Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చంద్రబాబు నివాసగృహం జప్తు

. రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్పులో అవకతవకలు
. ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్‌ తీసుకున్నారని ప్రభుత్వ అభియోగం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు గెస్ట్‌ హౌస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అటాచ్‌ చేసింది. క్రిమినల్‌ లా అమెండ్‌మెంట్‌ 1994 చట్టం ప్రకారం ఆర్థిక నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ, స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ లింగమనేని గెస్ట్‌ హౌస్‌ను అటాచ్‌ చేసింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్పు చేశారని అభియోగం మోపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా నారాయణ పదవుల దుర్వినియోగానికి, క్విడోప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సీఆర్డీఏ మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్లలో అవకతవకలు జరిగాయని, దానికి బదులుగా చంద్రబాబు కరకట్టపై లింగమనేని గెస్ట్‌ హౌస్‌ పొందారని ప్రభుత్వం అభియోగం మోపింది. చట్టాలు, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను ఉల్లంఘించినట్టు ప్రభుత్వం నిర్థారించింది. తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, స్నేహితులకు ప్రయోజనాలు కల్పించారని, వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి… ప్రతిఫలంగా గెస్ట్‌ హౌస్‌ తీసుకున్నారని చంద్రబాబుపై అభియోగం మోపింది. గతంలో ఇదే గెస్ట్‌ హౌస్‌ను నదీపరివాహక ప్రాంతంలో ఉందని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. పక్కనే ఉన్న ప్రజా వేదికను కూల్చివేసింది. చంద్రబాబు నివాస గృహం పక్కనే నదీ తీరం వెంబడి మంతెన సత్యనారాయణ ఆశ్రమంతో పాటు ఇంకా అనేక మంది ప్రముఖుల గెస్ట్‌హౌస్‌లు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటి జోలికి వెళ్లలేదు.
జగన్నాటకంలో అంతర్భాగమే ఇది : టీడీపీ
జగన్‌ది విధ్వంస పాలనేగానీ… ఆయన ప్రభుత్వం నిర్మాణాత్మక ప్రభుత్వం కాదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. జగన్‌ పాలన ప్రారంభించిన రోజుల్లోనే ప్రజా ఉపయోగమైన ‘ప్రజాదర్బార్‌’ ను కూలగొట్టి రాష్ట్ర ఖజానాకు నష్టం తెచ్చారు. ఇదే ప్రజా దర్బార్‌ను ప్రజా ఉపయోగాలకు వినియోగించి ఉండొచ్చు. నేరం జరగకపోయినా, రాజకీయ దురుద్దేశంతో సీఐడీని తన ఆధీనంలోకి తీసుకొని చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్‌ తదితరులపై క్రైమ్‌ 16/22 రిజిష్టర్‌ చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారని వర్ల రామయ్య ఆదివారం మీడియా సమావేశంలో ఆరోపించారు. రేపో మాపో అరెస్టు కాబోతున్న మీ తమ్ముడు అవినాష్‌ రెడ్డి అరెస్టుపై ప్రజల దృష్టిని మరల్చడం కోసమే ఈ జప్తు నాటకమని అన్నారు. అమరావతి రాజధానిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ పనులే మొదలుపెట్టలేదని, ఇక అవినీతి ఎక్కడుంటుందో ముఖ్యమంత్రే చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. లింగమనేని రమేష్‌ భూములన్నీ ప్రతిపాదిత ఐఆర్‌ఆర్‌కు 4 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అటువంటప్పుడు ఆయన అతిగా లబ్ధి పొందడానికి అవకాశమెక్కడ ఉంటుంది? ఈ కేసులో నష్టపోయినవారెవరు మీకు ఫిర్యాదు ఇవ్వలేదు.
నేరమూ జరగలేదు, ఫిర్యాదు ఇచ్చిన బాధితులు ఎవరూ లేరు, మీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రిపోర్టు ఇస్తే ప్రతిపక్షాలను ఇబ్బంది పెడతారా? ఇది కక్ష సాధింపు కాకపోతే మరేంటి? ఇది మీ అరాచక, అస్తవ్యస్థ, రాజకీయ కక్షపూరిత పాలనకు నిదర్శనం కాదా? అని వర్ల మండిపడ్డారు. వ్యక్తిగత కక్షతో ఈ ప్రభుత్వం నడుస్తోందని, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం బొక్కబోర్లా పడటం ఖాయమని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img