Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఎన్నికల బాండ్లుకుమోదీ సమర్ధన

సుప్రీం తీర్పును పరిహసించేలా ప్రధాని వ్యాఖ్యలు

న్యూదిల్లీ : ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు తీర్పును పరిహసించేలా ప్రధాని నరేంద్ర మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల బాండ్లను సమర్థిస్తూ… ఈ పథకం రద్దు విషయంలో ప్రతి ఒక్కరూ చింతిస్తారని ఓ జాతీ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఎన్నికల బాండ్ల అంశంతో పాటు దేశ భవిష్యత్తు ప్రణాళికలపై కూడా వివరించారు. ఎన్నికల బాండ్ల పథకం ద్వారా రాజకీయ పార్టీల నగదు లావాదేవీలకు స్పష్టమైన మార్గం ఏర్పడిరదన్నారు. దీనిపై నిజాయితీగా ఆలోచిస్తే… వీటి రద్దుపై ప్రతిఒక్కరూ బాధ పడతారని రాజకీయ పార్టీలనుద్దేశించి అన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు బడ్డు ఖర్చు చేస్తాయన్న మోదీ… నల్లధనాన్ని అరికట్టేందుకు తన మనసులో వచ్చిన స్పచ్ఛమైన ఆలోచనే ఎన్నికల బాండ్లు అంటూ గొప్పలు పోయారు. మరోవైపు నల్లధనం నిర్మూలన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇదే సరైన మార్గం అని తాను ఎన్నడూ చెప్పలేదని ప్రధాని తెలిపారు. ఈ పథకం కారణంగా బీజేపీకే ఎక్కువ ప్రయోజనం చేకూరిందని ప్రతిపక్షాలు ఆరోపించడాన్ని తప్పు బట్టారు. బాండ్ల అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ‘నిర్ణయాలు తీసుకోవడంలో లోటుపాట్లు ఉండవని నేను ఎప్పుడూ చెప్పలేదు. లోటుపాట్లు ఉంటే వాటిపై చర్చించి మెరుగుపరుచుకుంటాం. ఈ విషయంలోనూ ( ఎన్నికల బాండ్ల పథకం) మెరుగుపరచుకునేందుకు ఎంతో అవకాశం ఉంది. ఈరోజు దేశాన్ని నల్లధనం వైపు మనం నెట్టేశాం. ఇది పశ్చాత్తాపపడాల్సిన విషయం. నిజాయితీగా వాళ్లు ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప పడతారు’ అని మోదీ పేర్కొన్నారు. ఎన్నికల బాండ్లు లేకపోతే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో? ఎవరు? ఎలా ఇచ్చారు? అనే విషయాలు తెలుసుకునే అధికారం ఉండేది కాదన్నారు. ఇది ఎన్నికల బాండ్ల విజయ గాధ అని చెప్పారు. బీజేపీకి 37% శాతం నిధులు ఎన్నికల బాండ్ల ద్వారా వస్తే ప్రతిపక్షానికి 63% శాతం వచ్చాయని మోదీ పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఈ పథకాన్ని గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి విదితమే. సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును విపక్ష పార్టీలు, పౌర సమాజం కార్యకర్తలు స్వాగతించారు. ఈ పథకం కింద అత్యధికంగా నిధులు అందుకున్న పార్టీలో బీజేపీ మొదటి స్థానంలో ఉందని విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ పథకం ద్వారా బీజేపీ అవినీతికి పాల్పడి అత్యధిక విరాళాలు అందుకుందని విపక్ష ‘ఇండియా’ కూటమి నిప్పులు చెరిగింది. అయితే కేంద్రం పారదర్శకంగానే స్కీమ్‌ ప్రవేశపెట్టిందని, తమ కంటే విపక్ష కూటమికి వచ్చిన విరాళాలే ఎక్కువని బీజేపీ చెబుతోంది. ఇంటర్వ్యూలో 2047 వరకు దేశ భవిష్యత్‌పై తన ప్రణాళికలపై కూడా మోదీ మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే… మోదీ సర్కారు రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తారని ప్రతిపక్షాలు ప్రయత్నించడం అవాస్తవమన్నారు. దేశ సంపూర్ణ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. ‘కొన్ని ప్రభుత్వాలు తాము ప్రతీది చేశామని చెప్పుకుంటాయి. కానీ నేను అన్నీ చేశానని చెప్పను. దేశ అవసరాలు చాలా ఉన్నాయి. కాబట్టి, చేయాల్సినవి చాలా ఉన్నాయని మోదీ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img