Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కలవరపెడుతున్న డెంగీ

కట్టడికి చర్యలు చేపట్టాలి
కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశం
తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

న్యూదిల్లీ : దేశంలో డెంగీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ డెంగీ జ్వరాలు పెరిగిపోతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ మహమ్మారి ప్రభావం దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తీవ్రంగా ఉండటంతో కేంద్రం అప్రమత్తమైంది. డెంగీ ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపింది. డెంగీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు దాని పరిష్కారానికి మార్గాలను ఈ బృందాలు సూచిస్తాయి. సోమవారం దిల్లీలో డెంగీ పరిస్థితిని సమీక్షించిన తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్‌ మాండవియా జారీచేసిన మార్గదర్శకాల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. హరియాణా, కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, దిల్లీ, జమ్మూకశ్మీర్‌కు కేంద్ర బలగాలను పంపినట్లు తెలిపింది. డెంగీ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలకు తక్షణమే అవసరమైన సహాయ`సహకారాలు అందించాలని మాండవియా ఆదేశాలిచ్చారు. దేశవ్యాప్తంగా 1,16,991 డెంగీ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన బుధవారం పేర్కొంది. అక్టోబరు, నవంబరు నెలల్లో డెంగీ కేసులు గతేడాది కంటే అధికంగా నమోదు అయినట్లు వెల్లడిరచింది. ప్రస్తుత సంవత్సరంలో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గరిష్ట కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపింది. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 86 శాతం కేసులు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయని వెల్లడిరచింది. ఈ ఏడాది కేసుల సంఖ్య ఎక్కువ నమోదు అయిన తొమ్మిది రాష్ట్రాలకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్సీడీసీ), నేషనల్‌ వెక్టార్‌ బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌ (ఎన్వీబీడీసీపీ) సంస్థల నుంచి నిపుణులతో అత్యున్నత స్థాయి బృందాలను ఏర్పాటు చేసి, రాష్ట్రాలకు పంపినట్టు కేంద్రం వెల్లడిరచింది. డెంగీ నివారణలో రాష్ట్రాలకు సహకరించడం, తగిన సూచనలు చేయడం ఈ బృందం ప్రధాన లక్ష్యమని తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో కేసుల తీవ్రతపై స్టేటస్‌ రిపోర్టు రూపొందించడం, వ్యాధి చికిత్సకు అవసరమైన ఔషధాలు, కిట్స్‌ లభ్యత, త్వరగా వ్యాధి నిర్థారణ, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే దోమల నివారణకు అవసరమైన క్రిమిసంహారకాలు తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించాల్సి ఉంటుంది. కేంద్ర బృందం పరిశీలనలో బయటపడ్డ లోపాలను రాష్ట్రాలతో చర్చించి, వాటిని సరిదిద్దే క్రమంలో తగిన సహాయం అందించడం ఇందులో భాగమని కేంద్రం తెలిపింది. ఐదేళ్లలో అత్యధిక డెంగీ మరణాలు ఈ సీజన్‌లోనే నమోదు కావడం వ్యాధి తీవ్రత ఎంత స్థాయిలో వ్యాపించి ఉందో అద్దం పడుతోంది. ఇదిలావుంటే, దేశ రాజధాని దిల్లీలోని ఈ ఏడాదిలో 1530 డెంగీ కేసులు బయటపడ్డాయి. వీటిలో కేవలం ఒక్క అక్టోబరులో 1200 కేసులు వెలుగు చూశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నాలుగేళ్లలో ఈ స్థాయిలో కేసలు నమోదు కావడం ఇదే తొలిసారి అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో వ్యాప్తి అధికంగా ఉన్న 200 జిల్లాలను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ఇదే సమయంలో డెంగీపై అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు వేగంగా వ్యాధి నిర్థారణ పరీక్షలు జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర బృందాలు సూచించనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img