Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏపీలో ప్రజాస్వామ్యానికి విలువ లేదు

. సమస్య తీవ్రత ఉంటే ఏ స్థాయిలోనైనా గళం విప్పుతా
. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీకి సిద్ధం
. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌

విశాలాంధ్ర`హైదరాబాద్‌ : ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రజాస్వామ్యానికి విలువ లేదని, అక్కడ ఉన్నోళ్లు మామూలు మనుషులు కాదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒక రిసార్టులో పార్టీ తెలంగాణ ప్రాంత కార్యనిర్వాహకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రాలో నేను ఎదుర్కొంటున్న వాళ్లు సొంత బాబాయిని చంపేసుకున్న వాళ్లన్నారు. న్యాయ వ్యవస్థను తిడుతూ, పోలీసు వ్యవస్థను ఇష్టం వచ్చినట్టు వాడే వారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అన్న పదానికి అక్కడ విలువ లేదన్నారు. పార్టీ శ్రేణులకు సరైన దారి ఏర్పరచకుండా మాట్లాడితే అన్ని పార్టీలు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. సమస్య తీవ్రత ఉందంటే మాత్రం ఏ స్థాయిలో కావాలన్నా గళం విప్పుతా, భయపడకుండా మాట్లాడతానని స్పష్టం చేశారు. తెలంగాణలో భావోద్వేగంతో కూడిన రాజకీయాలు ఉంటే, ఆంధ్ర ప్రదేశ్‌లో కులాల గీతల మధ్య రాజకీయం చేయాలన్నారు. అందుకే ఆంధ్రాలో మాట్లాడేటప్పుడు కులాల గీతల మధ్యే మాట్లాడాల్సి వస్తుందన్నారు. అక్కడ అభివృద్ధి కావాలంటే ఆంధ్ర ప్రదేశ్‌లో పరిశ్రమలు రావాలని, అక్కడ పరిశ్రమలు రాకుంటే మళ్లీ తెలంగాణకు వలసలు పోవాలని ఓ ఉత్తరాంధ్ర యువకుడు చెప్పిన మాటలు ఆలోచింపచేశాయన్నారు.
ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషం… బీజేపీ అయినా సరే…
తెలంగాణ అసెంబ్లీలో జనసేన పార్టీ సభ్యులు ఉండాలని, అందుకోసం పోరాటం చేద్దామని, అవకాశాన్ని బట్టి 25 నుంచి 40 అసెంబ్లీ స్థానాలు, ఏడు నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దిగనున్నట్టు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. మనం పోటీ చేయని స్థానాల్లో కూడా జనసేన ప్రభావం చూపాలన్నారు. ఎన్నికల ప్రకటన ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉండాలని సూచించారు. కావాలంటే ఒకటికి రెండు సార్లు మీ నియోజక వర్గాల్లో తిరుగుతానని అన్నారు. తెలంగాణ ప్రజలు మీరు ఎందుకు వచ్చారని అడిగితే భుజం కాయడానికి వచ్చామని చెప్పాలని తెలిపారు. ఆ క్రమంలో ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషమని, అది బీజేపీ అయినా సరే అన్నారు. అయితే అది జనసేన భావజాలనికి, తెలంగాణ రాష్ట్ర క్షేమానికి సరైందనుకుంటేనే ఆలోచిద్దామన్నారు. ఎవరితో పొత్తు పెట్టుకున్నా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లా వదిలేయమని చెప్పారు. పోరాట పటిమ ఉన్నవారు తెలంగాణ ప్రజలని, అలాంటి పోరుగడ్డ మీద కొత్త కొత్త పార్టీలు, ప్రభుత్వాలు వచ్చాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img