Friday, May 3, 2024
Friday, May 3, 2024

23 వరకు జైల్లోనే కేజ్రీవాల్‌

. మద్యం కేసులో కస్టడీ పొడిగించిన ప్రత్యేక కోర్టు
. అరెస్టుపై వివరణ ఇవ్వాలని ఈడీకి సుప్రీం నోటీసు

న్యూదిల్లీ : మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కోర్టుల్లో ఊరట లభించలేదు. ఏప్రిల్‌ 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ దిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయగా… ఈడీ అరెస్టును సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏప్రిల్‌ 29వరకు విచారణ చేయడం కుదరదని చెబుతూ… కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై వివరణ ఇవ్వలంటూ ఈడీకి నోటీసులు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్‌ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు. దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కు ప్రత్యేక న్యాయస్థానం విధించిన 15 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ సోమవారంతో ముగిసింది. దీంతో ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను దిల్లీ కోర్టులోని సీబీఐ, ఈడీ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరిచారు. విచారణ కీలక దశలో ఉందని, మరో 14 రోజులు కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. బీఆర్‌ఎస్‌ నాయకురాలు కల్వకుంట్ల కవితతో సహా కొంతమంది సహ నిందితుల జ్యుడీషియల్‌ కస్టడీ ఏప్రిల్‌ 23తో ముగుస్తుందన్న ఈడీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆ తేదీ వరకు కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మనీలాండరింగ్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ఏప్రిల్‌ 24లోగా వివరణ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 29 తర్వాత చేపడతామని ధర్మాసనం పేర్కొంది. అంతకుముదు కేజ్రీవాల్‌ పిటిషన్‌పై తక్షణ విచారణ కోసం ధర్మాసనం ఎదుట సీనియర్‌ న్యాయవాది ఏఎం సింఫ్వీు వాదనలు వినిపించారు. న్యాయస్థానం మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురి చేసేలా కొన్ని వాస్తవాలను కోర్టుకు చూపించాలనుకుంటున్నట్లు చెప్పారు. కొన్ని సెలెక్టివ్‌ లీక్‌లు ఉన్నాయని చెబుతూ… వచ్చే శుక్రవారం విషయాన్ని వినవలసిందిగా అభ్యర్థించారు. అయితే తనకు అలాంటిదేమీ కనిపించలేదని జస్టిస్‌ ఖన్నా అన్నారు. ‘మేము మీకు సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో విచారణ తేదీ నిర్ణయిస్తాము. కానీ మీరు సూచించిన తేదీన సాధ్యం కాదు’ అని తెలిపారు. సింఫ్వీు మాట్లాడుతూ… ఇది అసాధారణ విషయమని, ఆయన ముఖ్యమంత్రి అయినందుకు కాదని అన్నారు. సీబీఐ, ఈడీ మద్యం కేసులో ఎనిమిది చార్జిషీట్లు దాఖలు చేసినప్పటికీ వాటన్నింటిలో కేజ్రీవాల్‌ పేరులేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కథ సెప్టెంబర్‌ 2022 నుంచి ప్రారంభమైతే కేజ్రీవాల్‌ను 2024 మార్చి 16న అరెస్టు చేశారన్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి ద్వారా తొమ్మిది, ఇతరులను ఆరు.. మొత్తం 15 స్టేట్‌మెంట్‌లు దర్యాప్తు సంస్థల వద్ద ఉన్నాయని…అందులో కేజ్రీవాల్‌ పేరు పేర్కొనలేదన్నారు. తదుపరి తేదీకి తన వాదనలను రిజర్వ్‌ చేయమని జస్టిస్‌ ఖన్నా సింఫ్వీుని కోరడంతో… ఎన్నికల్లో ప్రచారం చేయనీయకూడదన్న లక్ష్యంతోనే మార్చి16న కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని సింఫ్వీు పేర్కొన్నారు. కాగా ఈడీ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img