Friday, May 3, 2024
Friday, May 3, 2024

జగన్‌పై దాడి చేసిందెవరు?

. కేసు దర్యాప్తు వేగవంతం
. రంగంలోకి 8 ప్రత్యేక పోలీసు బృందాలు
. ఇప్పటికే 50 మందికి పైగా అనుమానితుల విచారణ
. ఎయిర్‌గన్‌, క్యాట్‌ బాల్‌ వినియోగదారులపైనా ఆరా
. ఆచూకీ తెలిపితే రూ.2 లక్షల బహుమతి ప్రకటన

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపై రాయి విసిరిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందుకోసం ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటయి ఆధారాలు సేకరిస్తోంది. ప్రత్యక్ష సాక్షుల నుంచి స్టేట్‌మెంట్స్‌ రికార్డు చేయిస్తున్న డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంత దూరం నుంచి జగన్‌కు తగిలేలా రాయి ఎలా విసిరారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. దాడి జరిగిన ప్రాంతంలో అనుమానితుల ఇన్‌కమింగ్‌, ఔట్‌గౌయింగ్‌ కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. అదే రోజు ఆ ప్రాంతం నుంచి ఒకే నంబరు ద్వారా ఎక్కువ కాల్స్‌ వెళ్లిన, వచ్చిన వాటిపై కూడా ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన గంగానమ్మ గుడి దగ్గర సెల్‌టవర్‌ నుంచి గత 15 రోజులుగా పోలీసులు అనుమానిస్తున్న వారి కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. రాయి చేతితో విసిరారా? లేక ఎయిర్‌గన్‌? క్యాట్‌బాల్‌? ను ఉపయోగించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో వీటిని ప్రత్యేకంగా వినియోగించే వారి కోసం కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం వాహనానికి ఉన్న సీసీ టీవీ పుటేజ్‌తో పాటు పోలీస్‌ వాహనాలకు ఉన్న సీసీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాహనాలకు కెమెరాలు ఉన్నప్పటికీ ఫోకస్‌ లైట్స్‌ కారణంగా వీడియోలు స్పష్టంగా కనిపించడం లేదు. గంగానమ్మ గుడి ఐసోలేషన్‌ లోకేషన్‌లో కాల్‌ డేటాను, సాంకేతిక సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ కేసు విచారణలో అనుభవజ్ఞులైన కమిషనరేట్‌ ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగి అణువణువూ గాలిస్తున్నారు. నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తుల కదలికలపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే అజిత్‌సింగ్‌నగర్‌ దగ్గర వివేకానంద స్కూల్‌, గంగానమ్మ గుడికి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం నుంచే దాడి జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. దానికనుగుణంగా ఇప్పటికే దాదాపు 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు విచారించారు. నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారి దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే జగన్‌పై జరిగిన దాడి సంఘటనపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఆరా తీశాయి. ఈ ఘటనపై సీఈవోకు విజయవాడ నగర సీపీ క్రాంతి రాణా టాటా ప్రాథమిక నివేదిక అందజేశారు. ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసి సమగ్ర నివేదికను అందజేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖ వ్యక్తుల పర్యటనల్లో ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీపీ రాణాను, ఐజీ రవి ప్రకాశ్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ఆదేశించారు.
ఈ నంబర్లకు సమాచారమిస్తే రూ.2 లక్షల బహుమతి
ఈ కేసు దర్యాప్తులో భాగంగా జగన్‌పై దాడి చేసిన నిందితుల సమాచారం చెప్పిన వారికి ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. దాడికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. సంఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ఉన్నా పంపవచ్చు. నిందితుల వివరాలను 9490619342, 9440627089 నంబర్లకు ఫోన్‌ చేయాలి. మొత్తం మీద జగన్‌ దాడి కేసులో కీలక సమాచారం కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు.
సీఎం బస్సు రూఫ్‌ మీద నిలబడటం వల్లే కరెంట్‌ తీశాం : సీపీ రాణా
విజయవాడ నగర పరిధిలో దాదాపు 22 కిలోమీటర్ల పొడవునా సీఎం జగన్‌ బస్సు రూఫ్‌ మీద నిలబడి రోడ్‌ షో చేశారని, రహదారి మార్గంలో అనేక కేబుల్స్‌, కరెంట్‌ తీగలు ఉన్నందున భద్రతా చర్యల్లో భాగంగా ఆయన ప్రయాణించే మార్గాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ క్రాంతి రాణా టాటా తెలిపారు. ఆయన సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు పురోగతిని వివరించారు. జగన్‌ బస్సు యాత్రను పురస్కరించుకుని 1,480 మంది పోలీసు బలగాలను భద్రతకు ఉపయోగించినట్లు వెల్లడిరచారు. ఇవిగాక 400 మందితో 40 రోప్‌ పార్టీలు పెట్టామని తెలిపారు. చీకట్లో రాయి విసిరిన వ్యక్తిని కనుక్కోవడం తేలికైన పని కాదని, అయినప్పటికీ త్వరలోనే ఆ వ్యక్తిని పట్టుకుంటామన్నారు. రాయి తగలరాని చోట తగిలితే పెద్ద ప్రమాదమే జరిగేదని, అందుకే హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో దోషులను పట్టుకోవడానికి ప్రజలు కూడా సహకరించాలని, సమాచారం తెలియజేసిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని, రూ.2 లక్షల నగదు బహుమతి అందజేస్తామని సీపీ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img