Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎన్నికలంటే జగన్‌కు భయం

. మేమెవరితో కలిస్తే మీకెందుకు?
. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా స్పందించని సీఎం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ

విశాలాంధ్రబ్యూరో`బాపట్ల: ఎన్నికలంటే సీఎం జగన్‌కు భయమని, ముందస్తు ఎన్నికలకు వెళితే ముందుగా ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. బాపట్లలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం రామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నేత పేర్ని నానిలో భయం కనిపిస్తోందని రామకృష్ణ అన్నారు. భయం కారణంగానే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైనా తమను ఏమీ చేయలేవని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. 87 శాతం మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందితే…ఎన్నికలంటే ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు. ‘చంద్రబాబు 175 సీట్లలో, పవన్‌ కల్యాణ్‌ 175 సీట్లలో పోటీ చేయగలరా? సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ ఎర్రజెండా పట్టుకుని తెలుగుదేశంతో ఎందుకు కలుస్తున్నారంటున్నావ్‌. మేము కలిస్తే మీకు భయమెందుకు?’ అని నిలదీశారు. ఓటుకు వేల రూపాయలు పంచినా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి చెందినందుకే వైసీపీకి భయం పట్టుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తారని చెప్పినా ఉత్తరాంధ్ర ప్రజలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఘోరంగా ఓడిరచారని తెలిపారు. కర్నూలుకు హైకోర్టు వస్తుందని ప్రచారం చేసుకున్నా పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందుల వ్యక్తే గెలిచారన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టావో చెప్పాలని సీఎం జగన్‌కు రామకృష్ణ సవాల్‌ విసిరారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ రంగాలకు సంబంధించి ఏమి అభివృద్ధి జరిగిందని నిలదీశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదని విమర్శించారు. మద్యపాన నిషేధం ఏమైందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానన్నావు…ఏమి చేశావు? హోదా సాధించావాÑ విభజన హామీలు సాధించావా? కడప స్టీలు ఫ్యాక్టరీ తెచ్చావా? రామాయపట్నం పోర్టు ఏమైంది? విశాఖ రైల్యే జోన్‌ సంగతేంటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను అడ్డుకోలేకపోతున్న చేతకాని సీఎం జగన్‌ అని మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం నరేంద్రమోదీ కాళ్లు పట్టుకోవటం తప్ప రాష్ట్రానికి ఏమి సాధించామని రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎంగా జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోయినా జగన్‌ మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంపై అప్పులభారం మోపడం తప్ప ఏమి సాధించావని నిలదీశారు. జగన్‌ సీఎం పీఠం దిగేనాటికి రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉండబోతుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మోదీ, జగన్‌ ప్రభుత్వాలను సాగనంపేందుకు లౌకికశక్తులతో కలిసి ఉద్యమాలు చేయనున్నట్లు రామకృష్ణ తెలిపారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీపై మోదీ సర్కారు అనర్హత వేటు వేయడం ద్వారా ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తోందని మండిపడ్డారు. దేశంలో మైనార్టీలు అభద్రతాభావంతో జీవిస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేవన్నారు. అదానీ కుంభకోణంపై జేపీసీకి మోదీ సర్కారు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. మతోన్మాదం, అధిక ధరలు, నిరుద్యోగం, రైతుల అల్పాదాయం వంటి అంశాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి నుంచి ఎర్రజెండా నాయకత్వాన బీజేపీ హటావో…దేశ్‌ బచావో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, జంగాల అజయ్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, రాష్ట్ర సమితి సభ్యులు పి.నాగాంజనేయులు, జిల్లా నాయకులు జేబీ శ్రీధర్‌ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img