Monday, May 20, 2024
Monday, May 20, 2024

కమలంలో కలహం

. కీలక సమావేశానికి సీనియర్ల డుమ్మా
. కొత్తవారికి టికెట్లపై ఆగ్రహం
. జీవీఎల్‌, సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డి అసంతృప్తి

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : బీజేపీలో విబేధాలు భగ్గుమన్నాయి. పార్టీలోని సొంత నేతల నుంచే చిక్కులెదురయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న సీనియర్లు ఇప్పుడు తమ అసంతృప్తిని బాహాటంగానే ప్రదర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో తమను పక్కనబెట్టి, కొత్త వారికి టికెట్లు ఇవ్వడంపై అసలైన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కీలక సమావేశానికి వారు డుమ్మా కొట్టడంతో అధిష్టానానికి మింగుడుపడటం లేదు. ఏపీ బీజేపీ కీలక సమావేశానికి ఆ పార్టీ సీనియర్లు హాజరుకాలేదు. విజయవాడలో మంగళవారం పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన పదాధికారుల సమావేశానికి బీజేపీ సీనియర్‌ నేతలు జీవీఎల్‌, సోము వీర్రాజు, విష్ణువర్థన్‌ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎంతో కీలకమైన ఈ సమావేశానికి పార్టీ ఏపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ అరుణ్‌సింగ్‌ తదితరులు హాజరయ్యారు. బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో అసలైన బీజేపీ నేతలకు టికెట్లు దక్కకపోవడంతో సీనియర్‌ నేతలు ఆగ్రహంతో సమావేశానికి గైర్హాజరైనట్లు తెలిసింది. పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పని చేస్తున్న వారికి సముచిత స్థానం కల్పించకుండా, ఇతర పార్టీల నుంచి ఇటీవల వలసలు వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ తీరుపై జీవీఎల్‌, సోము వీర్రాజు, విష్ణువర్థన్‌ రెడ్డి కేంద్ర నాయకత్వానికి లేఖలు రాసినా ఫలితం లేదని వాపోతున్నారు. దీంతో విజయవాడలో జరిగిన బీజేపీ ముఖ్య సమావేశానికి వారు దూరంగా ఉన్నట్లు ప్రచారముంది. ఇటీవల బీజేపీ విడుదల చేసిన ఆరు లోక్‌సభ స్థానాల్లో అరకుకు కొత్తపల్లి గీత, అనకాపల్లికి సీఎం రమేశ్‌, రాజమండ్రికి దగ్గుబాటి పురందేశ్వరి, నరసాపురం భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మ, తిరుపతి వరప్రసాద్‌, రాజంపేట ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డికి కేటాయించారు. విశాఖ లోక్‌సభ స్థానాన్ని జీవీఎల్‌ నరసింహారావు ఆశించగా, అది పొత్తుల్లో భాగంగా టీడీపీకి వెళ్లింది. అక్కడ విశాఖ ఎంపీగా బాలకృష్ణ అల్లుడు భరత్‌కు టీడీపీ టికెట్‌ కేటాయించడంతో జీవీఎల్‌కు మొండిచేయి మిగిలింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన సీఎం రమేశ్‌కు, కొత్తపల్లి గీత, వరప్రసాద్‌, కిరణ్‌కుమార్‌ రెడ్డికి పార్టీ టికెట్లు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏపీ బీజేపీలో అసలైన బీజేపీ నేతలు, టీడీపీ నుంచి వచ్చిన బీజేపీ నేతలు ఉన్నారు. కొంతకాలంగా వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అసలైన బీజేపీ నేతలేమో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాలని ప్రతిపాదించగా, టీడీపీ నుంచి వచ్చిన బీజేపీ నేతలేమో పొత్తులతోనే పోటీ చేయాలని పట్టుపట్టారు. ఎట్టకేలకు బీజేపీ కేంద్ర నాయకత్వం దగ్గర టీడీపీ నుంచి వచ్చిన బీజేపీ నేతల మాటే చెల్లుబాటవడంతో బీజేపీ పొత్తులకు దిగింది. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితో ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా బీజేపీకి ఆరు లోక్‌సభ స్థానాలను, 10 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు.
ఇప్పటివరకు లోక్‌సభ స్థానాలను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించగా, అసెంబ్లీ స్థానాలను ఏ క్షణంలో అయినా విడుదల చేసేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధంగా ఉంది. జీవీఎల్‌, సత్యకుమార్‌, సోము వీర్రాజు, విష్ణువర్థన్‌ రెడ్ది ఎంపీ సీట్లను ఆశించి భంగపాటుకు గురయ్యారు. ఎంపీ సీట్లు దక్కకపోయినా కనీసం అసెంబ్లీ స్థానాల్లో సోము వీర్రాజు, విష్ణువర్థన్‌ రెడ్డి పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే అసెంబ్లీ సీట్లు వారికి ఇచ్చే పరిస్థితులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కీలక సమావేశానికి ఆరుగురు ఎంపీ అభ్యర్థులు హాజరయ్యారు. బీజేపీ సీనియర్‌ నేతలు జీవీఎల్‌, సోము వీర్రాజు, సత్యకుమార్‌, విష్ణువర్థన్‌ రెడ్డి డుమ్మా కొట్టడంపై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఆరా తీస్తోంది. కూటమిలో భాగంగా బీజేపీ కేటాయించిన పది అసెంబ్లీ సీట్లపై చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img