Friday, April 26, 2024
Friday, April 26, 2024

అమర్‌నాథ్‌ యాత్ర నిలిపివేత

84 మంది ఏపీ యాత్రికులు సురక్షితం

ప్రతికూల వాతావరణంతో కొత్త బ్యాచ్‌కి అనుమతి నిరాకరణ

అమరావతి: అమర్‌నాథ్‌ యాత్రకు ఆంధ్ర ప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి వెళ్లిన దాదాపు 84 మంది సురక్షితంగా ఉన్నారని, అయితే ఆదివారం మధ్యాహ్నం వరకు ఇద్దరు మహిళల ఆచూకీ మాత్రమే తెలియరాలేదని అధికార వర్గాలు ఇక్కడ తెలిపాయి. తొలుత, ఐదుగురు యాత్రికులు గల్లంతయ్యారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కానీ తర్వాత ముగ్గురి ఆచూకీ లభించిందని, వారు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చాలా మంది యాత్రికులతో, వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారు. అమర్‌నాథ్‌ గుహ సమీపంలో భారీ వర్షం, ఆకస్మిక వరదల తర్వాత యాత్రికులు సురక్షితంగా ఉన్నారని ధ్రువీకరించారు. ప్రభుత్వ వర్గాలు అందించిన వివరాల ప్రకారం, రాజమహేంద్రవరం నుంచి అమర్‌నాథ్‌కు 20 మంది యాత్రికుల బృందం వెళ్లింది. కానీ వారిలో ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. ‘వారి భర్తలు శ్రీనగర్‌కు తిరిగి వచ్చారు. కానీ మహిళలు ఇంకా కనిపించలేదు. వారు గాయపడి ఉండవచ్చు లేదా వేరే ప్రదేశానికి చేరుకుని ఉండవచ్చు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాం’ అని సహాయ చర్యల్లో పాల్గొన్న ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. స్థానిక రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఆదివారం రాజమహేంద్రవరంలో ఇద్దరు మహిళల బంధువులను పరామర్శించి పరిస్థితిని చర్చించారు. గుంటూరు నుంచి 38 మంది యాత్రికుల బృందం, తాడేపల్లిగూడెం నుంచి 17 మంది బృందం, తిరుపతి నుంచి ఆరుగురి సభ్యుల బృందం, విజయనగరం నుంచి మరొకరు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. కడప జిల్లాలో రాజంపేట నుంచి కొంతమంది యాత్రికులు కూడా సురక్షితంగాఉన్నారని, కానీ వారు ఎంతమంది అనేది స్పష్టం కాలేదని ప్రభుత్వం తెలిపింది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడానికి, ఏపీ యాత్రికుల భద్రతను నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాన్షు కౌశిక్‌ను శ్రీనగర్‌కు పంపినట్లు ఇక్కడ ఒక అధికార ప్రకటన పేర్కొంది. రాష్ట్రానికి చెందిన యాత్రికులకు అవసరమైన సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1902 కూడా ప్రారంభించింది. యాత్రికులు, వారి బంధువులకు ఏదైనా సహాయం కోసం న్యూదిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్‌లను కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img