Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సడలని నిరసన

శ్రీలంకలో అధ్యక్ష, ప్రధాని భవనాలను వీడని ఆందోళనకారులు
13న అధ్యక్షుడు గొటబాయ రాజీనామా చేస్తారని ప్రకటన
శాంతికి ప్రజలు మద్దతు ఇవ్వాలన్న సైనిక ప్రధానాధికారి
అండగా నిలుస్తాం: భారత్‌

కొలంబో: శ్రీలంకలో ప్రజా నిరసన కొనసాగుతోంది. ఆందోళనకారులు ఆదివారం కూడా అధ్యక్ష భవనాన్ని వీడలేదు. వేలాది మంది ఇంకా వీధుల్లో తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రజలు మద్దతు ఇవ్వాలని సైనిక ప్రధానాధికారి అభ్యర్థించారు. మరోవైపు, దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స 13వ తేదీన రాజీనామా చేస్తారని పార్లమెంట్‌ స్పీకర్‌ ప్రకటించారు. ఇదిలాఉండగా, అధ్యక్షుడు, ప్రధానమంత్రి తమ అధికారిక నివాసాలను వదిలి పారిపోయేలా చేసిన ప్రభుత్వ వ్యతిరేక నిరసన ఉద్యమ నాయకులు మాట్లాడుతూ ఇద్దరూ రాజీనామా చేసే వరకు తాము భవనాలను ఆక్రమిస్తామని ఆదివారం చెప్పారు. ‘అధ్యక్షుడు, ప్రధాన మంత్రి రాజీనామా చేయాలి. ప్రభుత్వం దిగిపోవాలి’ అని నాటక రచయిత రువంతీ డి చికెరాని ఉటంకిస్తూ రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఇదిలావుండగా, అధ్యక్షుడు, ప్రధాన మంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి శ్రీలంక ప్రతిపక్ష పార్టీలు ఆదివారం సమావేశం అయ్యాయి. పార్లమెంటరీ స్పీకర్‌ పేర్కొన్న వివరాల ప్రకారం, శనివారం రాజధానిని కదిలించిన హింసాత్మక నిరసనల నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స జులై 13న పదవీ విరమణ చేయనున్నారు. ప్రదర్శనకారులు కొలంబోలోని ప్రధానమంత్రి ఇంటికి నిప్పుపెట్టి అధ్యక్షుడి అధికారిక నివాసంపైకి దూసుకెళ్లారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని రణిల్‌ విక్రమ సింఘే కూడా రాజీనామాకు సిద్ధమని ఆయన కార్యాలయం శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం తన పదవి నుంచి వైదొలగనున్నట్లు రాజపక్స తనకు తెలియజేసినట్లు స్పీకర్‌ మహింద యాపా అబేవర్థన ఒక వీడియో ప్రకటనలో తెలిపారు. శాంతియుతంగా అధికారాన్ని అప్పగించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని, అందువల్ల చట్టాన్ని గౌరవించాలని, శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలను కోరుతున్నానని అన్నారు. 22 మిలియన్ల జనాభా ఉన్న ఈ ద్వీప దేశంలో భయంకరమైన ఆర్థిక సంక్షోభం కారణంగా నెలరోజులపాటు శాంతియుతంగా జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల ఉధృతి తర్వాత ఈ ప్రకటన వెలువడిరది. స్పీకర్‌ 30 రోజుల పాటు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఆ సమయంలో పార్లమెంటు కొత్త నాయకుడిని ఎన్నుకుంటుంది.
ప్రతిపక్షాల సమావేశం
నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రతిపక్ష పార్టీలు ఆదివారం సమావేశమయ్యాయి. పార్లమెంటులో ఆధిక్యతను నిరూపించుకునేందుకు అవసరమైన 113 మంది ఎంపీల బలం ప్రతిపక్షాలకు ఉందని ప్రతిపక్ష ఎంపీ ఎంఏ సుమంతిరన్‌ చెప్పారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు ఆగాలని, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మాత్రమే దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని గొటబాయ రాజపక్సను ప్రతిపక్ష సభ్యులు కోరతారని తెలిపారు.
కబోర్డ్‌ వెనుక హై సెక్యూరిటీ బంకర్‌
గొటబాయ భవనాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారులు భవనంలోని హై సెక్యూరిటీ బంకర్‌ను చూసి ఆశ్చర్యపోయారు. విలాసవంతమైన ఆయన నివాసంలో ఆందోళనకారులు కబోర్డులా ఉన్న ఒక తలుపు తెరిచి చూస్తే వెనక ఉన్న దారిలో విలాసవంతమైన హై సెక్యూరిటీ బంకర్‌ కనిపించింది. కొందరు ప్యాలెస్‌ ఆసాంతం క్షుణ్ణంగా పరిశీలించగా, మరికొందరు మంచాలపై కనిపించారు. ఇంకొందరు ప్యాలెస్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో దూకి ఈత కొట్టారు. మరికొందరు ఆయన గదిలో విశ్రాంతి తీసుకుంటూ కెమెరాలకు చిక్కారు. అలాగే అధ్యక్ష భవనంలోని ఖరీదైన కార్ల వద్దకు వెళ్లి అనేక మంది సెల్ఫీలు తీసుకున్నారు. తాజాగా ప్రధాని అధికారిక నివాసం (టెంపుల్‌ ట్రీ) లో కొందరు ఆందోళనకారులు హంగామా చేస్తూ కనిపించారు. ప్రధాని పడక గదిలోకి వెళ్లి అక్కడి మంచంపై ఫైట్‌ చేస్తూ కనిపించారు. కొందరు గార్డెన్‌లో తమ పిల్లలను కూర్చోబెట్టుకుని ఆహారం తినిపిస్తున్నారు.
ప్రధాని ఇంటికి నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
శనివారం జరిగిన హింసాకాండలో విక్రమ సింఘే వ్యక్తిగత నివాసానికి నిప్పంటించినందుకు శ్రీలంక పోలీసులు ఆదివారం ముగ్గురిని అరెస్టు చేశారు. నిరసనకారులు కేంబ్రిడ్జ్‌ ప్లేస్‌లోని విక్రమ సింఘే ప్రైవేట్‌ నివాసంలోకి ప్రవేశించి దానికి నిప్పంటించారు. ఆస్తికి భారీ నష్టం కలిగించారు. అరెస్టయిన వారిలో 19 ఏళ్ల మౌంట్‌ లావినియా నివాసి, 24, 28 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు గాలే నివాసితులు ఉన్నారని పోలీసు ప్రతినిధి తెలిపారు. మరిన్ని అరెస్టులు కొనసాగుతున్నాయని చెప్పారు.
శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆ దేశం స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి ఇంతటి సంక్షోభాన్ని చూడలేదు. చమురు సహా ఇతర అత్యవసర సరుకులనూ దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం దగ్గర విదేశీ మారకం లేదు. దీంతో ప్రజలు దిన దిన గండంగా బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img