Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఎన్నికలు…డబ్బు మూటలు

రోజుకు రూ.100 కోట్లు పట్టివేత

. ఓటింగ్‌కు ముందే రూ.4,650 కోట్ల సొత్తు స్వాధీనం
. జనవరి నుంచి లెక్కిస్తే…. రూ.12 వేల కోట్లు
. ఏపీలో రూ.125.97 కోట్లు… తెలంగాణలో రూ.121.84 కోట్లు
. 2019 ఎన్నికల నాటికంటే ఎక్కువ

న్యూదిల్లీ: ఎన్నికల వేళ ధనం గుట్టలు గుట్టలుగా బయటపడుతోంది. ఓటర్లకు పంచేందుకు, విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు రాజకీయ పార్టీలు, వాటి అభ్యర్థులు పెద్ద మొత్తంలో డబ్బును చాటుమాటుగా తరలిస్తూ ఈసీకి చిక్కుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అక్రమ నిధుల స్వాధీనం గురించి దిగ్భ్రాంతికరమైన గణాంకాలను వెల్లడిరచింది. మార్చి 1 నుంచి ప్రతిరోజూ తమ పర్యవేక్షణలో అధికారులు రూ.100 కోట్ల విలువైన సొత్తు జప్తు చేస్తున్నారని ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. పోలింగ్‌ ప్రారంభం కావడానికి ముందే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రూ.4,650 కోట్లను స్వాధీనం చేసుకున్నారని, 2019 ఎన్నికల్లో చేసిన మొత్తం జప్తుల కంటే ఇది ఎక్కువ అని కమిషన్‌ పేర్కొంది. ‘2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున, దేశంలో 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మొత్తం నమోదయింది’ అని ఇది ఒక ప్రకటనలో తెలిపింది. 18వ లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ఈనెల 19వ తేదీ శుక్రవారం ప్రారంభం కావడానికి ముందే ధనబలాన్ని తనిఖీ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు రికార్డు స్థాయిలో రూ.4,650 కోట్లను స్వాధీనం చేసుకున్నాయి. 2019లో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ మొత్తం సమయంలో స్వాధీనం చేసుకున్న రూ.3475 కోట్ల కంటే ఈసారి ఆరంభంలోనే ఆ మొత్తం పెరిగింది. ఈ ఏడాది మొత్తం జప్తులో సింహభాగం మాదకద్రవ్యాలదే కావడం గమనార్హం. రూ.4,650 కోట్ల జప్తులో 45 శాతం మేర మాదక ద్రవ్యాలే ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుంటారన్న విషయం తెలిసిందే. తమ గెలుపు కోసం ఓటర్లకు డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, వెండి, ఖరీదైన వస్తువులను ఇస్తుంటారు. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధం. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రలోభాలను కట్టడి చేసేందుకు తమ వంతు ప్రయత్నిస్తుంటుంది. ఈసీ ప్రతి రాష్ట్రంలో ఎన్నికల ఫ్లయింగ్‌ స్వ్కాడ్స్‌ను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తూ డబ్బు, మద్యం రవాణాను కట్టడి చేస్తుంటుంది. ఈ క్రమంలో దేశంలో ఎన్నికల సమయంలో కట్టల కొద్దీ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు పట్టుపడుతుంటాయి. అయితే ఈ సారి మాత్రం రికార్డు స్థాయిలో జప్తు జరిగింది.
నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, విలువైన వస్తువులు, ఉచిత తాయిలాలు…
ఈసీఐ వెల్లడిరచిన వివరాల ప్రకారం, మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్‌ 13వ తేదీ వరకు తొలి విడతలో డబ్బు, మద్యం, బంగారం, ఇతర వస్తువుల రూపంలో మొత్తం రూ.4,650 కోట్లు జప్తు చేయడం జరిగింది. అంటే సగటున రోజుకు రూ.100 కోట్ల మేర స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నగదు రూ.395.39 కోట్లు కాగా, బంగారం, వెండి వంటి విలువైన లోహాల రూపంలో రూ.562.10 కోట్లు జప్తు చేసినట్లు ఈసీ తెలిపింది. అలాగే రూ.489.31 కోట్ల విలువ చేసే 3.58 కోట్ల లీటర్ల మద్యం పట్టుపడినట్లు పేర్కొంది. సమగ్ర ప్రణాళిక ద్వారా వీటిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. ఈ ఏడాది మొత్తం రికవరీలో సింహభాగం మాదకద్రవ్యాలదే కావడం గమనార్హం. రూ.4,650 కోట్ల రికవరీలో 45 శాతం మేర మాదక ద్రవ్యాలే ఉన్నట్లు ఈసీ తెలిపింది. మొత్తంగా రూ.2,068.85 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడిరచింది. 2019 ఎన్నికల సమయంలో రూ.1,279.9 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ఇక టీవీలు, ఫ్రిడ్జిలు, మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు, బహుమతుల రూపంలో రూ.1,142.49 కోట్ల మేర స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వివరించింది. 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక మొత్తం అని వెల్లడిరచింది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో రూ.3,475 కోట్లకు పైగా పట్టుబడిరది. దానితో పోలిస్తే ఇది 34 శాతం అధికమని తెలిపింది. సమగ్ర ప్రణాళిక, సంయుక్త కార్యాచరణ, దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాల మధ్య సమన్వయంతో పాటు పౌరుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోగలుగుతున్నామని ఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.4,658 కోట్లలో రాజస్తాన్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్‌ 13వ తేదీ వరకూ మొత్తం రూ. 778.52 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత రూ.605 కోట్లతో గుజరాత్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక తమిళనాడులో రూ.460.8 కోట్లు, మహారాష్ట్రలో రూ.431.3 కోట్లు, పంజాబ్‌లో రూ.311.8 కోట్లు పట్టుబడిరది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి రూ.121.84 కోట్ల మేర స్వాధీనం చేసుకోగా, ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి రూ.125.97 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల అక్రమాలు, అవకతవకల్లో అత్యల్పంగా లఢఖ్‌, లక్షద్వీప్‌ ప్రాంతాలు నిలిచాయి. తమిళనాడులోని నీలగిరిలో ఇటీవల జరిగిన ఒక సంఘటనలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ లీడర్‌ను సస్పెండ్‌ చేయడం ద్వారా విధి నిర్వహణలో అలసత్వంపై కమిషన్‌ చర్యలు తీసుకుంది. అంతేకాకుండా, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, ప్రచారంలో రాజకీయ నాయకులకు సహాయం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై ఈసీఐ ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నారు. ఎన్నికల అధికారిక ప్రకటనకు ముందు నెలల జనవరి, ఫిబ్రవరిలో, నగదు, మద్యం, డ్రగ్స్‌, విలువైన లోహాలు, ఉచిత తాయిలాల రూపంలో దేశవ్యాప్తంగా మరో రూ.7,502 కోట్ల జప్తు నమోదయింది. ‘ఇది ఎన్నికల కాలానికి ఇంకా ఆరు వారాలు మిగిలి ఉండగానే ఇప్పటివరకు మొత్తం జప్తు 12,000 కోట్ల రూపాయలకు చేరుకుంది’ అని పేర్కొంది.
మాదకద్రవ్యాల ముప్పుపై ప్రత్యేక దృష్టి
కేంద్ర ఎన్నికల సంఘం మాదకద్రవ్యాల ముప్పుపై కూడా దృష్టి సారించింది. మాదకద్రవ్యాల స్వాధీనంపై గణనీయమైన దృష్టి ఉందని పేర్కొంది. ఇది జనవరి, ఫిబ్రవరిలో జరిగిన మొత్తం స్వాధీనంలో దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తన నోడల్‌ సంస్థలను సందర్శించిన సందర్భంగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంలో ఆ సంస్థల ప్రయత్నాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఎన్నికలను ప్రభావితం చేయడానికి అక్రమ డబ్బును ఉపయోగించే ప్రమాదంతో పాటు మాదకద్రవ్యాలు సమాజానికి, ముఖ్యంగా యువతకు తీవ్రమైన హాని కలిగిస్తాయని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. తొలి విడత ఎన్నికలు ఏప్రిల్‌ 19న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 26న రెండో విడత, మే 7న మూడో విడత, మే 13న నాలుగో విడత, మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, జూన్‌ 1న ఏడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక తొలి విడతలోనే ఇంత మొత్తంలో నగదు రికవరీ కావడం గమానర్హం. ఎన్నికలు ముగిసే సరికి ఇంకా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img