Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

హంద్రీనీవాకు రూ.2 వేల కోట్లు

. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలి
. హంద్రీనీవా, హెచ్‌ఎల్‌సీ కాలువలు పరిశీలించిన సీపీఐ బృందం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో`అనంతపురం/పత్తికొండ: రాయలసీమ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మంగళవారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో హంద్రీనీవా ప్రాజెక్టును రామకృష్ణతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, జగదీశ్‌, అనంతపురం, కర్నూలు జిల్లాల కార్యదర్సులు సి.జాఫర్‌, గిడ్డయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా వందల టీఎంసీల వరద నీరు సముద్రంలోకి వెళ్లిందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను చూస్తే కన్నీరు వస్తుందని ఆవేదన చెందారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు హంద్రీనీవా కాలువ పనులకు ఉరవకొండలో శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కర్నూలు జిల్లా మల్యాల వద్ద 12 పంపుల ఏర్పాటు చేశారని, కానీ ఆరు పంపుల ద్వారా మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ను హంద్రీనీవాకు తరలిస్తున్నారని తెలిపారు. మిగిలిన ఆరు పంపులను ఖాళీ పెట్టడం సిగ్గు చేటన్నారు. 6.4 లక్షల ఎకరాల సాగు భూమికి, 30 లక్షల జనాభాకు తాగునీరు అందించే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పథకాన్ని 30 ఏళ్లగా సాగుదీస్తుండటం విచారకరమని వ్యాఖ్యానించారు. రాయలసీమకు చెందిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌… తాను ప్రవేశపెట్టే బడ్జెట్‌లో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి డిస్ట్రిబ్యూటరీలు, కాలువలు, పిల్ల కాలువలు ఏర్పాటు చేసుకుని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హెచ్‌ఎల్‌సీ ఆధునికీకరణకు నిధులు కేటాయించి తుంగభద్ర డ్యామ్‌ నుండి 32 టీఎంసీలు నీటిని తీసుకువచ్చి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఎల్‌సీ నుండి గుంతకల్లు, ఆలూరు సబ్‌ కెనాళ్లకు నీరు అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. డి.జగదీశ్‌, పి.రామచంద్రయ్య మాట్లాడుతూ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో హంద్రీనీవా పథకం ద్వారా వేల ఎకరాలు సాగు భూమిగా మారుతుందని గుర్తు చేశారు. పత్తికొండ సమీపంలో పందికోన నుండి కాల్వపనులు ప్రారంభించినప్పటికీ ఎక్కడి పనులు అక్కడే అసంపూర్తిగా ఉన్నాయని, రూ.250 కోట్లు కేటాయించి పందికోన రిజర్వాయర్‌ను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. గుంతకల్లు, గుత్తి బ్రాంచ్‌ కెనాల్‌కు నీరు అందించేలా చొరవ తీసుకోవాలన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు చేపడితే అనంతపురం, కర్నూలు జిల్లాల రైతాంగానికి, చిత్తూరు జిల్లా రైతాంగానికి చివరి ఆయకట్టుకు నీరు అందించే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ చొరవ తీసుకొని రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు. సీపీఐ గుంతకల్లు నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రయ్య స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు. ఉరవకొండ ప్రాంతంలో ఉన్న హంద్రీనీవా సాగునీటి కాలువను పరిశీలించిన అనంతరం రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ఇంజినీర్‌ శివరామకృష్ణయ్య డిజైన్‌ చేసిన హంద్రీనీవా కాలువ నిర్మాణానికి ఎన్టీ రామారావు ప్రణాళికలు సిద్ధం చేశారని, 1995లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉరవకొండలో శంకుస్థాపన చేశారన్నారు. పనులు ప్రారంభమై మూడు దశాబ్దాలు అయినా కాలువ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం మినహా పనులు మాత్రం పూర్తి కావడం లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం పడకేసిందని ఆరోపించారు. జగదీశ్‌ మాట్లాడుతూ హెచ్‌ఎల్‌సీ, హంద్రీనీవా కాలువల ఆధునీకరణకు రూ. 500 కోట్ల నిధులు కేటాయించి నిర్ణీత గడువు విధించి పనులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.
హంద్రీనీవా…వెలుగొండకు మొదటి ప్రాధాన్యత
అత్యంత కరువు పీడిత ప్రాంతం రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందిచే హంద్రీనీవా, ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, హంద్రీనీవాకు 2 వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పెండిరగ్‌ పనులు పూర్తిచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఐ బృందం మంగళవారం పందికోన రిజర్వాయర్‌ను పరిశీలించింది. జొన్నగిరి చెరువును బృందం పరిశీలించింది. పంది కోన రిజర్వాయర్‌ పరిశీలించి... అక్కడ హంద్రీనీవా ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడిరది. అనంతరం రామకృష్ణ పాత్రికేయులతో మాట్లాడుతూ హంద్రీనీవా ప్రాజెక్టు వల్ల ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందిస్తుందన్నారు. కృష్ణా, తుంగభద్రకు చెందిన వందలాది టీఎంసీల నీరు సముద్రంలో కలసి పోతున్నా... వాటిని ఉపయోగించి కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే అవకాశం ఉన్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా తాగునీరు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ... వలస పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టు, హంద్రీనీవా ప్రాజెక్టుకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం వరకు నీటిని తీసుకుపో తానని చెబుతున్నారని, ఇలాఉంటే అదెలా సాధ్యమని రామకృష్ణ ప్రశ్నించారు. హంద్రీనీవాకు సంబంధించి కర్నూలు జిల్లాలో పెండిరగ్‌ పనులు పూర్తిచేయా లంటే రూ.245 కోట్లు అవసరమని నివేదిక ఇచ్చారని, ఆ నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. హంద్రీనీవా పరివాహక ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి ముఖ్యమంత్రికి, జలవనరుల శాఖ మంత్రికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ బృందం వెంట సీపీఐ నాయకులు గురుదాస్‌, నాగిరెడ్డి, కారన్న, తిమ్మయ్య, పెద ఈరన్న, కారుమంచి, గిడ్డయ్యగౌడ్‌, నెట్టె కంటెయ్య, కాశీ, ముని తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img