Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

జగన్‌ బెయిల్‌ రద్దుపై1న సుప్రీం విచారణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఏప్రిల్‌ 1వ తేదీన విచారణ జరగనుంది. జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు జగన్‌ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వేరొక పిటిషన్‌ను సైతం రఘురామకృష్ణ రాజు అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం తెలిపింది. దీంతో ఈ రెండు పిటిషన్లపై ఏప్రిల్‌ 1న విచారణ జరగనుంది.
అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దుపై 4న విచారణ
మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ అవినాశ్‌ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి బెయిల్‌ రద్దు చేయాలని కోరే అధికారం లేదని అవినాశ్‌ తరపు న్యాయవాది వాదించారు. నెల రోజుల క్రితమే ఎన్‌ఐఏ కేసులో అప్రూవర్‌ వేసిన పిటిషన్‌ను డివిజన్‌ బెంచ్‌ అనుమతించిందని హైకోర్టు పేర్కొంది. అప్రూవర్‌కు అడిగే హక్కు ఉందని డివిజన్‌ బెంచ్‌ తీర్పులో స్పష్టంగా ఉందని తెలిపింది. ఈ మేరకు దస్తగిరి పిటిషన్‌ను తిరస్కరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 4వ తేదీకి వాయిదా వేసింది. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేయగా, దీనిపై విచారణను ఏప్రిల్‌ 3కు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img