాంతంగా సుదీర్ఘ కాలం నుంచి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైందని, తక్షణమే కలగజేసుకుని సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని నల్లమడ రైతు సంఘం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కోరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img