Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సోషల్‌ మీడియా ఉగ్ర ఆయుధం

సాంకేతిక పరిజ్ఞానంతో నూతన సవాళ్లు
కౌంటర్‌ టెర్రరిజం సంస్థకు 5 లక్షల డాలర్లు: జైశంకర్‌

న్యూదిల్లీ : మానవాళికి ఉగ్రవాద ముప్పు పెరుగుతోందని, ఇది మరింత విస్తరిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెందిన కౌంటర్‌ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశంలో ఆయన శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సమాజాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో కుట్ర సిద్ధాంతాలను వ్యాప్తి చేయడంలో ఇంటర్‌నెట్‌, సామాజిక మాధ్యమాలు మిలిటెంట్‌ గ్రూప్‌ల టూల్‌కిట్‌లో శక్తిమంతమైన సాధనాలుగా మారాయి. కొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త సవాళ్లను విసురుతోంది. మానవాళికి ఉన్న ఉగ్రముప్పును ఎదుర్కోవడానికి ఐరాస భద్రతామండలి తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ…ఉగ్రవాదం విస్తృతమవుతోంది. ఆసియా, ఆఫ్రికాలో ఈ పరిస్థితి తీవ్రమవుతోంది. ఉగ్రవాద నిరోధక ఆంక్షలు రూపొందించడంలో, ఉగ్రసంస్థలకు నిధులు అందించే దేశాలను నోటీసులో ఉంచడంలో మండలి కీలకంగా వ్యవహరించింది’ అని మంత్రి జైశంకర్‌ అన్నారు. ఉగ్రవాదం జాఢ్యాన్ని నివారించేందుకు రెండు దశాబ్దాల నుంచి ఐక్య రాజ్యసమితి చెప్పుకోదగిన కృషి చేస్తున్నప్పటికీ, అది విస్తరిస్తోందన్నారు. ఈ టెక్నాలజీలు ప్రభుత్వాలకు, నియంత్రణ వ్యవస్థలకు నూతన సవాళ్లను విసురుతున్నాయన్నారు. ఉగ్రవాద నిరోధం లక్ష్యంగా ఆంక్షలు విధిస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ నిధులతో నడిచే వ్యవస్థగా మార్చిన దేశాలను ఎత్తి చూపేందుకు ఈ కృషి దోహదపడుతోందని చెప్పారు. ఇటువంటి కృషి జరుగుతున్నప్పటికీ ఉగ్రవాదం పెరుగుతూనే ఉందన్నారు. ఐరాస కౌంటర్‌ టెర్రరిజం ట్రస్ట్‌కు భారతదేశం ఈ ఏడాది 5 లక్షల డాలర్లు అందజేస్తుందని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో సభ్య దేశాల సత్తాను పెంచేందుకు సహాయపడటం కోసం ఈ నిధులు ఇస్తామని తెలిపారు. ఈ సమావేశాలు మొదటి రోజు ముంబైలోనూ, రెండో రోజు ఢల్లీిలోనూ జరిగాయి. భారత్‌లో జరుగుతోన్న ఈ కౌంటర్‌ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశాల్లో ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పాక్‌ గ్రే లిస్ట్‌లో ఉండగా దాడులు తగ్గాయి
భారత్‌ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) గ్రే లిస్ట్‌ వల్లే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు తగ్గిపోయాయని పాక్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి జైశంకర్‌ అన్నారు. ఈ పరస్పర సంబంధాన్ని ఈ కమిటీ పరిశీలించాలని కోరారు. ఇటీవల ‘గ్రే లిస్ట్‌’ నుంచి పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, యూరోపియన్‌ యూనియన్‌ తదితర సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం పాకిస్తాన్‌కు ఏర్పడిరది. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను కట్టడిచేసే లక్ష్యాలను పాక్‌ అందుకోకపోవడం వల్ల ఎఫ్‌ఏటీఎఫ్‌ నాలుగేళ్లపాటు ఆ దేశాన్ని గ్రే లిస్ట్‌లో ఉంచింది.
భారత్‌కు ధన్యవాదాలు: డేవిడ్‌
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలికి భారత దేశ నాయకత్వం నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఐరాస భద్రతా మండలి కౌంటర్‌ టెర్రరిజం కమిటీ అధినేత డేవిడ్‌ చెప్పారు. ముఖ్యమైన సమస్యగానూ, ప్రధానంగా దృష్టి సారించవలసిన అంశంగానూ నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని చూస్తున్నదన్నారు. కమిటీ సమావేశాల అనంతరం ఓ వార్తా సంస్థతో డేవిడ్‌ మాట్లాడారు. ఉగ్రవాదం వల్ల సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రపంచం మొత్తానికి ఉగ్రవాద సమస్య ఉండకూడదనే లక్ష్యంతో అంతర్జాతీయ పరిష్కారాలపై దృష్టి పెట్టినందుకు భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇది చాలా అద్భుత విషయమని తెలిపారు. ఈ సమస్యలను ఏ విధంగా ఎదుర్కొనబోతున్నదీ తెలిపే ప్రకటనను ఈ సమావేశాల అనంతరం విడుదల చేస్తామన్నారు. ఉగ్రవాదులు నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను ఉపయోగించుకుంటుండటంపై అత్యున్నత స్థాయిలో చర్చించడం గొప్ప విజయమని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img