Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

డీబీటీ టెన్షన్‌!

. ఆసరా, విద్యాదీవెనపై ప్రభుత్వం దృష్టి
. ఈసీ నిర్ణయం కోసం ఎదురు చూపు
. కొనసాగుతున్న పెన్షనర్ల వెతలు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో తాజాగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) వ్యవహారం రాజకీయ పార్టీలను టెన్షన్‌కు గురిచేస్తున్నది. ఇప్పటికే సామాజిక పెన్షన్ల పంపిణీ సవ్యంగా జరగడం లేదు. ఒకటో తేదీన ఇవ్వాల్సిన పెన్షన్లు ఇంతవరకూ పూర్తిగా అవ్వా, తాతలకు దరిచేరలేదు. పెన్షన్ల దారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అవస్థలకు గురవుతున్నారు. పెన్షన్లపై అధికార వైసీపీ, ఎన్‌డీఏ కూటమి పార్టీలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. ఈ సమస్య ఇలాగే కొనసాగుతుంటే, ప్రభుత్వం అమలు చేస్తూ ఎన్నికల కోడ్‌తో ఆగిపోయిన పథకాల పంపిణీకి అవకాశం కల్పించాలంటూ రెండు వారాల క్రితం ఈసీకి ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ ఆసరా, విద్యా దీవెన, రైతుల ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, ఈబీసీ నేస్తం తదితర పథకాల డీబీటీకి అవకాశం కల్పించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వాస్తవంగా ఎన్నికల కోడ్‌ రాగానే అన్ని పథకాలను ఈసీ నిలిపివేస్తుంది. అదే సమయంలో పెన్షన్ల పంపిణీ తరహాగానే ఈ డీబీటీ పథకాలకూ అనుమతివ్వాలని ప్రభుత్వం కోరింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఆ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు చేరడం లేదని, నిరుపేదలైన లబ్ధిదారులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ లేఖలో తెలిపింది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యం నిలిపివేస్తున్నదని వివరించింది. దీనిపై ఈసీ నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఎలాంటి స్పందన లేదు. ఈ పథకాలన్నిటికీ అనుమతిస్తే, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డీబీటీ ద్వారా నిరుపేద లబ్ధిదారులకు పంపిణీ కాకుండా ఎన్‌డీఏ కూటమి పార్టీలు అడ్డుకుంటున్నాయంటూ తెరపైకి వైసీపీ నేతలు కొత్త పల్లవి తీసుకొచ్చారు. నిధులు విడుదల కాకుండా టీడీపీ, బీజేపీ అడ్డుపడుతున్నదని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తదితరులు ఆరోపిస్తున్నారు. ఎన్‌డీఏ కూటమి పొత్తు అనంతరం ఆ పార్టీ నేతలు లాబీయింగ్‌కు పాల్పడి నిరుపేద పేదలకు డీబీటీ అందకుండా చూస్తున్నారని, పెన్షన్ల తరహాలోనే డీబీటీ నిధులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. ముఖ్యంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం రెగ్యులర్‌గా అమలు చేస్తున్న పథకాలను ఈసీ అడ్డుకునే అవకాశం లేదని వైసీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పెన్షనర్ల డబ్బులో కోత
పెన్షనర్ల డబ్బును బ్యాంకుల్లో జమ చేయడంతో సర్‌చార్జీల పేరుతో కోత విధిస్తున్నారు. వచ్చే రూ.3 వేల పెన్షన్‌ తగ్గిపోవడంతో వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. చాలా జిల్లాల్లో పెన్షనర్లు బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65.49 లక్షల మంది పెన్షన్‌ దారులున్నారు. వారిలో 48.92 లక్షల మందికి బ్యాంకు ఖాతాలున్నాయని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. పెన్షన్‌ దారుల ఖాతాలు లావాదేవీలు జరగలేదని, మినిమం బ్యాలెన్స్‌ లేవని ఇతర కారణాలు చెప్పి రూ.400 ఆపైన చార్జీలు వసూలు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాజకీయ పార్టీలు సూచించినప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యంతో వృద్ధులు చనిపోయారు. వలంటీర్లు ఉన్నప్పుడు పెన్షనర్లకు సమస్య తలెత్తలేదని అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. అయితే సచివాలయాల పరిధిలో ఉన్న సిబ్బందితో పెన్షన్లను ఇంటింటికీ ఎందుకు పంపిణీ చేయడం లేదంటూ టీడీపీ, బీజేపీ, జనసేన ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని మండిపడుతున్నాయి. ఈ మేరకు పెన్షనర్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా లేఖ రాశారు. అధికార పక్షానికి సీఎస్‌ అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ లేఖలో విమర్శించారు. పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img