Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆస్తి పన్ను పెంపునకు నిరసన – దద్దరిల్లిన జీవీఎంసీ కార్యాలయం

కౌన్సిల్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం
పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట
వందమంది అరెస్టు

విశాఖపట్నం : ఇంటి పన్నుల పెంపు ప్రతిపాదనను విరమించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖలో వామపక్షాల అధ్వర్యాన శనివారం భారీ నిరసన జరిగింది. నగర ప్రజల నడ్డిని విరిచే ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనలను వెంటనే నిలుపుదల చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు.. పన్ను పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు ఆందోళన చేపట్టడంతో జీవీపంసీ కార్యాలయం ధర్నాలతో దద్దరిల్లిపో యింది. కౌన్సిల్‌ సమావేశంలోకి వెళ్లేందుకు నేతలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. కేవలం గుర్తింపు కార్డులు కలిగిన కార్పొరేటర్లను మాత్రమే జీవీపంసీ సమావేశ మందిరానికి అనుమతించారు. సుమారు గంటన్నర పాటు శాంతియుతంగా ఆందోళన చేపట్టిన నిరసనకారులు ఒక్కసారిగా జీవీపంసీ ప్రధాన గేటు ఎక్కి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, నిరసనకారుల నడుమ తోపులాట జరిగింది. పోలీసులు బలవంతంగా వారిని అరెస్ట్‌ చేసి మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు, సీపీఎం కార్యవర్గ సభ్యులు కుమార్‌, నాయకులు ఎస్‌కె రెహమాన్‌, జగన్‌, పి.చంద్రశేఖర్‌, వై.రాంబాబు, వి.సత్యనారాయణ, వి.జ్యోతి అమర్‌, టీవీ రావు తదితరులతోపాటు సీపీఐ, సీపీఎం, టీడీపీ నాయకులు సుమారు 100 మందిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆస్తి మూల విలువపై పన్ను పెంపును తక్షణమే రద్దు చేయాలని, చెత్త సేకరణపై నెలకు 120, మురుగునీరుపై 50 రూపాయలు పన్నులు వేయడం సరికాదని వెంటనే ఈ నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని నినదించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, పీలా గోవింద్‌, జనసేన నాయకులు కోన తాతారావు, సుందరపు విజయ్‌కుమార్‌, పసుపులేటి ఉషాకిరణ్‌, సీపీఎం నాయకులు జగ్గునాయుడు, కుమార్‌, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img