Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జోన్‌ జగడం

ఆర్‌`5 ఏర్పాటుతో రగులుతున్న రాజధాని ప్రాంతం

. కోర్టు తీర్పును లెక్కచేయకుండా పాలకపక్షం దూకుడు
. పేదల స్థలాల పేరుతో పొక్లెయిన్లతో అధికారుల హంగామా
. ఎక్కడికక్కడ రైతుల ప్రతిఘటనతో తీవ్ర ఉద్రిక్తత
. రేపటి నుంచి రైతుల ప్రజా చైతన్యయాత్ర

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రాజధాని గ్రామాల్లో అగ్గి రాజేస్తోంది. ఇప్పటివరకు మూడు రాజధానుల పేరుతో కొంతమంది పెయిడ్‌ ఆర్టిస్టులతో దీక్షలు చేయించిన ప్రభుత్వం ఇప్పుడు మరో ఎత్తుగడ వేసింది. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పాలక పెద్దలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆర్‌5 జోన్‌ ఏర్పాటు చేసి రైతులపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. సహజంగా ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించాల్సిన పాలకపక్షం, అదే సమస్యను సృష్టించి ప్రజల మధ్య చిచ్చు రేపుతూ చలికాగే ప్రయత్నం చేస్తున్నది. టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన గ్రామాల్లోని పేదలకు శాశ్వత గృహ సదుపాయం కల్పించే లక్ష్యంతో అమరావతి ప్రాంతంలో సుమారు 5,034 టిడ్కో ఇళ్లను నిర్మించింది. సకల సౌకర్యాలతో అత్యంత ఆధునికంగా నిర్మించిన వీటికి డ్రైనేజీ, విద్యుత్‌, నీరు, రహదారులు వంటి మౌలిక సౌకర్యాలు మాత్రమే కల్పించాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణ పనులను రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నిలిపివేసింది. దాదాపు 90శాతం పూర్తయిన టిడ్కో ఇళ్ల పనులు చేపట్టలేదు. 10శాతం పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించకుండా నాలుగేళ్లుగా వారిపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఆర్‌5 జోన్‌ ఏర్పాటుతో ఇతర ప్రాంతాల్లో నివసించే పేదలకు రాజధాని ప్రాంతంలో సెంటు స్థలం చొప్పున సుమారు 54వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జీవో 45 తీసుకొచ్చింది. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, మందడం గ్రామాల పరిధిని అర్‌5 జోన్‌ గా ప్రకటించి 1134.58 ఎకరాలు పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించనున్నట్లు ఈ జీవోలో పేర్కొన్నారు. నవులూరులో 60 ఎకరాలు, ఎర్రబాలెంలో 150 ఎకరాలు, కురగల్లులో 60 ఎకరాలు అదనంగా నవరత్నాల పథకంలో భాగంగా పేదల ఇళ్లకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. దీనిపై గతంలో హైకోర్టు అధికారయంత్రాంగానికి అక్షింతలు వేసింది. అయినప్పటికీ ప్రభుత్వం మరోసారి ముందడుగు వేయడంతో రైతులు కోర్టును ఆశ్రయించారు. రెండుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. దీంతో ప్రభుత్వం జంగిల్‌ క్లియరెన్స్‌ పేరుతో పొక్లెయిన్లను తీసుకొచ్చి రాజధాని భూముల చదును పేరుతో హడావుడి చేస్తోంది. దీనిపై రాజధాని నిర్మాణం కోసం ఉచితంగా భూములిచ్చిన రైతులు భగ్గుమంటున్నారు. తమతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఏమిటి ? ప్రస్తుతం చేస్తున్నదేమిటి ? చేతిలో అధికారం ఉందని, దౌర్జన్యంగా తాము ఇచ్చిన భూములను పప్పు బెల్లాల్లా పంచి, రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను చెడగొట్టడం, పేదల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టడం పాలకపెద్దలకు తగునా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. పేదలంటే ప్రభుత్వానికి అంత ప్రేమ ఉంటే భూములిచ్చిన రైతులకు కౌలు సక్రమంగా ఎందుకివ్వడం లేదు? వ్యవసాయకూలీలకు పెన్షన్లు సక్రమంగా ఎందుకు చెల్లించడం లేదు? రైతులకిచ్చిన ప్లాట్లను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. శనివారం సీఆర్‌డీఏ అధికారులు కురగల్లు పొలాల్లో చెట్లను తొలగించి భూమి చదును చేసే ప్రయత్నం చేయడంతో రైతులు అడ్డుకున్నారు. అప్పటికే పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పొలం చదును పనులను రైతులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు ఆదుపులోకి తీసుకుని మంగళగిరి రూరల్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మిగిలిన గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో మంగళగిరి స్టేషన్‌కు చేరుకుని పోలీసు దౌర్జన్య చర్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అమరావతి జేఏసీ నాయకులు పువ్వాడ సుధాకర్‌, ధనేకుల రామారావు, బెల్లంకొండ నరసింహారావు, కల్లం రాజశేఖరరెడ్డి, ఆకుల ఉమామహేశ్వరరావు, చిలక బసవయ్య, తోట రామారావు, గూడారి గోపాలకృష్ణ తదితరులు ప్రభుత్వ పాశవిక చర్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతి రాజధాని ప్రాంత రైతులంటే సీఎం జగన్‌కు ఎందుకింత కసి అని ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థిని ఈ ప్రాంతంలో గెలిపించడం తాము చేసిన తప్పా అని నిలదీశారు. దళితులు, పేదలు తమ బిడ్డలంటూ పదే పదే మాట్లాడే ముఖ్యమంత్రికి రాజధాని ప్రాంతంలో నివసించే దళితులు కనిపించడం లేదా కడిగిపారేశారు.
దళిత నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిని విధ్వంసం చేయడాన్ని సీఎం ఇకనైనా మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని, రాజధానిని కాపాడుకోవడానికి ప్రాణ త్యాగాలకైనా వెనుకాడబోమని వారు హెచ్చరించారు. రైతుల నిరసనలతో మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడడంతో ఉన్నతాధికారుల జోక్యంతో అరెస్ట్‌ చేసిన రైతులను విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img