Friday, April 26, 2024
Friday, April 26, 2024

స్పాట్‌ అడ్మిషన్లు అయితే… ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ హుష్‌కాకి?

. ప్రైవేటు కళాశాలల దందా
. 50 వేల ఇంజినీరింగ్‌ సీట్ల మిగులు
. అడుగడుగునా కౌన్సెలింగ్‌ జాప్యం
. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ యాజమాన్యం నిర్వహించే స్పాట్‌ అడ్మిషన్లలో చేరిన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ దూరం కానుంది. కన్వీనర్‌ కోటాలో మిగిలిన సీట్లను సైతం యాజమాన్య కోటాలో కలుపుకుని భారీ మొత్తంలో ఫీజుల దందాకు ప్రైవేట్‌ కళాశాలలు పాల్పడుతున్నాయి. ప్రస్తుతం యాజమాన్య కోటా(కేటగిరిబి)లో కంప్యూటర్‌, దాని అనుబంధ సీటు ఏడాదికి రూ.2 లక్షల వరకు నిర్ణయించారు. ఇదే ధరతో కన్వీనర్‌ కోటా (కేటగిరి`ఎ) సీట్లనూ స్పాట్‌ అడ్మిషన్ల పేరిట యాజమాన్యం విక్రయానికి ద్వారాలు తెరచింది. స్పాట్‌ అడ్మిషన్లో చేరితే…విద్యార్థికి ఎలాంటి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఉండబోదని ప్రభుత్వం సంకేతాలిచ్చినట్లు తెలిసింది. దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కేవలం కన్వీనర్‌ కోటాలో కౌన్సెలింగ్‌ సీటు పొంది, ఆన్‌లైన్‌లో రిపోర్టు చేసిన అర్హులైన వారందరికీ ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వస్తుంది. స్పాట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం, ఉన్నతాధికారులు మౌనం దాల్చడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలంటూ ప్రభుత్వానికి విద్యార్థులు విన్నవిస్తున్నారు.
స్పాట్‌ ముసుగులో భారీ దోపిడీ
మూడో విడత కౌన్సెలింగ్‌ ఉండదనే ప్రచారంతో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యాలు స్పాట్‌ అడ్మిషన్లకు ద్వారాలు తెరిచాయి. ఇష్టానుసారం సీట్ల విక్రయానికి సిద్ధమయ్యాయి. గుంటూరుకు చెందిన ఓ ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం స్పాట్‌ అడ్మిషన్లకు ప్రకటన జారీజేసింది. ఇక మిగిలిన ఇంజినీరింగ్‌ కళాశాలలూ అదేబాట పట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల ఇంజినీరింగ్‌ సీట్ల మిగులుకు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యమే కారణమా? ప్రణాళికాబద్ధంగా సీట్ల భర్తీకి చర్యలు తీసుకోకపోవడమేనా?, అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏపీ ఈఏపీసెట్‌`2022 తుది విడత కౌన్సెలింగ్‌ అనంతరం కన్వీనర్‌ కోటాలో 20 వేలకుపైగా ఇంజినీరింగ్‌ సీట్లు మిగిలిపోయాయి. యాజమాన్య కోటా(బి.కేటగిరి)లో మరో 30వేల సీట్లు మిగిలాయి. ఆ మొత్తం కలిపి 50 వేలకుపైగా సీట్లు భర్తీకి నోచుకోలేదు. సీట్లు ఉన్నప్పటికీ..చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. మూడో విడత కౌన్సెలింగ్‌ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈనెల 28వ తేదీన ఏపీఈఏపీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ సీట్లను ఖరారు చేశారు. తుది విడత కౌన్సెలింగ్‌లో 1,959 మంది పాల్గొని, మొత్తంగా 55,227 ఆప్షన్లు నమోదు చేశారు. వారిలో 11,408 మందికి సీట్లు కేటాయించారు. తుది విడత కౌన్సెలింగ్‌ అనంతరం 20 వేలకుపైగా సీట్లు మిగిలిపోయాయి. ఇప్పటివరకు రెండు విడతల్లో మొత్తం 92,661 మందికి సీట్లు కేటాయించారు. ప్రైవేట్‌ కళాశాలల్లో భారీగా సీట్లు మిగిలిపోవడంతో, వాటి భర్తీ కోసం యాజమాన్యం అడ్డదారులు తొక్కుతోంది. స్పాట్‌ అడ్మిషన్ల పేరుతో ప్రకటనలు జారీజేస్తూ, విద్యార్థుల నుంచి భారీగా ఫీజు వసూళ్లకు సిద్ధమయ్యాయి. 249 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో మొత్తం 1,12,096 సీట్లు ఉన్నాయి.
సీట్ల మిగులుకు కారణాలివీ…
ఏపీఈఏపీసెట్‌ ప్రవేశ పరీక్షను నిర్ణీత సమయంలో నిర్వహించకపోవడం, ఆ తర్వాత కౌన్సెలింగ్‌ను సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం వెరసి 50 వేల సీట్ల మిగులుకు కారణంగా భావిస్తున్నారు. దానికితోడు ప్రైవేట్‌/డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించి, విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం…కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీపై ఆ ప్రభావం పడిరదని విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల ప్రైవేట్‌/డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో రాష్ట్రానికి చెందిన దాదాపు 40వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఆ ప్రభావం కూడా కౌన్సెలింగ్‌పై పడిరది. ఏపీఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తయ్యేంత వరకు రాష్ట్రంలోని ప్రైవేట్‌, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించకుండా నియంత్రించడంలో ఉన్నత విద్యాశాఖ పూర్తిగా విఫలమైందనే విమర్శలున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మౌలిక సౌకర్యాలు, బోధనా సిబ్బంది లేకపోవడం, ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడంతో చాలామంది ప్రైవేట్‌/డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాల్ని ప్రభుత్వం గమనించి, వచ్చే ఏడాది నుంచి ఏపీఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి, అన్ని సీట్ల భర్తీకి ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అటు యాజమాన్య కోటా(బి.కేటగిరి)లో మిగిలిన సీట్లను ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.
మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలి: పేరెంట్స్‌ అసోసియేషన్‌
ఏపీఈఏపీసెట్‌ మూడో విడత కౌన్సెలింగ్‌ను తక్షణమే నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ పేరెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శిఖరం నరహరి కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు శనివారం ఆయన వినతిపత్రాన్ని పంపారు. ఏపీఈఏపీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ పూర్తయిన అనంతరం మిగిలిన ఇంజినీరింగ్‌ అడ్మిషన్లు భర్తీ చేసేందుకుగాను వెంటనే మూడో విడత నిర్వహించాలన్నారు. కన్వీనర్‌ కోటాలో మిగిలిన 20 వేల సీట్లను పకడ్బందీగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్య కోటాలో మిగిలిన 30 వేల సీట్లనూ ప్రభుత్వ నిబంధనల ఆధారంగా భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img