Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అక్కడ డోలీయే అంబులెన్స్‌!

గర్భిణిని 24కి.మీ. మోసి ఆస్పత్రికి తరలించిన మహిళలు

విశాలాంధ్ర-పాడేరు(అల్లూరిజిల్లా): మన్యం ప్రజలకు కనీస ఆరోగ్య సేవలు కూడా కరువయ్యాయి. ప్రాణంమీదకొస్తే వైద్యం చేసే దిక్కులేకుండా పోయింది. అంబులెన్స్‌ సంగతి దేవుడెరుగు… కనీసం రోడ్డు కూడా లేకపోవడంతో నెలలు నిండిన గర్భిణులను డోలీ కట్టి కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. అధికారులు ప్రకటనలకు, వాస్తవ పరిస్థితికి పొంతనే లేదు. తాజాగా
అల్లూరి సీతారామరాజు జిల్లా కాంగెడ్డలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. పాడేరు మండలంల మోదాపల్లి పంచాయతీ కాంగెడ్డ గ్రామానికి చెందిన పాంగి జ్యోతి అనే గర్భిణికి పురిటి నొప్పులొచ్చాయి… అసలే మొదటి కాన్పు… వెంటనే ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి. రహదారి సదుపాయం లేకపోవడం, గ్రామంలో మగవారు కూడా అందుబాటులో లేనందున మహిళలే డోలీలో ఆమెను మూడు కిలోమీటర్ల దూరంలోని మినుములూరు పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. కానీ కాంగెడ్డ ఈదులపాలెం పీహెచ్‌సీ పరిధిలోకి వస్తుందని, ఇక్కడ సరైన సౌకర్యాలు లేవని, అక్కడే ప్రసవం చేయాలని ఆరోగ్య సిబ్బంది చెప్పడం గమనార్హం. దీంతె చేసేది లేక కాంగెడ్డ మహిళలు నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని అక్కడ నుంచి డోలీలోనే 24 కిలోమీటర్ల దూరంలోని, ఈదులపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆసుపత్రిలో సుఖ ప్రసవం జరిగి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. మార్గమధ్యంలో జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు? ప్రసవానికి ముందుగానే సమీపంలోని ఆసుపత్రులకు తరలించాలన్న వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బంది ఇచ్చే ఆదేశాలు ఆచరణలోకి రావడంలేదు. గిరిజన గ్రామంల్లో రహదారి సౌకర్యాలు కల్పించి మహిళల ప్రాణాలు కాపాడాలని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img