Friday, May 3, 2024
Friday, May 3, 2024

విజయవంతంగా కొనసాగుతోన్న భారత్‌ బంద్‌

దిల్లీ సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు భారత్‌ బంద్‌ను పాటిస్తున్నాయి. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ఈ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన బంద్‌ మధ్యాహ్నం 4 గంటల వరకూ కొనసాగనుంది. పంజాబ్‌, హర్యానాల్లో జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలు, లింక్‌ రోడ్లు, రైల్వే ట్రాక్‌లను రైతులు దిగ్బంధం చేశారు. రోడ్లు, రైల్‌ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పంజాబ్‌లో రైతులు 350కి పైగా ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్నారు. ప్రదర్శనా స్థలాల్లో శాంతి భద్రతల పరిస్థితిని కాపాడాలని పోలీసు బలగాలకు పంజాబ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏజీడీపీ) ఆదేశాలిచ్చారు. బంద్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం బలగాలను మోహరించింది. ధర్నా ప్రాంతాల వద్ద గట్టి నిఘా ఉంచారు. యూపీ నుంచి గాజిపూర్‌ వైపునకు రాకపోకలు సాగకుండా పోలీసులు రహదారులను మూసివేశారు. దీంతో దిల్లీ, యూపీ మధ్య తిరిగే వాహనదారులకు అంతరాయం ఏర్పడిరది. హర్యానాలోనూ హైవేలు దిగ్బంధం చేశారు. ఒక్క జింద్‌ జిల్లాలోనే 25 ప్రాంతాలను దిగ్బంధం చేశారు. పశ్చిమబెంగాల్‌లోనూ వామపక్షాలు బంద్‌కు దగడంతో రైళ్ల రాకపోకలకు అవాంతరాలు ఏర్పడ్డాయి.బంద్‌ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు మూసి ఉంచాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. అయితే అత్యవసర సేవలైన ఆసుపత్రులు, మెడికల్‌ షాపులు, సహాయ, పునారావాస కార్యక్రమాలు, వ్యక్తిగత ఎమెర్జెన్సీ పనులకు హాజరయ్యే వారికి బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. స్వచ్ఛందంగా, శాంతియుతంగా బంద్‌ పాటించాలని కోరింది.కాగా, బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బంద్‌కు మద్దతు ప్రకటించారు. బీహార్‌ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ భారత్‌ బంద్‌లో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రభుత్వాలు కూడా బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించాయి. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img