Friday, May 3, 2024
Friday, May 3, 2024

మోదీని ఇంటికి సాగనంపుదాం – రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

రాజమండ్రి సభలో వక్తల పిలుపు

విశాలాంధ్ర బ్యూరో- రాజమహేంద్రవరం : దేశంలో ఇండియా కూటమి విజయం సాధించాలని, అందులో తొలి విజయం రాజమహేంద్రవరానిదే కావాలని, ఇందుకోసం అందరూ సమష్టిగా కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీని ఇంటికి సాగనంపాలని, అప్పుడే రాజ్యాంగాన్ని కాపాడుకోగలమని స్పష్టంచేశారు. స్థానిక ఆనం రోటరీ హాల్‌లో ఇండియా కూటమి తూర్పుగోదావరి జిల్లా ఆత్మీయ సమావేశం సందర్భంగా లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ సభ జరిగింది. సభకు సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టి.అరుణ్‌ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ముందుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ 2014, 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. తాజాగా మోదీ గ్యారెంటీ పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి బీజేపీ కొత్త మేనిఫెస్టోతో ముందుకు వచ్చిందన్నారు. 2014 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా, విభజన హామీలు, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం, రాజధాని నిర్మాణం వంటి హామీలను అమలు చేస్తామని నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఉమ్మడిగా హామీ ఇచ్చారని, అధికారం చేపట్టిన తర్వాత అందులో ఒక్కటీ అమలు చేయలేదని రామకృష్ణ విమర్శించారు. దేశంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు మోదీ సర్కారు కారుచౌకగా కట్టబెడుతోందన్నారు. రుణమాఫీ చేయాల్సిందిగా రైతులు డిమాండ్‌ చేస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పుకొచ్చిందని, కానీ కార్పొరేట్‌ సంస్థలకు మాత్రం వేలకోట్ల రుణాలు మాఫీ చేసిందని నిందించారు. మోదీ సర్కారు అక్రమాలపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలతో బెదిరిస్తోందని, జైళ్లకు పంపుతోందని రామకృష్ణ చెప్పారు. బీజేపీని వ్యతిరేకిస్తే…ముఖ్యమంత్రులను సైతం కటకటాల వెనక్కి పంపిందని వివరించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ నాలుగున్నరేళ్లకు పైగా నియంత చేతికి చిక్కిందని, రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని విమర్శించారు. వ్యవసాయ, పారిశ్రామిక, నీటిపారుదల రంగాల అభివృద్ధి అటకెక్కిందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రం మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికిన జగన్‌…అధికారం చేపట్టిన తర్వాత మాట తప్పి…మడమ తిప్పారని ఆయన విమర్శించారు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు ఇండియా కూటమితోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఇండియా కూటమి గెలుపు ఏపీ అభివృద్ధికి మలుపుగా ఆయన అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో ప్రజాకంటక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌కు విముక్తి కలిగించేందుకు ప్రతిఒక్కరూ దీక్షబూనాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ దేశంలో ముఖ్యమంత్రి అరెస్ట్‌ అయిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని, బీజేపీని వ్యతిరేకించడం వల్లే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ క్రేజీవాల్‌ జైలు పాలయ్యారని చెప్పారు. బీజేపీ వ్యతిరేకులపై ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను ప్రయోగిస్తున్నట్లు విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీతో టీడీపీ జతకట్టడం వెనక రహస్యం ఉందన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టడం వల్లే బీజేపీతో టీడీపీ కలిసిందని, అందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మరోమంత్రి బీజేపీ పెద్దలతో దిల్లీలో మంతనాలు జరిపారని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. అందుకుగాను రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరికి జిల్లా ప్రజలు చెవిలో పూలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. పురందేశ్వరని చిత్తుగా ఓడిరచాలన్నారు. సభలో కాంగ్రెస్‌ నాయకుడు జంగా గౌతమ్‌, ప్రముఖ రచయిత డీవీఎస్‌ వర్మ, సీపీఐ నాయకుడు కుండ్రపు రాంబాబు, సీపీఎం నాయకుడు బి.పవన్‌, కూటమి నాయకులు వి.కొండలరావు, తులసి, జువ్వల రాంబాబు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు బోడ వెంకట్‌, బలేపల్లి మురళీధర్‌, అరుణకుమారి, మార్టిన్‌ లూథర్‌ ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img