Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇది ప్రాథమిక హక్కులకు విఘాతం

జీవో నంబర్‌ 1ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు
ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్‌ చేసిన సీపీఐ నేత రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ తరచూ హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆందోళనలను అణచివేసే ఉద్దేశంతో వారు నిర్వహించే రోడ్‌ షోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1ను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడుతూ జీవో కొట్టేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఈ ఏడాది జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 1ను తీసుకొచ్చింది. దానిని సవాల్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్‌ వేశారు. ఇదే జీవోను సవాలు చేస్తూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రతిపక్షాలు రోడ్డుపై నిర్వహించే కార్యక్రమాలను జీవో నంబర్‌ 1 పేరుతో అడ్డుకునే ప్రమాదం ఉందని, అందువల్ల దాన్ని రద్దు చేయాలని కోరారు. ఆ వ్యాజ్యాలపై జనవరి 24న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం లోతైన విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. తాజాగా దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. రామకృష్ణ తరపున న్యాయవాది అశ్వినీకుమార్‌ వాదనలు వినిపించారు. రోడ్‌ షోలను కట్టడి చేసేలా జీవో ఉందని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో తెచ్చారని, పోలీస్‌ యాక్ట్‌ 30కు భిన్నంగా జీవో నంబర్‌ 1 జారీ చేశారని న్యాయవాది వాదనలు వినిపించారు. రెండు వైపులా వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఈ మేరకు జీవో నంబరు 1ని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు : సీపీఐ నేత రామకృష్ణ
జీవో నంబరు 1ని కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విపక్షాలన్నీ విమర్శించినా, జీవోను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రజలంతా ఉద్యమాలు నిర్వహించినా ప్రభుత్వం పట్టించుకోలేదని, చివరకు ఇప్పుడు హైకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి ప్రతిపక్షాలను, ప్రజాసంఘాలను గౌరవించాలని, ప్రజా ఉద్యమాలపై పోలీసులను ప్రయోగించి, ఉక్కుపాదం మోపటం మానాలని హితవు చెప్పారు.

అంతిమంగా గెలిచేది అంబేద్కర్‌ రాజ్యాంగమే : చంద్రబాబు
దేశంలో అంతిమంగా గెలిచేది… నిలిచేది అత్యున్నతమైన అంబేద్కర్‌ రాజ్యాంగమే. జగన్‌ లాంటి నాయకులు వస్తారని నాడే ఊహించి… భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారు. ప్రజాస్వామ్యం మహోన్నతమైనది. అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు దాని ముందు నిలబడవని మరోసారి స్పష్టమైంది. ప్రజలను, ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై గొంతెత్తకుండా చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్‌ 1 ను హైకోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img