Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తెలంగాణ ముందుకొస్తేనే..

గెజిట్‌ అమలుపై ఏపీ షరతు
జూరాల ప్రాజెక్టు బోర్డు అధీనంలోకే
కొనసాగుతున్న సందిగ్ధత

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఉభయ రాష్ట్రాల పరిధిలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కూడా తమ ప్రాజెక్టులను బోర్డుకు స్వాధీనం చేస్తేనే ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని మెలిక పెట్టింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ గురువారం నుంచి అమల్లోకి వస్తుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రకటించడం, ఆ మేరకు రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకోనున్నట్లు వెల్లడిరచిన విషయం తెల్సిందే. గెజిట్‌ అమలులోకి వస్తే శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. అవుట్‌లెట్ల అప్పగింతకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని కేఆర్‌ఎంబీ కోరింది. అయితే ప్రాజెక్టులు బోర్డులకు అప్పగింతపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. రాష్ట్ర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు సిద్ధమంటున్న ఏపీ ప్రభుత్వం…తెలంగాణ కూడా అందుకు ముందుకు రావాలని షరతు పెట్టింది. కేఆర్‌ఎంబీ సమావేశంలో ఆమోదించిన తీర్మానం మేరకు అధికారులు, ప్లాంట్‌, యంత్రాలు, సిబ్బంది అప్పగింతపై జీవో జారీ చేసింది. కార్యాలయాలు, వాహనాలు, డీపీఆర్‌లు, హెడ్‌వర్కుల పరిధిలోని డ్యామ్‌లు, రిజర్వాయర్లు, రెగ్యులేటరీ స్ట్రక్చర్లు అప్పగిస్తామని తెలిపింది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌ వే, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, హంద్రీనీవా ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి పథకం పనులు అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొంది. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టును బోర్డు అధీనంలోకి తీసుకోవాలని కేఆర్‌ఎంబీని కోరింది. ఎగువ ప్రాంతంలో ఉన్న జూరాల ప్రాజెక్టును స్వాధీనం చేసుకోకపోతే శ్రీశైలంకు వచ్చే నీటి ప్రవాహానికి ఇబ్బంది ఉంటుందని పేర్కొంది.
గెజిట్‌ అమలుపై తెలంగాణ ఉపసంఘం ఏర్పాటు
గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు సహా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌ నేతృత్వంలో ఉపసంఘం ఏర్పడిరది. గెజిట్‌ నోటిఫికేషన్‌ నేపథ్యంలో సంబంధిత అంశాలు, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ, సీడబ్ల్యూసీ ఆపరేషన్‌ ప్రోటోకాల్‌పై దృష్టి సారించాలని పేర్కొంది. ముసాయిదా నిబంధనలు, ఆపరేషన్‌ ప్రొటోకాల్స్‌ను అధ్యయనం చేయాలని సూచించింది.
బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు వాదిస్తున్న అంశాలను పరిగణనలోకి తీసుకొని…రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాధాన్యాలు, నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిఫారసులు చేయాలని ఉపసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 30లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img