Friday, April 26, 2024
Friday, April 26, 2024

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌

వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్‌

న్యూదిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ స్వర్ణాల పంట పండిస్తోంది. భారత అగ్రశ్రేణి బాక్సర్‌… తెలుగు తేజం నిఖత్‌ జరీన్‌… మరోసారి సత్తా చాటింది. వరుసగా రెండోసారి ఫైనల్లో విజయం సాధించి పసిడి పతకం అందుకుంది. 50 కిలోల విభాగంలో నిఖత్‌ జరీన్‌ చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్‌లో రెండుసార్లు ఆసియా కప్‌ విజేత అయిన గుయెన్‌ థి టామ్‌(వియత్నాం)ను ఓడిరచింది. ఈ చాంపియన్‌షిప్‌లో జరీన్‌కు ఇది రెండో బంగారు పతకం. దీంతో ఈ టోర్నీలో రెండు బంగారు పతకాలు గెలిచిన రెండో భారతీయురాలిగా నిఖత్‌ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఒలింపిక్‌ విజేత మేరీ కామ్‌ మాత్రమే ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలుచుకోగలిగింది.
గెలుపే లక్ష్యంగా బరిలోకి దిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆది నుంచి నిఖత్‌ జరీన్‌ జోరు కొనసాగించింది. ప్రత్యర్థి ఎవరైనా సరే గెలుపే లక్ష్యంగా

బరిలోకి దిగింది. క్వార్టర్స్‌ బౌట్‌లో నిఖత్‌ 5-2 తేడాతో చుతామత్‌ రక్సాత్‌(థాయ్‌లాండ్‌)పై అద్భుత విజయం సాధించింది. ఫైనల్లో నిఖత్‌… గుయెన్‌ థి టామ్‌పై పంచ్‌ల వర్షం కురిపించింది. ఆమె ధాటికి వియత్నాం బాక్సర్‌ చేతులెత్తేసింది. గతేడాది 52 కేజీల విభాగంలో పసిడి దక్కించుకున్న నిఖత్‌… ఈసారి 50 కేజీల విభాగంలో స్వర్ణాన్ని సొంతం చేసుసుకొని చరిత్ర సృష్టించింది. కాగా శనివారం భారత్‌ రెండు బంగారు పతకాల్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 48 కేజీల విభాగంలో నీతు గాంగాస్‌ 5-0 తేడాతో లుత్సాయిఖాన్‌ (మంగోలియా)ను చిత్తుచేయగా.. మరోవైపు 81 కేజీల విభాగం టైటిల్‌ పోరులో స్వీటీ 4-3తో వాంగ్‌ లీనా (చైనా)పై పోరాడి గెలిచింది.
గతంలో నిఖత్‌ సాధించిన పతకాలు
టర్కీలో జరిగిన 2011 ప్రపంచ జూనియర్‌, యూత్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి. 2014 నేషన్స్‌ కప్‌లో పసిడి.
2015 జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి. 2016 దక్షిణాసియా ఫెడరేషన్‌ క్రీడల్లో కాంస్యం
2018 సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన టోర్నీలో పసిడి. 2019 థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో రజతం.
2019, 2022ల్లో స్ట్రాంజా మెమోరియల్‌లో పసిడి. 2022 మే నెలలో ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి.
2022 కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి. 2023 ఐబీఏ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మరో పసిడి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img