Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల సందడి

. ముగిసిన నామినేషన్ల ఘట్టం
. చివరిరోజు పెద్దసంఖ్యలో దాఖలు చేసిన అభ్యర్థులు
. అనంతపురంలో సినీఫక్కీలో టీడీపీ అభ్యర్థి నామినేషన్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి గురువారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల సందడి నెలకొంది. చివరిరోజు అభ్యర్థులు పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తానికి ఈ నెల 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణపర్వం గురువారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 16 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీచర్స్‌ స్థానానికి సంబంధించి ఆరుగురు అభ్యర్థులు, స్థానిక సంస్థల స్థానానికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పట్టభద్రుల స్థానానికి వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, ఆమ్‌ఆద్మీ, బీఎస్పీ నుంచి నామినేషన్లు వేశారు. టీచర్స్‌ స్థానానికి వైసీపీ, పీడీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. స్థానిక సంస్థలకు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ తరపున వంక రవీంద్రనాథ్‌, కావూరు శ్రీనివాస్‌, వంక రజనీకుమారి, టీడీపీ తరపున వీరవల్లి చంద్రశేఖర్‌ నామినేషన్‌లు దాఖలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ తరపున కుడిపూడి సూర్యనారాయణ, కడప జిల్లాలో రామసుబ్బారెడ్డి, శ్రీకాకుళంలో ఎన్‌.రామారావు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ తరపున మేరుగ మురళీధర్‌, స్వతంత్ర అభ్యర్థిగా నాగేంద్రప్రసాద్‌ నామినేషన్లు వేశారు. అనంతపురంలో టీడీపీ తరుపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్‌ వేయకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ విశ్వప్రయత్నాలు చేసింది. అయినా సినీఫక్కీలో వైసీపీ శ్రేణుల కంటపడకుండా కలెక్టరేట్‌ వెనుకదారి నుంచి లోపలికి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ వేయకుండా అడ్డుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, శంకర్‌నారాయణ, ఆ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, మరికొందరు ముఖ్య నేతలు రంగంలోకి దిగినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెద్దసంఖ్యలో వారి అనుచరులను కలెక్టరేట్‌ ఎదుట మోహరించారు. టీడీపీ అభ్యర్థితో పాటు మద్దతుదారులు ఎటువైపు నుంచి వస్తారోనని రోడ్లపై కాపుకాశారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని పోలీసుల్లా తనిఖీ చేశారు. నామినేషన్‌ వేసేందుకు సమయం మరో అరగంట ఉందనగా, టీడీపీ తరుపున యాడికి మాజీ ఎంపీపీ, జేసీ సోదరుల ముఖ్య అనుచరుడు వేలూరు రంగయ్య నాటకీయంగా వచ్చారు.
తలపై ముస్లిం టోపీ ధరించి నామినేషన్‌ పత్రాలను చొక్కాలో దాచుకొని, ఎవరూ గుర్తు పట్టకుండా కలెక్టరేట్‌ వెనుకవైపు ప్రహారీ దూకి లోపలికి చేరుకున్నారు. రంగయ్య మద్దతుదారులుగా తాడిపత్రి మున్సిపాల్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ద్వారా లోపలికి వెళ్లి, ఎన్నికల అధికారి, జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img