Friday, April 26, 2024
Friday, April 26, 2024

లక్ష్యం ఎన్నికలే!

రెండేళ్ల ముందుగానే వైసీపీ ఆరాటం
ప్రజా సమస్యలు పట్టని వైనం
ప్రత్యేక హోదా, విభజన హామీలు గాలికి
మోదీ`జగన్‌ రహస్య ఒప్పందం!
బీజేపీతో జనసేన తెగదెంపులు?
టీడీపీ బలోపేతమే లక్ష్యంగా బాబు పర్యటనలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల సందడి ఆరంభమైంది. రెండేళ్ల ముందు నుంచి ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సమయాత్తం కావడం ఆనవాయితీ. ఈ విడత అధికార పక్షం సైతం..ప్రజా సమస్యల్ని, రాష్ట్రాభివృద్ధిని విస్మరించి, 2024లో జరగనున్న ఎన్నికల (పార్లమెంట్‌, శాసనభ)కు సై అంటోంది. వైసీపీ... మూడో విడత ప్లీనరీని ఈనెల 8, 9 తేదీల్లో విజయవాడ గుంటూరు జాతీయ రహదారి పక్కన(ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట) నిర్వహించి, ఎన్నికల సమరశంఖారావం పూరించింది. అంతకుముందు నియోజకవర్గాలు/ జిల్లా కేంద్రాల్లో వైసీపీ ప్లీనరీలు పూర్తి చేసుకుంది. రెండు రోజులపాటు జరిగిన వైసీపీ ప్లీనరీ చర్చల్లో రాష్ట్రాభివృద్ధితోపాటు, ప్రజా సమస్యలపై ప్రధాన దృష్టి పెట్టే తీర్మానాలు వస్తాయని ప్రజలు ఆశించగా, జగన్‌ను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా చేసే తీర్మానం ఆమోదించడానికే సరిపెట్టారు. ఇదే వేదికపై నుంచి 175/175 సీట్లు తెచ్చుకోవాలన్న జగన్‌ సందేశం… ఇక వైసీపీ సైతం ఎన్నికల సమరానికి సిద్ధమైనట్లు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లయింది. టీడీపీ… పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. టీడీపీ ఇటీవల ఒంగోలులో మహానాడు నిర్వహించి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అప్పటి నుంచి మినీ మహానాడు పేరిట చంద్రబాబు వివిధ జిల్లాలు/నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, జనవానిజనసేన భరోసా కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు.బీజేపీ తన ఉనికిని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతోంది. విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశాన్ని నిర్వహించి, భవిష్యత్తులో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతవ్వడంతో మరోసారి కోలుకోలేని దెబ్బతగిలింది. ఇప్పటివరకు బీజేపీజనసేన మధ్య పొత్తు ఉన్నట్లు భావిస్తుండగా, జనసేన మాత్రం టీడీపీకి నెమ్మదిగా దగ్గరవుతోంది. భీమవరంలో అల్లూరి జయంతి సభకు మోదీ రాగా, పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానం అందించినా, ఆయన హాజరు కాకపోవడం చర్చానీయాంశంగా మారింది. అల్లూరి జయంతి సభకు సీఎం జగన్‌తోపాటు వైసీపీ మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు వెళ్లారు. తెలంగాణ పర్యటనలో మోదీ…కేసీఆర్‌పై ధ్వజమెత్తగా, భీమవరం వేదికగా జగన్‌ను మోదీ పన్నెత్తి మాటనలేదు. ఇక విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశంపై మోదీ ప్రస్తావనే లేదు. దీనిపై సీఎం జగన్‌, ఎంపీలు సైతం మోదీని డిమాండ్‌ చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
హోదా కోసం ఒత్తిడేదీ ?
ఎలాంటి షరతు లేకుండా రాజ్యసభ అభ్యర్థికి జగన్‌ మద్దతివ్వడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇదే అదునుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన ప్రయోజనాలు చేకూర్చాల్సి ఉంది. అలాంటివేమీ జగన్‌ చేయకుండా, గన్నవరం విమానాశ్రయంలో మోదీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఒక వినతిపత్రం ఇచ్చి మౌనంగా ఉండిపోయారు. హోదా, విభజన హామీల సాధన కోసం ఇప్పుడు మోదీపై జగన్‌ గట్టిగా ఒత్తిడి చేస్తే, కేంద్రం తలొగ్గే అవకాశముంది. జగన్‌ తన సొంత అజెండాతోనే కేసులకు భయపడి, మోదీకి వత్తాసు పలుకుతున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి మోదీజగన్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. మోదీజగన్‌ వ్యవహారం పెళ్లి చేసుకోకుండానే సహజీవనం సాగిస్తున్నట్లుందని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. దీంతో 2024 ఎన్నికల వరకు మోదీ`జగన్‌ ఇలాగే స్నేహం కొనసాగిస్తూ, ఆ తర్వాత వైసీపీ అధికారం లోకి వస్తే, ప్రత్యేక హోదా పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతిస్తుందనే ప్రచారముంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలోనూ చేరే అవకాశముందంటూ ఓ వైసీపీ ఎంపీ లీక్‌ చేయడం వివాదస్పదంగా మారింది. బీజేపీతో నేరుగా వైసీపీ పొత్తు పెట్టుకుంటే, వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్న ఎస్సీ,ఎస్టీ, క్రైస్తవ, ముస్లిం సోదరుల ఓటు బ్యాంక్‌ చీలిపోతుందన్న భయం ఆ పార్టీలో నెలకొంది. వ్యూహాత్మకంగా రాబోయే ఎన్నికల తర్వాత, హోదా పేరుతో కేంద్రంలోని బీజేపీ

ప్రభుత్వం ఏర్పాటుకు వైసీపీ బహిరంగంగా మద్దతిచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు.
అభివృద్ధిపై జగన్‌ మౌనం
రాష్ట్రాభివృద్ధిపైన అధికార సీఎం జగన్‌ దృష్టి పెట్టకుండా 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్లడంపై తీవ్ర విమర్శలున్నాయి. వైసీపీ వచ్చే ఎన్నికల్లో 175/175 సీట్ల లక్ష్యంతో ఆ పార్టీ నిమగ్నమైంది. రాష్ట్రాభివృద్ధిపైన దృష్టి పెట్టకుండా, సంక్షేమ పథకాలతోనే సరిపెడుతోంది. మితిమీరిన అప్పులు తెస్తూ, సీఎం జగన్‌ బటన్‌ నొక్కి, ప్రజల ఖాతాల్లోకి వేయడం వెనుక రాజకీయ లబ్ధి కోసమేననే విమర్శలున్నాయి. వాటిని జగన్‌ ఖాతరు చేయకుండా, యథాతథంగా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తన పర్యటనల్లో నిమగ్నమయ్యారు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 23 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు మాత్రమే దక్కాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తర్వాత జరిగిన మున్సిపల్‌, మండల, జిల్లా పరిషత్‌, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. వైసీపీకే అధిక స్థానాలు లభించాయి. దీంతో సంస్థాగతంగా టీడీపీ బలహీన పడిరది. ఒక వైపు పార్టీ బలోపేతం, మరోవైపు 2024 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ సాంప్రదాయ ఓటింగ్‌ చాలా వరకు చేజారిపోయింది. రాబోయే ఎన్నికల బరిలో టీడీపీ ఒక్కటే పోటీకి దిగితే, మళ్లీ ప్రతిపక్షంలో ఉండిపోతుందనే సంకేతాలు ఆ పార్టీ నేతలకు వచ్చాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఎన్నికల సమయానికి టీడీపీ,జనసేన పొత్తులు దాదాపు ఖరారయ్యే పరిస్థితులున్నాయి. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల రీత్యా అవసరమైతే బీజేపీకి పవన్‌ దూరమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే టీడీపీ`జనసేన కలిసి పోటీ అనేది నిజమవుతుంది. అప్పుడు బీజేపీ, వైసీపీలు ఒంటరిగా బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇప్పటికైనా అధికార వైసీపీ ఎన్నికల హడావుడి చేయకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img