Friday, April 26, 2024
Friday, April 26, 2024

కార్మికాగ్రహం

రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు
లేబర్‌కోడ్‌లు ఉపసంహరించుకోవాల్సిందే !
కార్మికవర్గాన్ని కట్టు బానిసలు చేస్తున్న మోదీ
చట్టాలు రద్దు చేయకుంటే పతనం తప్పదని ఓబులేసు, రవీంద్రనాథ్‌ హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : కేంద్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన నాలుగు లేబర్‌కోడ్‌లను ఉపసంహరించుకోవాల్సిందేనని, లేనిపక్షంలో కార్మికాగ్రహం చవిచూడాల్సి వస్తుందని ఏఐటీయూసీ నేతలు హెచ్చరించారు. జులై 1 నుంచి దేశవ్యాప్తంగా 12 గంటల పని విధానాన్ని అమలు జరపాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన ప్రదర్శనలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.ఓబులేసు, విజయవాడలో అధ్యక్షులు రవీంద్రనాథ్‌, గుంటూరులో గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, నూజివీడులో జరిగిన ధర్నాలో కార్యనిర్వాహక అధ్యక్షులు చలసాని వెంకట రామారావు పాల్గొన్నారు. విజయవాడ వన్‌టౌన్‌ సామారంగం చౌక్‌లో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు మూలి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం సంస్కరణలపేరుతో కార్మిక చట్టాలను కార్పొరేట్‌ వర్గాలకు, పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసిందన్నారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చి కార్మికులను యాజమాన్యాలకు బానిసలుగా మార్చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 8 గంటల పనివిధానం పెట్టుబడిదారీ వర్గ దయాదాక్షిణ్యాలపై వచ్చింది కాదని, కార్మికులు రక్తాతర్పణం చేసి పోరాటాల ద్వారా సాధించుకున్నారని గుర్తు చేశారు. కేంద్ర నిరంకుంశ విధానాలను బీజేపీయేతర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం నరేంద్రమోదీ మెప్పు పొందటం కోసం ఈ చట్టాలు అమలు చేయటానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా మోదీ, జగన్‌ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేనిపక్షంలో కార్మికాగ్రహం చవిచూడాల్సి వస్తుందని రవీంద్రనాధ్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌ వెంకటసుబ్బయ్య, ముఠా కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వియ్యపు నాగేశ్వరరావు, రాష్ట్ర హాకర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు కొట్టురమణ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలులో
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగులేబర్‌ కోడ్‌లు తక్షణమే నిలుపుదల చేయాలని ఏఐటీయూసీి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ఓబులేసు డిమాండ్‌ చేశారు. 12 గంటల పని విధానం, 4 లేబర్‌ కోడ్‌ల రద్దును డిమాండ్‌ చేస్తూ ఒంగోలులో బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉద్యోగులు, కార్మికుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న44 కార్మిక చట్టాలను రద్దుచేసి 4లేబర్‌ కోడ్‌లుగా తేవడం దుర్మార్గమన్నారు. కార్మికులను కట్టుబానిసలుగా చేసి కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేయించడానికి కుట్రపన్నిందన్నారు. రైతు చట్టాలు ఉప సంహరించినట్లుగానే 4 లేబర్‌ కోడ్‌లను ఉప సంహరించుకోవాలని డిమాండు చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పీవీఆర్‌ చౌదరి, నగర కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరులో
నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం గుంటూరులో నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. స్థానిక మల్లయ్యలింగంభవన్‌ నుంచి పెద్దఎత్తున నినాదాల మధ్య ప్రదర్శన హిమనీ సెంటర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు సాగింది. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కార్మికుల శ్రమను అంబానీ, ఆదానీలకు తాకట్టు పెట్టవద్దని, కార్పొరేట్‌ కంపెనీలకు కార్మికులను కట్టుబానిసలుగా మార్చవద్దని, 12 గంటల పనివిధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్‌ మేడా హనుమంతరావు, కోట మాల్యాద్రి, కోశాధికారి ముఠా కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చిన ఆంజనేయులు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ(బుజ్జి) తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లాలో
కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్‌ కోడ్‌ లను రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చలసాని వెంకట రామారావు డిమాండ్‌ చేశారు. కార్మిక కోడ్‌లకు నిరసనగా శుక్రవారం స్థానిక పెద్ద గాంధీ బొమ్మ సెంటర్‌ లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.సోమసుందర్‌, స్థానిక కార్మిక సంఘ నేతలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌ జిల్లాలో జీవో ప్రతులు దగ్థం
పారిశ్రామిక కేంద్రమైన ఇబ్రహీంపట్నంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన కార్మికులు ప్రదర్శన చేసి, నాలుగు లేబర్‌ కోడ్‌లకు సంబంధించిన జీఓ ప్రతులను తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు సీహెచ్‌ కోటేశ్వరరావు, సీపీఐ ఏరియా కార్యదర్శి బుడ్డి రమేష్‌, శ్రామిక మహిళా ఫారం జిల్లా నాయకురాలు సిహెచ్‌.దుర్గాకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలో
కార్మిక వర్గాన్ని కట్టు బానిసలు చేస్తున్న మోడీ పాలన అరాచకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్‌ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 12 గంటల పని దినాలు వద్దు 8 గంటల పని దినాలు కొనసాగించాలని కోరుతూ, శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎన్‌.డీ.రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె.రాధాకృష్ణ , జిల్లా అధ్యక్షుడు కె.కుమార్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లాలో
ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ బాపట్ల జిల్లా రేపల్లె తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈకార్యక్రమంలో సీపీఐ బాపట్ల కార్యదర్శి పి.నాగాంజనేయులు, రేపల్లె ఏరియా కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ, పడమట భిక్షాలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img